leave encashment
-
చివరి నెల వేతనం హుళక్కే!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో అందించే బెనిఫిట్స్ పూర్తిగా ఇవ్వకుండా ఆర్టీసీ కోత పెడుతోంది. గతేడాది సెప్టెంబరు వరకు పద్ధతిగానే చెల్లింపులు జరిగినా, ఆ తర్వాత నుంచి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎగ్గొడుతోంది. దీంతో గత సెప్టెంబరు తర్వాత పదవీ విరమణ పొందిన వారంతా వాటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయబోతున్న నేపథ్యంలో, బకాయిలను చెల్లించిన తర్వాతే విలీనం చేయాలని వారంటున్నారు. లేకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆ నాలుగింటిలో కోత.. ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన వెంటనే, సంస్థ నుంచి వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ అప్పటికప్పుడు చెల్లించే ఆనవాయితీ ఉండేది. కొన్నేళ్లుగా ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఈ చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏడాదిగా కొన్నింటిని నిలిపేసి మిగతావి చెల్లించే విచిత్ర పద్ధతి ప్రారంభమైంది. పీఎఫ్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ, గ్రాట్యూటీ లాంటి వాటిని చెల్లి స్తున్నా... నాలుగింటి విషయంలో కోత తప్పటం లేదు. వేతన సవరణ బాండ్లు: 2013లో ఆర్టీసీ వేతన సవరణ జరగాల్సి ఉండగా, రాష్ట్రం విడిపోయాక దాన్ని 2015లో అమలు చేశారు. ఆ సమయంలో బకాయిలను సగం నగదు రూపంలో, మిగతా సగం బాండ్ల రూపంలో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ బాండ్ల రూపంలో చెల్లించే మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో ముట్టచెబుతూ వస్తున్నారు. గతేడాది సెప్టెంబరు నుంచి వీటిని చెల్లించడం లేదు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్: గరిష్టంగా 300 వరకు ఆర్జిత సెలవుల మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో చెల్లించటం ఆనవాయితీ. డ్రైవర్, కండక్లర్లకు రూ.4–5 లక్షల వరకు, అధికారులకైతే వారి స్థాయినిబట్టి రూ.10–15 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఏడాదిగా చెల్లించకుండా పెండింగులో పెట్టారు. చివరి నెల వేతనం: పదవీ విరమణ పొందిన నెలకు సంబంధించిన వేతనాన్ని కాస్త ఆలస్యంగా అందిస్తారు. ఏ రూపంలోనైనా సంస్థకు అతను చెల్లించాల్సిన మొత్తం ఏమైనా ఉంటే అందులో నుంచి మినహాయించి మిగతాది ఇస్తారు. ఈ లెక్కలు చూసేందుకు నాలుగైదు రోజుల సమయం తీసుకుని, రిటైరైన వారంలోపు చెల్లించేవారు. ఇప్పుడు దాన్నీ ఆపేశారు. కరువు భత్యం బకాయిలు: కొన్నేళ్లుగా డీఏలు సకాలంలో చెల్లించటం లేదు. దాదాపు 8 డీఏలు పేరుకుపోయాయి. వాటిని గత కొన్ని నెలల్లో క్లియర్ చేశారు. ఆ డీఏ చెల్లించాల్సిన కాలానికి ఉద్యోగి సర్వీసులోనే ఉన్నా, ఆలస్యంగా దాన్ని చెల్లించే నాటికి కొందరు రిటైర్ అవుతున్నారు. ఇలా ఆలస్యంగా చెల్లిస్తున్న వాటిని... సర్వీసులో ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు, కానీ రిటైరైన వారికి ఇవ్వడం లేదు. ఇక సీసీఎస్ మాటేమిటి? ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను ఆర్టీసీ వాడేసుకుని వడ్డీతో కలిపి రూ.వేయి కోట్లు బకాయి పడింది. కార్మికుల వేతనం నుంచి ప్రతినెలా నిర్ధారిత మొత్తం కోత పెట్టి సీసీఎస్‌లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని రిటైరైన వెంటనే చెల్లించాలి. కార్మికులు వాటిని డిపాజిట్లుగా సీసీఎస్‌లో అలాగే ఉంచితే దానిపై వడ్డీ చెల్లించాలి. ఇదంతా సీసీఎస్ పాలక మండలి చూస్తుంది. కానీ, ఆ నిధులు ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో రిటైరైన వారికి చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. సర్వీసులో ఉన్న వారు వారి అవసరాలకు తీసుకుందామన్నా ఇవ్వటం లేదు. ఇది పదవీ విరమణ పొందిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారికీ సంబంధించిన సమస్య. -
పన్ను మినహాయింపు.. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై ఆర్థిక శాఖ కీలక ప్రకటన
ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. బడ్జెట్లో ప్రకటించిన విధంగానే ప్రైవేట్ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత చేసుకునే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు రూ.3 లక్షలుగా ఉండేది. ఈ పరిమితిని 2002లో నిర్ణయించారు. ఇదీ చదవండి: సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్: ధర రూ.15 వేల లోపే సెక్షన్ 10(10AA)(ii) కింద ఆదాయపు పన్ను నుంచి మినహాయించిన మొత్తం రూ.25 లక్షలకు మించరాదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పొడిగించిన పన్ను మినహాయింపు పరిమితి 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్‌కు గ్రీన్ సిగ్నల్) 2023 బడ్జెట్ లోని ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ.25 లక్షలకు పెంచిందని, ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని సీబీడీటీ తెలిపింది. ఇదీ చదవండి: IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా! మరిన్ని బిజినెస్ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్ -
TSRTC: జీతం రాదు.. పింఛన్ లేదు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టుకుని దాచుకున్న నిధిని ఖాళీ చేసి వారి అవసరాలకు రుణాలు అందకుండా చేసిన ఆర్టీసీ.. విశ్రాంత ఉద్యోగులకూ మనశ్శాంతి లేకుండా చేస్తోంది. పని చేసిన కాలంలో దాచుకున్న ఎర్న్డ్ లీవ్స్ (ఈఎల్స్) తాలూకు నగదును చెల్లించట్లేదు. 2,500 మందికి సంబంధించి నగదుగా మార్చుకునే ఈఎల్స్ చెల్లింపులు నిలిపేసింది. మూడేళ్లు గడుస్తున్నా వారికి రావాల్సిన మొత్తాన్ని నిధులు లేవన్న సాకుతో ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ బకాయిలు రూ.100 కోట్లకు చేరుకున్నాయి. ఇటు జీతం లేక, అటు పింఛన్ వెసులుబాటు లేక, ఈఎ ల్స్ చెల్లింపులూ అందక విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 11 నెలల జీతంతో సమానం..: ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఆర్టీసీ ఉద్యోగులకు 300 ఈఎల్స్‌ను నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉంది. రిటైర్ అయ్యాక ఒకేసా రి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. పదవీ విరమ ణ పొందిన నెలలో ఉన్న బేసిక్‌తో పా టు కరువు భత్యం కలిపి దీన్ని చెల్లి స్తారు. ఇది వారి 10 నెలల జీతానికి సమానమ వుతుంది. దీంతోపాటు రిటైర్మెంట్ శాలరీ పేరుతో బోనస్‌గా మరో నెల జీతం ఇస్తారు. మొత్తం 11 నెలల జీతం అందుతుంది. ఇది వారి హోదాలను బట్టి జీతం ఆధారంగా రూ.4 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది. 2018 ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందిన వారికి ఈఎల్స్ చెల్లింపులు ఆపేసింది. అలా 2019 డిసెంబర్ వరకు నిలిచిపోయాయి. ఈ మధ్య కాలంలో దాదాపు రెండున్నర వేల మంది రిటైర్ అయ్యారు. ఆర్టీసీ రెండు సార్లు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంది. గతేడాది రూ.650 కోట్లు, నెలన్నర కింద రూ.500 కోట్లు రుణంగా తెచ్చుకుంది. తొలి అప్పును జీతాల పేరుతో చెల్లించింది. వాటి నుంచి తమకు ఈఎల్స్ మొత్తం విడుదల చేయాలని విశ్రాం త ఉద్యోగులు ఎంతగా అడిగినా వినలేదు. -
బకాయిలివ్వకుంటే సమ్మె సైరన్
వేతన సవరణ చెల్లింపులపై ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో మళ్లీ అలజడి మొదలైంది. వేతన సవరణ బకాయిల విడుదలతో పాటు పెరిగిన కరువు భత్యం తాలూకు బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపులు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నెల 15వ లోపు చెల్లించని పక్షంలో సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించాయి. ముఖ్యంగా వేతన సవరణ బకాయి చెల్లించాల్సిన గడువు దాటినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటాన్ని తప్పు పడుతున్నాయి. ఇటీవల టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో బస్‌భవన్‌కు వచ్చిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను దీనిపై ప్రశ్నించగా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవటంతో.. ఇప్పట్లో బకాయిలు విడుదల కావని కార్మిక సంఘాలు అనుమానిస్తున్నాయి. దీంతో సమ్మె హెచ్చరికలు జారీ చేశాయి. ఉగాది గడచినా... గతేడాది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విషయం విదితమే. దీన్ని 2013 నుంచే అమలు చేయనున్నట్టు అప్పట్లో స్వయంగా సీఎం వెల్లడించారు. ఫలితంగా రూ.1,387 కోట్లు బకాయిలుగా చెల్లించాల్సి వచ్చింది. ఇందులో 50 శాతం మొత్తాన్ని ఐదేళ్ల తర్వాత బాండ్ల రూపంలో ఇస్తామని చెప్పిన సీఎం... మిగతా సగాన్ని మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. గతేడాది దసరా తొలి వాయిదా కాగా ప్రభుత్వం రూ.231 కోట్లను అందజేసింది. రెండో విడతగా మరో రూ.231 కోట్లను ఇటీవలి ఉగాదిన అందజేయాల్సి ఉంది. కానీ వాటిని విడుదల చేయలేదు. 2012 నుంచి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కొత్త కరువు భత్యం బకాయిలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో వాటి జాబితాలో ఇప్పుడు వేతన సవరణ బకాయి కూడా చేరిపోయినట్టేనని కార్మికులు భావిస్తున్నారు. దీంతో ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. త్వరలో గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు 15 రోజుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పనిచేస్తున్న 1.6 లక్షల మంది కార్మికులకు అక్టోబరులో జరిగిన ఒప్పందం ప్రకారం 2011 సంవత్సరానికి సంబంధించి 15 రోజుల లీవ్ ఎన్క్యాష్మెంటుకు అంగీకరిస్తూ ఆర్టీసీ ప్రకటన జారీ చేసినట్టు ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.50 కోట్లతో కొత్త బస్సులు: రూ. 50 కోట్లతో కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం నిధుల వ్యయానికి పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వేల బస్సుల కొనుగోలుకు ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు సమర్పించింది. కానీ బడ్జెట్లో రూ. 100కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది