బకాయిలివ్వకుంటే సమ్మె సైరన్
వేతన సవరణ చెల్లింపులపై ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో మళ్లీ అలజడి మొదలైంది. వేతన సవరణ బకాయిల విడుదలతో పాటు పెరిగిన కరువు భత్యం తాలూకు బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపులు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నెల 15వ లోపు చెల్లించని పక్షంలో సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించాయి. ముఖ్యంగా వేతన సవరణ బకాయి చెల్లించాల్సిన గడువు దాటినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటాన్ని తప్పు పడుతున్నాయి. ఇటీవల టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో బస్‌భవన్‌కు వచ్చిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను దీనిపై ప్రశ్నించగా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవటంతో.. ఇప్పట్లో బకాయిలు విడుదల కావని కార్మిక సంఘాలు అనుమానిస్తున్నాయి. దీంతో సమ్మె హెచ్చరికలు జారీ చేశాయి.
ఉగాది గడచినా...
గతేడాది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన విషయం విదితమే. దీన్ని 2013 నుంచే అమలు చేయనున్నట్టు అప్పట్లో స్వయంగా సీఎం వెల్లడించారు. ఫలితంగా రూ.1,387 కోట్లు బకాయిలుగా చెల్లించాల్సి వచ్చింది. ఇందులో 50 శాతం మొత్తాన్ని ఐదేళ్ల తర్వాత బాండ్ల రూపంలో ఇస్తామని చెప్పిన సీఎం... మిగతా సగాన్ని మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. గతేడాది దసరా తొలి వాయిదా కాగా ప్రభుత్వం రూ.231 కోట్లను అందజేసింది. రెండో విడతగా మరో రూ.231 కోట్లను ఇటీవలి ఉగాదిన అందజేయాల్సి ఉంది. కానీ వాటిని విడుదల చేయలేదు. 2012 నుంచి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కొత్త కరువు భత్యం బకాయిలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో వాటి జాబితాలో ఇప్పుడు వేతన సవరణ బకాయి కూడా చేరిపోయినట్టేనని కార్మికులు భావిస్తున్నారు. దీంతో ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. త్వరలో గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.