నీతా అంబానీ, ఆమె సోదరి మమతా దలాల్
‘బ్రహ్మచారి’ ఊర్జిత్ పెళ్లిపై ఊహాగానాలు!
Published Wed, Nov 23 2016 5:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
న్యూఢిల్లీ: బ్రహ్మచారిగా భావిస్తున్న భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ ఊర్జిత్ పటేల్ పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో వదంతులు గుప్పుమన్నాయి. ఉర్జిత్‌కు పెళ్లయిందని, ఆయన భార్య స్వయానా ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ సోదరి అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వదంతులు చెలరేగాయి. ఊర్జిత్ భార్య, అంబానీ భార్య అక్కాచెల్లెళ్లు కావడంతో పెద్దనోట్ల రద్దు విషయంగా ముందుగానే అంబానీ కుటుంబానికి పొక్కిందంటూ కొందరు ఊహాగానాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న రూ. 500, రూ. వెయ్యినోట్లను రద్దుచేస్తున్నట్టు ఆకస్మికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్బీఐ గవర్నర్ భార్యతో బంధుత్వం ఉండటం వల్ల ముకేశ్ అంబానీ కుటుంబానికి ముందే ఈ విషయం తెలియడంతో ఆయన జాగ్రత్త పడినట్టు ఊహాగానాలు చెలరేగాయి..
అయితే, అవన్నీ కట్టుకథలు, వట్టి వదంతులేనని తేలింది. ఊర్జిత్ కు నీతా అంబానీ సోదరికి ఎలాంటి సంబంధం లేదు. నీతా అంబానీకి ఒక సోదరి ఉన్నారు. ఆమె పేరు మమతా దలాల్. వారి తండ్రి రవీంద్రభాయ్ దలాల్ 2014 జూలైలో మృతిచెందారు. మమతా దలాల్ ముంబై బాంద్రాలోని ధీరూభాయ్ అంబానీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
ఇక ఊర్జిత్ వివాహం విషయమై భిన్నభిప్రాయాలు నెలకొన్నాయి. ఊర్జిత్ పెళ్లయిందని, ఆయన భార్య కనన్ పటేల్ అని, వారికి ఇషాన్, ఇషికా అనే పిల్లలు ఉన్నారని ‘క్వింట్’లో ఓ కథనం పేర్కొంటున్నది. గూగుల్ సెర్చ్‌లో మొదట ఇదే దర్శనమిస్తున్నది. అయితే, నిజానికి ఆయన బ్రహ్మచారి అని ప్రొఫైల్ చెబుతున్నది.
Advertisement
Advertisement