ఆర్బీఐ గవర్నర్ జీతమెంతో తెలుసా..?
న‍్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ నెల జీతమెంతో తెలుసా? గత సెప్టెంబరు 4న ఆర్బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఊర్జిత్ తొలిసారి అక్టోబరు నెలకు పూర్తి నెల జీతం అందుకున్నారు. ఆయన 2.09 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు. అంతకుముందు ఆగస్టు నెలకు అప్పటి గవర్నర్ రఘురాం రాజన్ కూడా ఇంతే మొత్తంలో జీతం అందుకున్నారు. సమాచార హక్కు చట్టం కింద ఓ దరఖాస్తుదారు కోరిన మేరకు ఆర్బీఐ ఈ వివరాలు తెలియజేసింది. ఊర్జిత్ జీతం, సిబ్బంది వివరాలు, అంతకుముందు ఆర్బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ జీతాల వివరాలను వెల్లడించింది.
ఊర్జిత్ ప్రస్తుతం ముంబైలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఆయన ఇంట్లో పనిచేసేందుకు సహాయ సిబ్బందిని కేటాయించలేదని ఆర్బీఐ వెల్లడించింది. ఊర్జిత్‌కు రెండు కార్లు, ఇద్దరు డ్రైవర్లను కేటాయించినట్టు తెలిపింది.
ఊర్జిత్‌కు ముందు 2013 సెప్టెంబరు 5న ఆర్బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఆయన నెలకు 1.69 లక్షల రూపాయల జీతం తీసుకునేవారు. తర్వాత 2014లో ఆయన జీతం 1.78 లక్షలకు, 2015లో 1.87 లక్షల రూపాయలకు పెరిగింది. ఈ ఏడాది జనవరిలో రాజన్ జీతాన్ని 2.09 లక్షల రూపాయలకు పెంచారు. రాజన్‌కు మూడు కార్లు, నలుగురు డ్రైవర్లు, తొమ్మిదిమంది సహాయ సిబ్బందిని కేటాయించారు. ప్రస్తుతం గవర్నర్ ఊర్జిత్‌కు అంతే మొత్తంలో జీతం ఇస్తున్నా సహాయ సిబ్బందిని కేటాయించలేదు.