నేనొక సీనియర్ సిటిజన్‌ని. నా పెట్టుబడుల నుంచి ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం కావాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ ప్రతీ నెలా మంచి ఆదాయాన్నిస్తుందని, అదే సమయంలో పెట్టుబడి కూడా వృద్ధి చెందుతుందని తెలిసిన ఒక వ్యక్తి చెప్పారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? – ఈల నందన
ఇది నిజమే. కానీ పెట్టుబడులపై డివిడెండ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవద్దు. మ్యూచువల్ ఫండ్ పథకం రాబడులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి కానీ డివిడెండ్‌కు కాదు. స్వల్పకాలాల్లో అదేపనిగా స్థిరమైన రాబడులను మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇవ్వడం సాధ్యం కాదు. అన్ని పథకాలు మధ్య మధ్యలో కొంత ప్రతికూల కాలాలను ఎదుర్కొంటుంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా అంతే. ప్రస్తుతం ఈ పథకం మంచి పనీతీరునే ప్రదర్శిస్తోంది.
గ్రోత్ ప్లాన్‌ను ఎంపిక చేసుకుని.. ప్రతీ నెలా కావాల్సినంత మేర ఉపసంహరించుకునేలా సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. అయితే మీ మొత్తం పెట్టుబడి నుంచి ఒక ఏడాదిలో ఉపసంహరించుకునే మొత్తం 6 శాతాన్ని మించకుండా చూసుకోండి. ఉదాహరణకు రూ.లక్ష ఇన్వెస్ట్ చేశారనుకుంటే.. మ్యూచువల్ ఫండ్ పథకం 10 శాతం రాబడి ఇస్తున్నట్టయితే అప్పుడు ప్రతీ నెలా రూ.500 మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ రూపంలో తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఏడాది తర్వాత పెట్టుబడి మొత్తం రూ.1.04 లక్షలుగా ఉంటుంది. ఈ విధానం వల్ల మ్యూచువల్ ఫండ్ పథకం కొంత కాలం పాటు ప్రతికూలతలు ఎదుర్కొన్నా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 4 శాతం మేర రాబడులు పెట్టుబడికి జమ అవుతుంటాయి. దీర్ఘకాలంలో ఇది కూడా వృద్ధి చెందుతుంది.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిపాజిట్లు.. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది మెరుగైన ఆప్షన్ అవుతుంది? – అంకిత్ జైన్
రెండింటిలోనూ భద్రత ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో కాస్త అధిక భద్రత ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడుల పరంగా వైవిధ్య ప్రయోజనం లభిస్తుంది. అదే సమయంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిపాజిట్‌లో రిస్క్ ఉంటుందని కాదు. ఆర్‌బీఐ సూక్ష్మంగా వాటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కొత్త నమూనా కింద వచ్చినవి. ఇంకా విశ్వసనీయతను సంపాదించుకోవాల్సి ఉంది. అంటే అవి భద్రత లేనివి అని కాదు. డెట్ ఫండ్‌లో మీరు రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఆ మొత్తం కూడా 30 డెట్ సాధనాల మధ్య విస్తరించి ఉంటుంది.
ఒకవేళ ఏదైనా ఒక్కటి అంచనాలు తప్పినా.. పెట్టుబడుల్లో 5–7 శాతం వాటా మించి ఉండదు. అంటే మీ పెట్టుబడులు మొత్త రిస్క్‌లో పడినట్టు కాదు. మూడేళ్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తే డెట్‌సాధనాల రాబడులపై పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పైగా వీటిల్లో లిక్విడిటీ అధికం. విక్రయించిన రెండు రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే.. మెచ్యూరిటీ సమయానికి ఎంత మొత్తం వస్తుందన్నది డిపాజిట్స్‌లో తెలుస్తుంది. డెట్ ఫండ్స్‌లో అయితే రాబడులు అంచనాలపైనే ఆధారపడి ఉంటాయి.
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు టర్మినల్ ఇల్‌నెస్ రైడర్, ఇతర రైడర్లను యాడ్ చేసుకోవాలా లేక విడిగా పాలసీ తీసుకోవడం మంచిదా? – సుహాస్
రైడర్లు అయితే చౌకగా వస్తాయి. తక్కువ వ్యయానికే కవరేజీనిచ్చే మంచి ప్లాన్‌లు. ఊహించనిది జరిగితే ఆదుకుంటాయి. మీ టర్మ్ ఇన్సూరెన్స్‌కు రైడర్లను జోడించుకోవడం మంచిదే.
Comments
Please login to add a commentAdd a comment