నెల తిరగ్గానే జీతం.. డైలీ టార్గెట్లు.. అది సాధించకపోతే సాలరీ కటింగ్‌లు.. ఇవన్నీ మార్కెటింగ్ రంగంలో ఉద్యోగాలు చేసేవారికి కామనే.. కానీ ఇవి ‘దొంగ’ ఉద్యోగం కోసం అని చెబితే.. జైపూర్‌లో జరిగిన విచిత్రమైన సంఘటన ఇదీ.. కార్పొరేట్ కంపెనీలు, మార్కెటింగ్ సంస్థలు కల్పించే సౌకర్యాలన్నీ వివిధ రకాల నేరాలకు పాల్పడే దొంగలకు కల్పించడం ద్వారా వినూత్న పంథాకు తెరతీశాడో 21 ఏళ్ల యువకుడు. మోటారు సైకిళ్లు, బంగారు గొలుసులు, మొబైల్ ఫోన్లు తదితర దొంగతనాలకు పాల్పడేందుకు జైపూర్‌కు చెందిన ఆశిష్ మీనా అలియాస్ అమిత్ ఆరుగురు నిరుద్యోగ యువకులను జీతాలపై (నెలకు రూ.15 వేల చొప్పున) రిక్రూట్ చేసుకున్నాడు. వారికి డైలీ టార్గెట్లు ఫిక్స్ చేశాడు.
కనీసం ఒక్క నేరానికైనా పాల్పడకపోతే ఆ రోజు జీతం కట్ అయినట్టే. జైపూర్‌లోని ఒక ప్రాంతంలో మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాల చోరీలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రత్యేక పోలీసు బృందం అక్కడి సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించింది. చోరీ అయిన మొబైల్ ఫోన్ల లొకేషన్‌ను పోలీసులు ట్రాక్ చేశారు. అక్కడికి దగ్గరలోని ఒక అద్దె ఇంట్లో ఈ గ్యాంగ్ సభ్యులు దాక్కున్నట్టుగా ఓ అజ్ఞాతవ్యక్తి ద్వారా వచ్చిన సమాచారంతో పోలీసులు వల పన్ని వీరిని పట్టుకున్నారు. మొత్తం 33 సెల్‌ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్, రెండు గొలుసులు, నాలుగు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన మోటార్ సైకిళ్లనే వారు మహిళల మెడలో గొలుసులు తెంచేందుకు ఉపయోగించడం మరో విశేషం. దొంగిలించిన వస్తువులను గ్యాంగ్‌లీడర్ అమిత్ వద్ద ‘అద్దె దొంగలు’డిపాజిట్ చేసేవారు.
వీటిని విక్రయించి ఆ డబ్బుతో అమిత్ వారికి జీతాలు చెల్లించేవాడు.జైపూర్‌కు సమీపంలోని సవాయ్ మథోపూర్ జిల్లా గంగాపూర్ పట్టణానికి వెళ్లినపుడు అమిత్‌కు చదువురాని ఆరుగురు నిరుద్యోగులు తారసపడ్డారు. ఏదైనా ఉపాధి దొరికితే చాలు అన్నట్టుగా ఉన్న వారి పరిస్థితిని గమనించి నెలవారీ జీతాలపై దొంగతనాలు చేసే ఉద్యోగాలకు వారిని ఒప్పించాడు. దీంతో వారు తమ కార్యక్షేత్రాన్ని జైపూర్‌కు మార్చి, అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టారు. గత జూలైలో తాము ఉద్యోగంలో చేరామని, ఇప్పటిదాకా నలభైకిపైగా చోరీలకు పాల్పడినట్టు వారు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. తమకు అమిత్ నెలవారీ వేతనాలిస్తున్నాడని, చోరీకి పాల్పడని రోజు జీతంలో కోత విధిస్తున్నాడని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment