Veerappa Moily
-
‘ఈసీ పట్టించుకోకపోతే.. లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేస్తాం’
సాక్షి, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల విషయమై తెలంగాణ కాంగ్రెస్ నేతలు శనివారం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీని వీడిన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం వీరప్ప మొయిలీ మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయింపులపై కాంగ్రెస్, టీడీపీ వేర్వేరుగా స్పీకర్, చైర్మన్లకు ఫిర్యాదు చేశాయన్నారు. కానీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. స్పీకర్, చైర్మన్‌పై కేసీఆర్ ఒత్తిడి ఉందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్.. రాజ్యాగానికి విరుద్ధంగా ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ చర్యల వల్ల తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు మారిన వాళ్లు రాస్తున్న లేఖలన్ని ఒకేలా ఉన్నాయని.. అవన్ని సీఎంఓ నుంచే వస్తున్నాయని వీరప్ప మొయిలీ ఆరోపించారు. చీఫ్ మినిస్టర్ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని.. లేదంటే లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు 29 శాతం ఓట్లు...19 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ మౌనంగా ఉండొద్దని, బహిరంగంగా ఖండించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. -
‘ పట్టపగలు దొంగతనం.. దేశ భద్రత పణంగా పెట్టి’...
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శనాస్ర్తాలు సంధించారు. రాఫెల్ ఒప్పందాన్ని పట్టపగలు దొంగతనంగా ఆయన పేర్కొన్నారు. దేశ భద్రతను పణంగా పెట్టి రాఫెల్ ఒప్పందం చేశారని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాఫెల్ ఒప్పందం దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణమని, దానిపై చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. 200 శాతం అంచనాలు పెంచి రాఫెల్ యుద్ధ విమానాలు ఎలా కొన్నారని ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా గురించి చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు రాఫెల్ విమానాలు ఇండియాలో తయారు చెయ్యకుండా ఆ ఒప్పందం ఎలా చేసుకున్నారంటూ మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు, కేంద్ర సర్కార్ తప్పుడు నివేదికలు ఇచ్చిందని ఆరోపించారు. అందుకే తీర్పు అలా వచ్చిందని, సుప్రీం కోర్టు ఈ కుంభకోణం తియ్యడంలో సరైన వేదిక కాదనే తాము కోర్టుకు వెళ్లలేదన్నారు. రాఫెల్ ఒప్పందంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఏఎల్కి( హిందూస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్) సామర్థ్యం ఉందని చెబితే నరేంద్రమోదీ మాత్రం నమ్మలేదని చెప్పారు. ఈ ఒప్పందాన్ని క్రోనీ క్యాపిటలిసంతో కూడుకున్న కుంభకోణమని పేర్కొన్నారు. రూ. 41000 కోట్ల డబ్బులు.. ప్రజల సొమ్ము డైరెక్ట్‌గా వృధా అవుతున్నాయన్నారు. రిలయన్స్, అనిల్ అంబానికి లాభం చేకూర్చడం కోసమే ఒప్పందమని ఆరోపించారు. బెంచ్ మార్క్ రేట్ సరిగా లేదని అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ చెప్పారని, జాతి ప్రయోజనాలను పక్కన పెట్టి మోదీ ఈ ఒప్పందం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దువల్ల ఆర్థిక వ్యవస్థపై ఏర్పడ్డ ప్రభావం తాత్కాలికమేనని ఆయన అన్నారు. ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని 31 మంది సభ్యులున్న పార్లమెంటరీ స్థాయీ సంఘం(ఆర్థికాంశాలు) ముందు హాజరైన ఉర్జిత్ పటేల్.. ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ పరిస్థితులపై ఆయన ప్రజెంటేషన్ సమర్పించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు లాభిస్తుందని తెలిపారు. 2016, నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకుల రుణ పరపతి 15 శాతం పెరిగిందన్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం సైతం 4 శాతం దిగువకు వచ్చిందని గుర్తుచేశారు. అయితే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్–7ను తొలగించాలన్న ప్రతిపాదన, నిరర్ధక ఆస్తులు, ఆర్బీఐ స్వతంత్రత, తదితర విషయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానం ఇవ్వకపోవడంతో, వీటన్నింటిపై మరో 10–15 రోజుల్లో రాతపూర్వకంగా జవాబివ్వాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కోరింది. -
యూపీఏలో చేరుతున్న టీడీపీకి స్వాగతం!
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మున్ముందు కాంగ్రెస్‌తో అంటకాగుతారని బాహాటంగా వెల్లడైంది. యూపీఏలో చేరుతున్న టీడీపీని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలపడం సంతోషమని, కేవలం తెలంగాణాలోనే కాకుండా టీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందని పీటీఐ ఇంటర్వ్యూలో మొయిలీ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేస్తాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడం మంచి సంకేతమని, తెలుగుదేశం పార్టీతో మాకు మంచి అవగాహన ఉందని మొయిలీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుకు దిగడంపై తెలుగు రాష్ట్రాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులుకలపడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీతో తమ పార్టీ పొత్తు భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని వీరప్ప మొయిలీ బాహాటంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్‌పై నిన్నమొన్నటి వరకూ విరుచుకుపడ్డ చంద్రబాబు అదే పార్టీతో ఇప్పుడు పొత్తుకు పాకులాడటం సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలకు తావిస్తోంది. -
కాంగ్రెస్ తప్పు చేసింది: వీరప్ప మొయిలీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. ఎన్నికలలో ఓటమిని సమీక్షిస్తూ మనల్ని ప్రజలు నమ్మని పరిస్థితి ఏర్పడిందన్నారు. లోక్‌సభను నడపలేని మనం దేశాన్ని ఎలా నడపగలం అని ప్రశ్నించారు. అధికార యంత్రాంగం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మద్దతు పలకలేదని చెప్పారు. కార్యక్రమాల అమలులో ప్రభుత్వ వేగం మందగించిందన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నికోవాలని కోరారు. ప్రియాంక వధేరా పార్టీలో కీలకపాత్ర పోహించాలన్నారు. గ్రామస్థాయి నుంచి ఏఐసిసి వరకు పార్టీని ప్రక్షాళన చేయాలని మొయిలీ డిమాండ్ చేశారు. పార్టీలో స్థానిక, ప్రాంతీయ నాయకత్వాన్ని అభివృద్ధి చేయలేకపోయామని అన్నారు. ఓటమికి బాధ్యులను నిర్థారించి వారిపై చర్య తీసుకోవాలన్నారు.