మొన్నీమధ్యే పంజాగుట్ట వెళదామని ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చా.. మెట్లు ఎక్కుతోంటే.. నాలుగో మెట్టు మీద అనుకుంటా... ఒక యాచకుడ్ని చూశా.. యధావిధిగానే అతని ముందో పళ్లెం ఉంది. అందులో కొన్ని చిల్లర పైసలు, 10 రూపాయల నోట్లు ఓ నాలుగు ఉన్నట్లున్నాయి. ఇది కొత్తేమి కాదు కానీ... నన్ను ఆకట్టుకున్నదల్లా... అతని మెళ్ళో ఉన్న ఓ డిజిటల్ కార్డు.
అది క్యూఆర్ కోడ్ ఉన్న కార్డు.. పెదాలపై ఓ చిన్న చిరునవ్వు వచ్చింది... ఎస్..మోదీ చెప్పింది కరెక్టే అనిపించింది.. "దేశంలో డిజిటల్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇప్పుడు అడుగడుగునా డిజిటల్ చెల్లింపులే..రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించి పల్లెల్లో సైతం వేళ్లూనుకుంటాయి..." అంటూ అప్పుడెప్పుడో ప్రధాని అన్నట్లు వచ్చిన వార్త గుర్తుకొచ్చింది.ఇప్పుడీ సంఘటన చూడగానే... నిజమే కదా అనిపించింది..
ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయిందన్నది వాస్తవం. కూరలు కొనడానికి రైతు బజార్ కి వెళ్లినా.. చివరకు ఛాయ్ తాగుదామని టీ స్టాల్ కు వెళ్లినా... జేబులోంచి ఫోన్ తీయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, పైసలతో సహా డబ్బులు చెల్లించడం... చాలా సింపుల్ అయిపోయింది..ఎప్పుడైతే ఈ డిజిటల్ చెల్లింపులు విస్తృతమవుతున్నాయో చిల్లరతో పనిలేకుండా పోతోంది.. చిల్లర దాకా ఎందుకు... కనీసం ఒక్క పది రూపాయల నోట్ కూడా జేబులో పెట్టుకోకుండా.. కేవలం సెల్ ఫోన్ తో రోడ్డెక్కేవాళ్ళు ఎంతమందో ఈరోజుల్లో..
దీంతో ఎవరైనా చెయ్య చాపి యాచిస్తే... ఓ రూపాయి కూడా విదపలేని పరిస్థితి. మరి వారి ఆదాయం పడిపోక ఏమవుతుంది... అందుకే అనుకుంటా... ఆ యాచకుడు ఈ డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నట్లున్నాడు.. తప్పులేదు.. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర యాచించే వాళ్ళు సైతం మెళ్ళో ఓ కార్డు వేసుకుని మీముందు చెయ్యి చాపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీ ప్రిపేర్..
మనం పూర్తి స్థాయిలో నగదురహిత సమాజం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పేందుకు ఇదో ప్రబల ఉదాహరణగా భావించొచ్చు. గత డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా 1673 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్ధిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2024, జనవరి నెలలో ఈ లావాదేవీలు 1220 కోట్లు జరగ్గా.. ఏడాది చివరికి వచ్చేసరికి 400 కోట్లకు పైగా పెరిగాయి. డిజిటల్ విప్లవానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఏం కావాలి?
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) అనేది రకరకాల బ్యాంకుల్ని ఒకేగూటికి చేర్చి చెల్లింపులు చేసేందుకు దోహదపడే ఒక సాధనం. మీ బ్యాంకు ఏదైనా కావచ్చు.. దాన్ని యూపీఐ కి అనుసంధానం చేయడం ద్వారా ఎలాంటి చెల్లింపులైనా క్షణాల్లో చేసేయొచ్చు. పైగా ప్రతీ చెల్లింపునకూ రికార్డు ఉంటుంది.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా సమాచారం ప్రకారం... గత నవంబర్ నెలలో 1548 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ. 21.55 లక్షల కోట్లు. డిసెంబర్ కి వచ్చేసరికి రూ.23.25 లక్షల కోట్ల విలువ చేసే 1673 కోట్ల లావాదేవీలు జరిగాయి.
ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్) ని తాజాగా యూపీఐ వెనక్కి నెట్టేసింది. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు 24 గంటల్లో ఎప్పుడైనా సరే తక్షణమే చెల్లింపు చేసే విధంగా ఈ ఐఎంపీఎస్ ను ప్రభుత్వం 2010 లో ప్రారంభించింది. వ్యాపార వర్గాలకు, వ్యక్తులకు ఈ ఐఎంపీఎస్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. ఐఎంపీఎస్ ద్వారా గత ఏడాది నవంబర్ నెలలో రూ. 5.58 లక్షల కోట్ల విలువ చేసే 40.79 కోట్ల లావాదేవీలు జరగ్గా... డిసెంబర్లో వీటి సంఖ్య 44.1 కోట్లకు పెరిగింది. వీటి విలువ కూడా రూ. 6.01 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం.
ఇక మీరు హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజా ల దగ్గర చెల్లింపులు చేస్తారు కదా... గతంలో క్యాష్ ఇచ్చేవారు. ఆ తర్వాత డెబిట్/క్రెడిట్ కార్డులు, యూపీఐ లు వచ్చాయి. ఇప్పుడు ఫాస్టాగ్ అనేది ఈ చెల్లింపుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ప్రతి టోల్ ప్లాజా ముందు.. ప్రత్యేకంగా కొంతసేపు ఆగాల్సిన అవసరాన్ని ఈ ఫాస్టాగ్ తప్పించింది. మీరు బయల్దేరేముందే... కొంత మొత్తాన్ని మీ బ్యాంకు అకౌంట్ నుంచి ఫాస్టాగ్ కి మళ్లిస్తారు. టోల్ ప్లాజా రాగానే అక్కడి స్కానర్లు మీ వాహనానికి ఉన్న ట్యాగ్ ని స్కాన్ చేస్తాయి. అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఇదంతా కొద్ది సెకన్లలోనే జరిగిపోతుంది. తద్వారా వేచి ఉండే వ్యవధి తగ్గడంతో పాటు, చిల్లర నోట్ల బాధ ఉండదు. ఈ ఫాస్టాగ్ లు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. గత నవంబర్ నెలలో 35.89 కోట్ల లావాదేవీలు జరగ్గా.. డిసెంబర్లో ఈ సంఖ్య 38.30 కోట్లకు పెరిగాయి. వీటి విలువ కూడా రూ.6,070 కోట్ల నుంచి రూ.6,642 కోట్లకు పెరిగింది.
యూపీఐ, ఐఎంపీఎస్, ఫాస్టాగ్ చెల్లింపులు అనేవి మానవాళి జీవితంలో సరికొత్త మార్పులు తీసుకొచ్చాయి. ఈ చెల్లింపులు చాలా సురక్షితంగా ఉండటమే కాక, వేగవంతంగా పనులు పూర్తయ్యేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు మరింత విస్తృతమై డిజిటల్ ఇండియా రూపురేఖలనే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
-బెహరా శ్రీనివాస రావు
విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment