ఉర్జిత్ను కాపాడిన మన్మోహన్ సింగ్
ఉర్జిత్ను కాపాడిన మన్మోహన్ సింగ్
Published Wed, Jan 18 2017 7:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ఆదుకున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పద్దని ఉర్జిత్ పటేల్కు సలహా ఇచ్చారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెబితే సెంట్రల్ బ్యాంకు స్వతంత్రతకు ముప్పు వస్తుందంటూ హెచ్చరించారట. అయితే ఆ ప్రశ్నలేమిటో తెలుసా? నగదు విత్డ్రాయల్స్పై ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆంక్షలను ఒకవేళ తొలగిస్తే గందరగోళాలన్నీ తొలగిపోతాయా.. 50 రోజుల్లో ఎన్ని పాత కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చాయంటూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ బుధవారం ఉర్జిత్ పటేల్ను ప్రశ్నిస్తూ ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్రయత్నించింది. పార్లమెంటరీ కమిటీ ఈ ప్రశ్నలు అడిగిన వెంటనే మధ్యలో కల్పించుకుని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవద్దని ఉర్జిత్కు మన్మోహన్ సింగ్ సలహా ఇచ్చారట.
హఠాత్తుగా నోట్లను రద్దు చేసిన అనంతరం తలెత్తిన పరిణామాలపై వివరణ ఇవ్వడానికి ఉర్జిత్పటేల్, ఆర్థికశాఖ అధికారులు నేడు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ అడిగిన ఈ ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానం ఇవ్వద్దని మన్మోహన్ సూచించారని తెలిసింది. సెంట్రల్ బ్యాంకు టాప్ బాస్గా పనిచేసిన మన్మోహన్, అనుభవపూర్వకంగా ఉర్జిత్ను ఆదుకున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకించిన మన్మోహన్, ఈ మేరకు సలహా ఇవ్వడం విశేషం. మన్మోహన్ సలహా మేరకు రద్దయిన ఎన్నినోట్లు వెనక్కి వచ్చాయి? నగదు పరిస్థితి ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తుందనే దానిపై ఉర్జిత్ పటేల్ సమాధానం ఇవ్వలేదు.
Advertisement
Advertisement