నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: నెలానెలా జీతంలో ఈపీఎఫ్ (ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్)కట్ అవుతున్నా ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇది ఒక నెల, రెండు నెలల సమస్య కాదు. రెండేళ్లుగా కొనసాగుతోంది. కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్(సీఆర్‌డీ) అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు నష్టపోతున్నారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో వివిధ విభాగాల్లో 9 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో వెయ్యి మంది ఏపీఓలు, 3 వేల మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 4,500 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, హెచ్‌ఆర్ , ప్లాంటేషన్ మేనేజర్లు 500 మందికి పైగా ఉన్నారు. వీరందరి జీతం నుంచి నెలనెలా 12 శాతం చొప్పున కట్ ఆవుతోంది. వారి పేర్ల మీద సీఆర్‌డీ అధికారులు ఖాతాలు తెరిచి ఆ మొత్తంతో పాటు ప్రభుత్వ వాటాగా మరో 10 శాతం జమ చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి ఉద్యోగులకు చెల్లించాలి. ఈ 9 వేల మంది ఉద్యోగులకు ఇప్పటివరకు ఈపీఎఫ్ ఖాతాలు తెరవకపోవడం దురదృష్టకరం. ఏపీఓల జీతం నుంచి ప్రతి నెలా రూ.1,300 వరకు కట్ అవుతోంది.
వివిధ స్థాయిలో పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగుల జీతంలో నుంచి కూడా 12 శాతం మొత్తం కట్ అవుతూనే ఉంది. 2011 నుంచి ఇప్పటి వరకు వీరి జీతాల్లో నుంచి సుమారు రూ.40 కోట్లకు పైగా కట్ చేశారు. ఈ మొత్తాన్ని మరో అకౌంట్‌లో జమ చేస్తున్నామని సీఆర్‌డీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగా ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. అవి లేకపోవడంతో ఉద్యోగులు రుణాలకు నోచుకోవడం లేదు. మూడేళ్లుగా ఖాతాలు తెరవకుండా సీఆర్‌డీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గతంలో ఉద్యోగులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఇది గమనించిన అధికారులు వెంటనే ఈపీఎఫ్ అకౌంట్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు.
మరోవైపు ఉపాధి హామీ పథకం నుంచి రాజీనామా చేసిన పలువురు వేరే శాఖల్లో ఉద్యోగాలు పొంది చేరిపోతున్నారు. ఇలాంటి వారు రాష్ట్రంలో వంద మందికిపైగా ఉన్నారు. నెల్లూరులో టీఏలు పనిచేసిన శాంతి, శివరంజని, వేణు, సునిత, సూర్యనారాయణ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఖాతాలే లేకపోవడంతో వీరికి చివరలో ఈపీఎఫ్ మొత్తం లభించలేదు. వెంటనే ఈపీఎఫ్ అకౌంట్స్ ప్రారంభించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.
‘ఉపాధి’ ఈపీఎఫ్ ఊసేది ?
Published Mon, Jan 13 2014 4:10 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement