చివరి నెల వేతనం హుళక్కే! | Evasion of Retired Month Salary in TSRTC | Sakshi
Sakshi News home page

చివరి నెల వేతనం హుళక్కే!

Published Tue, Sep 12 2023 12:49 AM | Last Updated on Tue, Sep 12 2023 12:49 AM

Evasion of Retired Month Salary in TSRTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో అందించే బెనిఫిట్స్‌ పూర్తిగా ఇవ్వకుండా ఆర్టీసీ కోత పెడుతోంది. గతేడాది సెప్టెంబరు వరకు పద్ధతిగానే చెల్లింపులు జరిగినా, ఆ తర్వాత నుంచి కొన్ని బెనిఫిట్స్‌ ఇవ్వకుండా ఎగ్గొడుతోంది. దీంతో గత సెప్టెంబరు తర్వాత పదవీ విరమణ పొందిన వారంతా వాటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయబోతున్న నేపథ్యంలో, బకాయిలను చెల్లించిన తర్వాతే విలీనం చేయాలని వారంటున్నారు. లేకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. 

ఆ నాలుగింటిలో కోత..
ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన వెంటనే, సంస్థ నుంచి వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్‌ అప్పటికప్పుడు చెల్లించే ఆనవాయితీ ఉండేది. కొన్నేళ్లుగా ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఈ చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏడాదిగా కొన్నింటిని నిలిపేసి మిగతావి చెల్లించే విచిత్ర పద్ధతి ప్రారంభమైంది. పీఎఫ్, ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్బీటీ, గ్రాట్యూటీ లాంటి వాటిని చెల్లి స్తున్నా... నాలుగింటి విషయంలో కోత తప్పటం లేదు. 

వేతన సవరణ బాండ్లు: 2013లో ఆర్టీసీ వేతన సవరణ జరగాల్సి ఉండగా, రాష్ట్రం విడిపోయాక దాన్ని 2015లో అమలు చేశారు. ఆ సమయంలో బకాయిలను సగం నగదు రూపంలో, మిగతా సగం బాండ్ల రూపంలో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ బాండ్ల రూపంలో చెల్లించే మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో ముట్టచెబుతూ వస్తున్నారు. గతేడాది సెప్టెంబరు నుంచి వీటిని చెల్లించడం లేదు. 

లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌: గరిష్టంగా 300 వరకు ఆర్జిత సెలవుల మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో చెల్లించటం ఆనవాయితీ. డ్రైవర్, కండక్లర్లకు రూ.4–5 లక్షల వరకు, అధికారులకైతే వారి స్థాయినిబట్టి రూ.10–15 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఏడాదిగా చెల్లించకుండా పెండింగులో పెట్టారు. 

చివరి నెల వేతనం: పదవీ విరమణ పొందిన నెలకు సంబంధించిన వేతనాన్ని కాస్త ఆలస్యంగా అందిస్తారు. ఏ రూపంలోనైనా సంస్థకు అతను చెల్లించాల్సిన మొత్తం ఏమైనా ఉంటే అందులో నుంచి మినహాయించి మిగతాది ఇస్తారు. ఈ లెక్కలు చూసేందుకు నాలుగైదు రోజుల సమయం తీసుకుని, రిటైరైన వారంలోపు చెల్లించేవారు. ఇప్పుడు దాన్నీ ఆపేశారు. 

కరువు భత్యం బకాయిలు: కొన్నేళ్లుగా డీఏలు సకాలంలో చెల్లించటం లేదు. దాదాపు 8 డీఏలు పేరుకుపోయాయి. వాటిని గత కొన్ని నెలల్లో క్లియర్‌ చేశారు. ఆ డీఏ చెల్లించాల్సిన కాలానికి ఉద్యోగి సర్వీసులోనే ఉన్నా, ఆలస్యంగా దాన్ని చెల్లించే నాటికి కొందరు రిటైర్‌ అవుతున్నారు. ఇలా ఆలస్యంగా చెల్లిస్తున్న వాటిని... సర్వీసులో ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు, కానీ రిటైరైన వారికి ఇవ్వడం లేదు.  

ఇక సీసీఎస్‌ మాటేమిటి?
ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘం (సీసీఎస్‌) నిధులను ఆర్టీసీ వాడేసుకుని వడ్డీతో కలిపి రూ.వేయి కోట్లు బకాయి పడింది. కార్మికుల వేతనం నుంచి ప్రతినెలా నిర్ధారిత మొత్తం కోత పెట్టి సీసీఎస్‌లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని రిటైరైన వెంటనే చెల్లించాలి. కార్మికులు వాటిని డిపాజిట్లుగా సీసీఎస్‌లో అలాగే ఉంచితే దానిపై వడ్డీ చెల్లించాలి. ఇదంతా సీసీఎస్‌ పాలక మండలి చూస్తుంది. కానీ, ఆ నిధులు ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో రిటైరైన వారికి చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. సర్వీసులో ఉన్న వారు వారి అవసరాలకు తీసుకుందామన్నా ఇవ్వటం లేదు. ఇది పదవీ విరమణ పొందిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారికీ సంబంధించిన సమస్య. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement