భారత్‌లో మహిళలకు అప్పుపుట్టడం కష్టంగా మారిందని, అందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ తాజా నివేదిక విడుదలైంది. అప్పు కోసం చూస్తున్న మహిళల్లో దాదాపు 47 శాతం మందికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు యూకేకు చెందిన బిజినెస్ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ టైడ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
టైడ్ ఇండియా నివేదించిన తన మొదటి భారత్ ఉమెన్ యాస్పిరేషన్ ఇండెక్స్ (బీడబ్ల్యూఏఐ) కోసం టైర్-2 పట్టణాల నుంచి 18-55 ఏళ్ల వయసు ఉన్న 1,200 మందిపై సర్వే చేశారు. ఇందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆర్థిక పథకాలు, తమ వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాల గురించి వారికి తెలియదని 95 శాతం మంది మహిళలు చెప్పారు. అయితే 52 శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక రుణాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఇద్దరిలో ఒకరికి ఆర్థికపరమైన అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. కానీ 47 శాతం మందికి మాత్రం అప్పుపుట్టడం కష్టంగా మారుతుందని నివేదించింది.
సర్వేలో భాగంగా 80 శాతం మంది మహిళలు డిజిటల్ అక్షరాస్యత అవసరమని గుర్తించారు. 51 శాతం మంది తమ వ్యాపారం కోసం డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారని నివేదిక ఎత్తి చూపింది. 31 శాతం మంది మహిళలకు అదే వ్యాపారంలో ఉన్న ఇతర మహిళలతో పోటీ ఏర్పడుతోందని తెలిసింది.
ఇదీ చదవండి: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీ
టైడ్, గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆలివర్ ప్రిల్ మాట్లాడుతూ..‘మహిళా వ్యాపారవేత్తలకు అప్పు పుట్టుకపోవడానికి ప్రధాన కారణం..వారు మహిళలు కావడమే. దాంతోపాటు వారు ఉంటున్న ప్రాంతం కూడా అవరోధంగా మారుతోంది. ముఖ్యంగా టైర్-2 పట్టణాలు, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరమైన అవగాహన లేకపోవడం, సరైన మార్గదర్శకత్వం కరవవడంతో అప్పులు రావడం లేదు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment