ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్‌కు జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్న
కాళేశ్వరంపై విచారణలో రామకృష్ణారావు క్రాస్ ఎగ్జామినేషన్
‘కోర్ కమిటీ’భేటీలపై జవాబు చెప్పలేక తడబడిన అధికారి
9– 10.5% వడ్డీలతో రుణాలు తీసుకున్నారని వెల్లడి
నేడు బీఆర్‌ఎస్ నేత వి ప్రకాశ్ క్రాస్ ఎగ్జామినేషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుపై ప్రశ్నల వర్షం కురిపించింది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా మంగళవారం కమిషన్ ఆయనను ప్రశ్నించింది.
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు రామకృష్ణారావు తడబడటంతో ‘మీ మీదేమీ వేసుకోవద్దు’అని అసహనం వ్యక్తంచేసింది. 2015లో జారీ చేసిన ఓ జీవో ప్రకారం కోర్ కమిటీ తరచుగా మీతో సమావేశమై ప్రాజెక్టు పురోగతిని వివరించిందా? అని కమిషన్ ఆయన్ను ప్రశ్నించగా, కమిటీలోని ఇంజనీర్లు తనను కలిసి ప్రాజెక్టు పురోగతిని వివరించి బిల్లులకు నిధులు కోరేవారని రామకృష్ణారావు బదులిచ్చారు.
ఆ సమావేశాల మినిట్స్ ఏమయ్యాయి? అని కమిషన్ అడగటంతో సమాధానమివ్వలేక ఆయన తడబడ్డారు. దీంతో మీ మీదేమీ వేసుకోవద్దు అని కమిషన్ సూచించింది.
బడ్జెట్‌లో కాళేశ్వరం రుణాలెందుకు చూపలేదు?
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 2021–22లో తీసుకున్న రూ.35,257 కోట్ల బడ్జెటేతర రుణాలను రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపగా, 2022–23లో రూ.9,596 కోట్లు, 2023–24లో రూ.2,545 కోట్ల బడ్జెటేతర రుణాలను ఎందుకు చూపలేదని కమిషన్ ప్రశ్నించింది.
ఆ రుణాలను బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపితే రాష్ట్ర రుణపరిమితికి కేంద్రం కోతలు విధించే అవకాశం ఉండడంతో వాటిని బడ్జెట్‌లో చూపలేదని రామకృష్ణారావు వివరించారు. దీంతో ఇది తెలంగాణ ఫిస్కల్ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ చట్టానికి విరుద్ధమని కమిషన్ మండిపడింది.
ప్రభుత్వమే రుణాలు తిరిగి చెల్లిస్తుంది..
కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న రుణాల విషయంలో ఆర్థిక శాఖ బాధ్యత ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, వాటికి ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినందున ఆర్థిక శాఖ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుందని రామకృష్ణా రావు బదులిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూ.6,519 కోట్లు, అసలు రూ.7,382 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రుణాలను 9 నుంచి 10.5 శాతం వడ్డీలతో తీసుకున్నారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాల సమీకరణకే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీఎల్) ఏర్పాటైందని చెప్పారు. కేఐపీసీఎల్‌కు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అని ప్రశ్నించగా, పరిశ్రమలకు నీళ్లను విక్రయించడం ద్వారా రూ.7 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. రుణాల సమీకరణ బాధ్యత కేఐపీసీఎల్‌దేనని చెప్పారు.
బరాజ్‌ల నిర్మాణంలో తీవ్ర ఉల్లంఘనలు
బరాజ్‌లను టర్న్‌కీ పద్ధతిలో కట్టాలని జీవో 145 పేర్కొంటుండగా, ప్రభుత్వం తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కమిషన్ తప్పుబట్టింది. జీవోలో అలా ఉందని, ప్రాజెక్టును మాత్రం పీస్ రేటు విధానంలో నిర్మించారని రామకృష్ణారావు తెలిపారు.
బరాజ్‌లకు అనుమతిచ్చే విషయంలో ఆర్థిక శాఖ మంత్రి ఆమోదం తీసుకుంటారా? అని కమిషన్ ప్రశ్నించగా, అది తప్పనిసరి అని వివరించారు. బరాజ్‌ల పాలసీలను శాసనసభ ముందు ప్రభుత్వం ఉంచిందా? అని ప్రశ్నించగా, తనకు తెలియదని సమాధానమిచ్చారు.
నేటి నుంచి వరుసగా...
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం బీఆర్‌ఎస్ నేత వి.ప్రకాశ్‌ను ప్రశ్నించనుంది. గురు, శుక్ర, శనివారాల్లో వరుసగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్‌ల నిర్మాణ సంస్థలైన నవయుగ, అఫ్కాన్స్, ఎల్ అండ్ టీల ప్రతినిధులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment