
ప్రయత్నాల్లో శశాంక్‌గోయల్, జయేశ్‌రంజన్, వికాస్‌రాజ్ కూడా..
సాక్షి, హైదరాబాద్: తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును ప్రభుత్వం ఖరారు చేసినట్టు సమాచారం. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఏప్రిల్ చివరలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో రామకృష్ణారావు సీఎస్‌గా బాధ్యతలు చేపడతారని ప్రభుత్వవర్గాల కథనం. ఇంకా నెలరోజులకు పైగా సమయమున్న నేపథ్యంలో మరో ముగ్గురు ప్రత్యేక ప్రధానకార్యదర్శులు కూడా సీఎస్ పోస్టు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుండడం గమనార్హం.
రామకృష్ణారావు కాకుండా సీఎస్ కోసం పోటీ పడుతున్న వారిలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్ శశాంక్‌గోయల్(1990బ్యాచ్), 1992 బ్యాచ్ ఐఏఎస్‌లలో పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉన్నారు. వీరి బ్యాచ్‌కు చెందిన సంజయ్‌జాజు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖల కార్యదర్శిగా ఉన్నారు. ఆయన రాష్ట్ర సర్వీసులోకి రావడానికి అయిష్టత వ్యక్తం చేసినట్టు సమాచారం.
ప్రకృతి విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌కుమార్ కూడా రామకృష్ణారావు బ్యాచ్‌కు చెందినవారే. అయితే ఆయన ఫార్ములా ఈ –రేసు కేసుల్లో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. అదీకాక ఓఆర్‌ఆర్ టోల్ వసూళ్లను ప్రైవేట్ సంస్థకు అప్పగించిన అంశంలో ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడు ఆరోపణలు చేస్తే.. ఆ సమయంలో రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగతంగా పరువునష్టం దావా వేశారు. రేవంత్‌రెడ్డి సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత అర్వింద్‌కుమార్‌ను పురపాలక శాఖ నుంచి అప్రాధాన్యమైన ప్రకృత్తి విపత్తుల నిర్వహణ శాఖకు బదిలీ చేశారు.
శాంతికుమారి ఉద్యోగ విరమణ తర్వాత ఒకవేళ రామకృష్ణారావు సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించినా, నాలుగు నెలలపాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగుతారు. ఒకవేళ ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగింపు ఇచ్చే పక్షంలో నవంబర్ చివరి వరకు సీఎస్‌గా కొనసాగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతికుమారిని తప్పించి.. రామకృష్ణారావుకు సీఎస్ బాధ్యతలు అప్పగిస్తారని భావించినా, సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి మార్పు చేయకుండానే ఆమెను కొనసాగిస్తూ వచ్చారు.
వచ్చే ఏప్రిల్‌లో ఆమె పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు(1991 బ్యాచ్)ను నియమించాలని నిర్ణయించినట్టు తెలిసింది. వాస్తవానికి రామకృష్ణారావు కంటే ఒక సంవత్సరం సీనియర్ 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శశాంక్‌గోయల్ వచ్చే సంవత్సరం సెపె్టంబర్‌లో ఉద్యోగ విరమణ చేస్తారు.
కాగా జయేశ్‌రంజన్ ఉత్తరాదికి చెందిన ఓ ప్రముఖునితో సీఎస్ పదవి కోసం యత్నిస్తున్నట్టు తెలియడంతో... ఓ ఉన్నతాధికారి ఇటీవల జయేశ్‌రంజన్‌కు వ్యతిరేకంగా విజిలెన్స్ నివేదికను బయట పెట్టినట్లు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. శశాంక్‌గోయల్ 2026 సెపె్టంబర్‌లో, అర్వింద్‌కుమార్ 2026 అక్టోబర్‌లో, జయేశ్‌రంజన్ 2027 సెప్టెంబర్‌లో, వికాస్‌రాజ్ 2028 మార్చిలో, అదే సంజయ్ జాజు 2029 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment