హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో మే నెల జీతాలు, పింఛన్లను అదే నెల 24వ తేదీన చెల్లించేయాలని నిర్ణయం తీసుకున్న ఆర్థిక శాఖ తాజాగా ఇప్పుడు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, హోంగార్డుల వేతనాలను కూడా మే 24వ తేదీనే చెల్లించేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు చేసి చిరుద్యోగులను వదిలేస్తే అన్యాయం అవుతుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒకటీ రెండురోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి.54,598 మంది కాంట్రాక్టు, 12,882 మంది వర్క్ చార్జ్‌డ్, 36,952 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 21,050 ఎన్‌ఎంఆర్‌లు, 2,59,368 మంది హోంగార్డులు కలిపి మొత్తం 3.84 లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలను పొందుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వీరికి మే నెల వేతనాలను చెల్లించకపోతే జూన్ 2వ తేదీన రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక ఆ నెల వేతనాన్ని ఏ రాష్ట్రం చెల్లించాలనే సమస్య ఉత్పన్నమవుతుందని, దీంతో ఉద్యోగులు ఇబ్బంది పడతారనే ఆలోచనతో ఆర్థిక శాఖ పై నిర్ణయం తీసుకుంది. ఇలావుండగా.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల సంబంధిత బిల్లులను మే 17వ తేదీలోగా సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం అన్ని శాఖలకు మెమో జారీ చేశారు. మిగతా అన్ని రకాల బిల్లుల సమర్పణకు కూడా మే 15 చివరితేదీగా ఆర్థిక శాఖ నిర్ణయించింది.
చిరుద్యోగులకూ మే 24నే వేతనాలు
Published Sat, Apr 12 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM
Advertisement