monthly salary
-
క్లింకార కేర్ టేకర్ ఎవరో తెలుసా ?
-
చివరి నెల వేతనం హుళక్కే!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో అందించే బెనిఫిట్స్ పూర్తిగా ఇవ్వకుండా ఆర్టీసీ కోత పెడుతోంది. గతేడాది సెప్టెంబరు వరకు పద్ధతిగానే చెల్లింపులు జరిగినా, ఆ తర్వాత నుంచి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎగ్గొడుతోంది. దీంతో గత సెప్టెంబరు తర్వాత పదవీ విరమణ పొందిన వారంతా వాటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయబోతున్న నేపథ్యంలో, బకాయిలను చెల్లించిన తర్వాతే విలీనం చేయాలని వారంటున్నారు. లేకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆ నాలుగింటిలో కోత.. ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన వెంటనే, సంస్థ నుంచి వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ అప్పటికప్పుడు చెల్లించే ఆనవాయితీ ఉండేది. కొన్నేళ్లుగా ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఈ చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏడాదిగా కొన్నింటిని నిలిపేసి మిగతావి చెల్లించే విచిత్ర పద్ధతి ప్రారంభమైంది. పీఎఫ్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ, గ్రాట్యూటీ లాంటి వాటిని చెల్లి స్తున్నా... నాలుగింటి విషయంలో కోత తప్పటం లేదు. వేతన సవరణ బాండ్లు: 2013లో ఆర్టీసీ వేతన సవరణ జరగాల్సి ఉండగా, రాష్ట్రం విడిపోయాక దాన్ని 2015లో అమలు చేశారు. ఆ సమయంలో బకాయిలను సగం నగదు రూపంలో, మిగతా సగం బాండ్ల రూపంలో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ బాండ్ల రూపంలో చెల్లించే మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో ముట్టచెబుతూ వస్తున్నారు. గతేడాది సెప్టెంబరు నుంచి వీటిని చెల్లించడం లేదు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్: గరిష్టంగా 300 వరకు ఆర్జిత సెలవుల మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో చెల్లించటం ఆనవాయితీ. డ్రైవర్, కండక్లర్లకు రూ.4–5 లక్షల వరకు, అధికారులకైతే వారి స్థాయినిబట్టి రూ.10–15 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఏడాదిగా చెల్లించకుండా పెండింగులో పెట్టారు. చివరి నెల వేతనం: పదవీ విరమణ పొందిన నెలకు సంబంధించిన వేతనాన్ని కాస్త ఆలస్యంగా అందిస్తారు. ఏ రూపంలోనైనా సంస్థకు అతను చెల్లించాల్సిన మొత్తం ఏమైనా ఉంటే అందులో నుంచి మినహాయించి మిగతాది ఇస్తారు. ఈ లెక్కలు చూసేందుకు నాలుగైదు రోజుల సమయం తీసుకుని, రిటైరైన వారంలోపు చెల్లించేవారు. ఇప్పుడు దాన్నీ ఆపేశారు. కరువు భత్యం బకాయిలు: కొన్నేళ్లుగా డీఏలు సకాలంలో చెల్లించటం లేదు. దాదాపు 8 డీఏలు పేరుకుపోయాయి. వాటిని గత కొన్ని నెలల్లో క్లియర్ చేశారు. ఆ డీఏ చెల్లించాల్సిన కాలానికి ఉద్యోగి సర్వీసులోనే ఉన్నా, ఆలస్యంగా దాన్ని చెల్లించే నాటికి కొందరు రిటైర్ అవుతున్నారు. ఇలా ఆలస్యంగా చెల్లిస్తున్న వాటిని... సర్వీసులో ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు, కానీ రిటైరైన వారికి ఇవ్వడం లేదు. ఇక సీసీఎస్ మాటేమిటి? ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను ఆర్టీసీ వాడేసుకుని వడ్డీతో కలిపి రూ.వేయి కోట్లు బకాయి పడింది. కార్మికుల వేతనం నుంచి ప్రతినెలా నిర్ధారిత మొత్తం కోత పెట్టి సీసీఎస్‌లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని రిటైరైన వెంటనే చెల్లించాలి. కార్మికులు వాటిని డిపాజిట్లుగా సీసీఎస్‌లో అలాగే ఉంచితే దానిపై వడ్డీ చెల్లించాలి. ఇదంతా సీసీఎస్ పాలక మండలి చూస్తుంది. కానీ, ఆ నిధులు ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో రిటైరైన వారికి చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. సర్వీసులో ఉన్న వారు వారి అవసరాలకు తీసుకుందామన్నా ఇవ్వటం లేదు. ఇది పదవీ విరమణ పొందిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారికీ సంబంధించిన సమస్య. -
ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే పథకాలున్నాయా?
నేనొక సీనియర్ సిటిజన్ని. నా పెట్టుబడుల నుంచి ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం కావాలి. హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ప్రతీ నెలా మంచి ఆదాయాన్నిస్తుందని, అదే సమయంలో పెట్టుబడి కూడా వృద్ధి చెందుతుందని తెలిసిన ఒక వ్యక్తి చెప్పారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? – ఈల నందన ఇది నిజమే. కానీ పెట్టుబడులపై డివిడెండ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవద్దు. మ్యూచువల్ ఫండ్ పథకం రాబడులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి కానీ డివిడెండ్‌కు కాదు. స్వల్పకాలాల్లో అదేపనిగా స్థిరమైన రాబడులను మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇవ్వడం సాధ్యం కాదు. అన్ని పథకాలు మధ్య మధ్యలో కొంత ప్రతికూల కాలాలను ఎదుర్కొంటుంటాయి. హెచ్డీఎఫ్సీ బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా అంతే. ప్రస్తుతం ఈ పథకం మంచి పనీతీరునే ప్రదర్శిస్తోంది. గ్రోత్ ప్లాన్‌ను ఎంపిక చేసుకుని.. ప్రతీ నెలా కావాల్సినంత మేర ఉపసంహరించుకునేలా సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) ఎంపిక చేసుకోవాలి. అయితే మీ మొత్తం పెట్టుబడి నుంచి ఒక ఏడాదిలో ఉపసంహరించుకునే మొత్తం 6 శాతాన్ని మించకుండా చూసుకోండి. ఉదాహరణకు రూ.లక్ష ఇన్వెస్ట్ చేశారనుకుంటే.. మ్యూచువల్ ఫండ్ పథకం 10 శాతం రాబడి ఇస్తున్నట్టయితే అప్పుడు ప్రతీ నెలా రూ.500 మొత్తాన్ని ఎస్‌డబ్ల్యూపీ రూపంలో తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఏడాది తర్వాత పెట్టుబడి మొత్తం రూ.1.04 లక్షలుగా ఉంటుంది. ఈ విధానం వల్ల మ్యూచువల్ ఫండ్ పథకం కొంత కాలం పాటు ప్రతికూలతలు ఎదుర్కొన్నా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 4 శాతం మేర రాబడులు పెట్టుబడికి జమ అవుతుంటాయి. దీర్ఘకాలంలో ఇది కూడా వృద్ధి చెందుతుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిపాజిట్లు.. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది మెరుగైన ఆప్షన్ అవుతుంది? – అంకిత్ జైన్ రెండింటిలోనూ భద్రత ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో కాస్త అధిక భద్రత ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడుల పరంగా వైవిధ్య ప్రయోజనం లభిస్తుంది. అదే సమయంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు డిపాజిట్లో రిస్క్ ఉంటుందని కాదు. ఆర్బీఐ సూక్ష్మంగా వాటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కొత్త నమూనా కింద వచ్చినవి. ఇంకా విశ్వసనీయతను సంపాదించుకోవాల్సి ఉంది. అంటే అవి భద్రత లేనివి అని కాదు. డెట్ ఫండ్‌లో మీరు రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఆ మొత్తం కూడా 30 డెట్ సాధనాల మధ్య విస్తరించి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక్కటి అంచనాలు తప్పినా.. పెట్టుబడుల్లో 5–7 శాతం వాటా మించి ఉండదు. అంటే మీ పెట్టుబడులు మొత్త రిస్క్‌లో పడినట్టు కాదు. మూడేళ్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తే డెట్సాధనాల రాబడులపై పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పైగా వీటిల్లో లిక్విడిటీ అధికం. విక్రయించిన రెండు రోజుల్లో మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే.. మెచ్యూరిటీ సమయానికి ఎంత మొత్తం వస్తుందన్నది డిపాజిట్స్‌లో తెలుస్తుంది. డెట్ ఫండ్స్‌లో అయితే రాబడులు అంచనాలపైనే ఆధారపడి ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు టర్మినల్ ఇల్నెస్ రైడర్, ఇతర రైడర్లను యాడ్ చేసుకోవాలా లేక విడిగా పాలసీ తీసుకోవడం మంచిదా? – సుహాస్ రైడర్లు అయితే చౌకగా వస్తాయి. తక్కువ వ్యయానికే కవరేజీనిచ్చే మంచి ప్లాన్లు. ఊహించనిది జరిగితే ఆదుకుంటాయి. మీ టర్మ్ ఇన్సూరెన్స్‌కు రైడర్లను జోడించుకోవడం మంచిదే. చదవండి: ‘ఎస్బీఐ లాంటివి నాలుగైదు బ్యాంకులు కావాలి’ -
ఊళ్లు తిరిగే ఉద్యోగానికి రూ.72 లక్షల జీతం
పొద్దస్తమానూ ఆఫీసులో చేసినపనే చేస్తూ బోరు కొడుతోందా?...జీవితాంతం ఇల్లూ..పిల్లలే తప్ప మరో యావ లేక విసుగనిపిస్తోందా?..ఈ ఝంఝాటాలన్నీ వదిలేసి హాయిగా తిరిగేస్తూ బతకాలనిపిస్తోందా...అయితే, ఈ ఉద్యోగం మీ కోసమే. ఇది మాములు ఉద్యోగాల్లాంటిది కాదు! ఆఫీసు టైమింగ్సు, రూల్సు వంటివేమీ ఉండవు. మీరు చేయాల్సిందల్లా మీ బాస్‌తో కలసి విహార యాత్రలకు వెళ్లడం, మంచి మంచి ఫొటోలు తీయడం. దీనికి మీకొచ్చే జీతం ఎంతో తెలుసా... నెలకు రూ.72 లక్షలు! మీకు ఫొటోలు తీయడం బాగా వస్తే, ప్రయాణాలు చేయడం ఇష్టమయితే ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి. బ్రిటన్‌కు చెందిన ధనిక కుటుంబం ఒకటి ఈ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది. వారికి ప్రపంచ వ్యాప్తంగా హాలిడే హోంలు, రిసార్టులున్నాయి. మీరు చేయాల్సింది వారి వెంట తిరగడం. పర్యటనకు సంబంధించి అద్భుతమైన ఫోటోలు తీయడం. మీ విషయాలన్నీ వాళ్లే చూసుకుంటారు. ఒకే ఒక ఇబ్బంది.. ఈ ఉద్యోగంలో ఏడాదికి నెల రోజులు సెలవు కూడా ఇస్తారండోయ్. అయితే వాళ్ల టూర్లకు అడ్డం కాకుండా సెలవు తీసుకోవచ్చు. 2019, ఫిబ్రవరి నుంచి ఈ ఉద్యోగం మొదలవుతుంది. ఉద్యోగంలో ఓ ఇబ్బందేమిటంటే కుటుంబంతో ఎక్కువగా గడిపే అవకాశం ఉండదు. ‘ఆ..దాందేముంది..నెలకి లక్షలకు లక్షలకు వస్తోంటే..కుటుంబంతో ఏదోలా మేనేజ్ చేసుకోవచ్చు’అంటారా...ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే పెర్ఫోకల్ సైట్‌కి వెళ్లి దరఖాస్తు పడేయండి. -
దొంగలు కావలెను..
నెల తిరగ్గానే జీతం.. డైలీ టార్గెట్లు.. అది సాధించకపోతే సాలరీ కటింగ్‌లు.. ఇవన్నీ మార్కెటింగ్ రంగంలో ఉద్యోగాలు చేసేవారికి కామనే.. కానీ ఇవి ‘దొంగ’ ఉద్యోగం కోసం అని చెబితే.. జైపూర్‌లో జరిగిన విచిత్రమైన సంఘటన ఇదీ.. కార్పొరేట్ కంపెనీలు, మార్కెటింగ్ సంస్థలు కల్పించే సౌకర్యాలన్నీ వివిధ రకాల నేరాలకు పాల్పడే దొంగలకు కల్పించడం ద్వారా వినూత్న పంథాకు తెరతీశాడో 21 ఏళ్ల యువకుడు. మోటారు సైకిళ్లు, బంగారు గొలుసులు, మొబైల్ ఫోన్లు తదితర దొంగతనాలకు పాల్పడేందుకు జైపూర్‌కు చెందిన ఆశిష్ మీనా అలియాస్ అమిత్ ఆరుగురు నిరుద్యోగ యువకులను జీతాలపై (నెలకు రూ.15 వేల చొప్పున) రిక్రూట్ చేసుకున్నాడు. వారికి డైలీ టార్గెట్లు ఫిక్స్ చేశాడు. కనీసం ఒక్క నేరానికైనా పాల్పడకపోతే ఆ రోజు జీతం కట్ అయినట్టే. జైపూర్‌లోని ఒక ప్రాంతంలో మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాల చోరీలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రత్యేక పోలీసు బృందం అక్కడి సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించింది. చోరీ అయిన మొబైల్ ఫోన్ల లొకేషన్‌ను పోలీసులు ట్రాక్ చేశారు. అక్కడికి దగ్గరలోని ఒక అద్దె ఇంట్లో ఈ గ్యాంగ్ సభ్యులు దాక్కున్నట్టుగా ఓ అజ్ఞాతవ్యక్తి ద్వారా వచ్చిన సమాచారంతో పోలీసులు వల పన్ని వీరిని పట్టుకున్నారు. మొత్తం 33 సెల్ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్, రెండు గొలుసులు, నాలుగు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన మోటార్ సైకిళ్లనే వారు మహిళల మెడలో గొలుసులు తెంచేందుకు ఉపయోగించడం మరో విశేషం. దొంగిలించిన వస్తువులను గ్యాంగ్‌లీడర్ అమిత్ వద్ద ‘అద్దె దొంగలు’డిపాజిట్ చేసేవారు. వీటిని విక్రయించి ఆ డబ్బుతో అమిత్ వారికి జీతాలు చెల్లించేవాడు.జైపూర్‌కు సమీపంలోని సవాయ్ మథోపూర్ జిల్లా గంగాపూర్ పట్టణానికి వెళ్లినపుడు అమిత్‌కు చదువురాని ఆరుగురు నిరుద్యోగులు తారసపడ్డారు. ఏదైనా ఉపాధి దొరికితే చాలు అన్నట్టుగా ఉన్న వారి పరిస్థితిని గమనించి నెలవారీ జీతాలపై దొంగతనాలు చేసే ఉద్యోగాలకు వారిని ఒప్పించాడు. దీంతో వారు తమ కార్యక్షేత్రాన్ని జైపూర్‌కు మార్చి, అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టారు. గత జూలైలో తాము ఉద్యోగంలో చేరామని, ఇప్పటిదాకా నలభైకిపైగా చోరీలకు పాల్పడినట్టు వారు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. తమకు అమిత్ నెలవారీ వేతనాలిస్తున్నాడని, చోరీకి పాల్పడని రోజు జీతంలో కోత విధిస్తున్నాడని వెల్లడించారు. -
ఆర్బీఐ గవర్నర్ జీతమెంతో తెలుసా..?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ నెల జీతమెంతో తెలుసా? గత సెప్టెంబరు 4న ఆర్బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఊర్జిత్ తొలిసారి అక్టోబరు నెలకు పూర్తి నెల జీతం అందుకున్నారు. ఆయన 2.09 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు. అంతకుముందు ఆగస్టు నెలకు అప్పటి గవర్నర్ రఘురాం రాజన్ కూడా ఇంతే మొత్తంలో జీతం అందుకున్నారు. సమాచార హక్కు చట్టం కింద ఓ దరఖాస్తుదారు కోరిన మేరకు ఆర్బీఐ ఈ వివరాలు తెలియజేసింది. ఊర్జిత్ జీతం, సిబ్బంది వివరాలు, అంతకుముందు ఆర్బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ జీతాల వివరాలను వెల్లడించింది. ఊర్జిత్ ప్రస్తుతం ముంబైలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఆయన ఇంట్లో పనిచేసేందుకు సహాయ సిబ్బందిని కేటాయించలేదని ఆర్బీఐ వెల్లడించింది. ఊర్జిత్‌కు రెండు కార్లు, ఇద్దరు డ్రైవర్లను కేటాయించినట్టు తెలిపింది. ఊర్జిత్‌కు ముందు 2013 సెప్టెంబరు 5న ఆర్బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఆయన నెలకు 1.69 లక్షల రూపాయల జీతం తీసుకునేవారు. తర్వాత 2014లో ఆయన జీతం 1.78 లక్షలకు, 2015లో 1.87 లక్షల రూపాయలకు పెరిగింది. ఈ ఏడాది జనవరిలో రాజన్ జీతాన్ని 2.09 లక్షల రూపాయలకు పెంచారు. రాజన్‌కు మూడు కార్లు, నలుగురు డ్రైవర్లు, తొమ్మిదిమంది సహాయ సిబ్బందిని కేటాయించారు. ప్రస్తుతం గవర్నర్ ఊర్జిత్‌కు అంతే మొత్తంలో జీతం ఇస్తున్నా సహాయ సిబ్బందిని కేటాయించలేదు. -
చిరుద్యోగులకూ మే 24నే వేతనాలు
హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో మే నెల జీతాలు, పింఛన్లను అదే నెల 24వ తేదీన చెల్లించేయాలని నిర్ణయం తీసుకున్న ఆర్థిక శాఖ తాజాగా ఇప్పుడు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, హోంగార్డుల వేతనాలను కూడా మే 24వ తేదీనే చెల్లించేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు చేసి చిరుద్యోగులను వదిలేస్తే అన్యాయం అవుతుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒకటీ రెండురోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి.54,598 మంది కాంట్రాక్టు, 12,882 మంది వర్క్ చార్జ్డ్, 36,952 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 21,050 ఎన్‌ఎంఆర్‌లు, 2,59,368 మంది హోంగార్డులు కలిపి మొత్తం 3.84 లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలను పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరికి మే నెల వేతనాలను చెల్లించకపోతే జూన్ 2వ తేదీన రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక ఆ నెల వేతనాన్ని ఏ రాష్ట్రం చెల్లించాలనే సమస్య ఉత్పన్నమవుతుందని, దీంతో ఉద్యోగులు ఇబ్బంది పడతారనే ఆలోచనతో ఆర్థిక శాఖ పై నిర్ణయం తీసుకుంది. ఇలావుండగా.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల సంబంధిత బిల్లులను మే 17వ తేదీలోగా సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం అన్ని శాఖలకు మెమో జారీ చేశారు. మిగతా అన్ని రకాల బిల్లుల సమర్పణకు కూడా మే 15 చివరితేదీగా ఆర్థిక శాఖ నిర్ణయించింది. -
‘ఉపాధి’ ఈపీఎఫ్ ఊసేది ?
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: నెలానెలా జీతంలో ఈపీఎఫ్ (ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్)కట్ అవుతున్నా ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇది ఒక నెల, రెండు నెలల సమస్య కాదు. రెండేళ్లుగా కొనసాగుతోంది. కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(సీఆర్డీ) అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు నష్టపోతున్నారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో వివిధ విభాగాల్లో 9 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో వెయ్యి మంది ఏపీఓలు, 3 వేల మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 4,500 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, హెచ్ఆర్ , ప్లాంటేషన్ మేనేజర్లు 500 మందికి పైగా ఉన్నారు. వీరందరి జీతం నుంచి నెలనెలా 12 శాతం చొప్పున కట్ ఆవుతోంది. వారి పేర్ల మీద సీఆర్డీ అధికారులు ఖాతాలు తెరిచి ఆ మొత్తంతో పాటు ప్రభుత్వ వాటాగా మరో 10 శాతం జమ చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి ఉద్యోగులకు చెల్లించాలి. ఈ 9 వేల మంది ఉద్యోగులకు ఇప్పటివరకు ఈపీఎఫ్ ఖాతాలు తెరవకపోవడం దురదృష్టకరం. ఏపీఓల జీతం నుంచి ప్రతి నెలా రూ.1,300 వరకు కట్ అవుతోంది. వివిధ స్థాయిలో పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగుల జీతంలో నుంచి కూడా 12 శాతం మొత్తం కట్ అవుతూనే ఉంది. 2011 నుంచి ఇప్పటి వరకు వీరి జీతాల్లో నుంచి సుమారు రూ.40 కోట్లకు పైగా కట్ చేశారు. ఈ మొత్తాన్ని మరో అకౌంట్లో జమ చేస్తున్నామని సీఆర్డీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగా ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. అవి లేకపోవడంతో ఉద్యోగులు రుణాలకు నోచుకోవడం లేదు. మూడేళ్లుగా ఖాతాలు తెరవకుండా సీఆర్డీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గతంలో ఉద్యోగులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఇది గమనించిన అధికారులు వెంటనే ఈపీఎఫ్ అకౌంట్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఉపాధి హామీ పథకం నుంచి రాజీనామా చేసిన పలువురు వేరే శాఖల్లో ఉద్యోగాలు పొంది చేరిపోతున్నారు. ఇలాంటి వారు రాష్ట్రంలో వంద మందికిపైగా ఉన్నారు. నెల్లూరులో టీఏలు పనిచేసిన శాంతి, శివరంజని, వేణు, సునిత, సూర్యనారాయణ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఖాతాలే లేకపోవడంతో వీరికి చివరలో ఈపీఎఫ్ మొత్తం లభించలేదు. వెంటనే ఈపీఎఫ్ అకౌంట్స్ ప్రారంభించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.