![Demonetisation Impact Transient, Says Urjit Patel - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/28/urjitpatel.jpg.webp?itok=1wLyMJv0)
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దువల్ల ఆర్థిక వ్యవస్థపై ఏర్పడ్డ ప్రభావం తాత్కాలికమేనని ఆయన అన్నారు. ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని 31 మంది సభ్యులున్న పార్లమెంటరీ స్థాయీ సంఘం(ఆర్థికాంశాలు) ముందు హాజరైన ఉర్జిత్ పటేల్.. ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ పరిస్థితులపై ఆయన ప్రజెంటేషన్ సమర్పించారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు లాభిస్తుందని తెలిపారు. 2016, నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకుల రుణ పరపతి 15 శాతం పెరిగిందన్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం సైతం 4 శాతం దిగువకు వచ్చిందని గుర్తుచేశారు. అయితే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్–7ను తొలగించాలన్న ప్రతిపాదన, నిరర్ధక ఆస్తులు, ఆర్బీఐ స్వతంత్రత, తదితర విషయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానం ఇవ్వకపోవడంతో, వీటన్నింటిపై మరో 10–15 రోజుల్లో రాతపూర్వకంగా జవాబివ్వాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment