మహిళాభ్యుదయమే మా లక్ష్యం
స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తాం
వడ్డీలేని రుణాల పరిమితి రెట్టింపు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటన
రంగారెడ్డి జిల్లా: స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేస్తామని, మహిళల ఆర్థికాభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమ ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటిం చారు. గత ప్రభుత్వాలు మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకు మాత్రమే వడ్డీలేని రుణాలు ఇచ్చాయని, దీన్ని తమ ప్రభుత్వం రెట్టింపు చేసిందని సోమవారం ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పేర్కొన్నారు. ఇకపై అర్హత ఉన్న ప్రతి సంఘానికి రూ.10 లక్షల వర కు రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. స్వయంసహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) రుణపరిమితిపై త్వరలో సచివాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశానికి అధికారులే కాకండా గ్రామ సంఘం నుంచి ఇద్దరు మహిళలను ఆహ్వానిస్తామని చెప్పారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా 150 మందిని ఆహ్వానించి, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే రుణ పరిమితి మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తూ రైతులకు ఎంతగానో సహకరిస్తున్నారని మహిళా సంఘాలను సీఎం ప్రశంసించారు.
వానలు పరుగెత్తుకు రావాలి..
తెలంగాణ ప్రాంతంలో వర్షపాత లోటు తీవ్రంగా ఉందని, ఇందుకు గత ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యమే కారణమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘తెలంగాణలో బ్రహ్మాండమైన వృక్ష సంపద ఉండేది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం అడవుల్లో భారీగా టేకు చెట్లుండేవి. ఆంధ్రపాలనలో ఈ చెట్టన్నీ కొట్టుకుతిన్నారు. దీంతో ఇక్కడ వర్షపాతం గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే మొక్కలు నాటాలి. ఒక్కో గ్రామానికి 40 వేల చెట్లు నాటేలా తెలంగాణ హరిత హారాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. వచ్చే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల మొక్కలు నాటడమే హరితహారం లక్ష్యం. దీనికి ప్రతి తెలంగాణ బిడ్డ సహకరించాలి. పచ్చదనం నిండితే వానలు ఉరుకొస్తయ్. చైనాలో ప్రజలంతా ఉద్యమంలా చెట్లు నాటి ఎడారి విస్తీర్ణాన్ని తగ్గించారు. నాగార్జునసాగర్‌లో జరిగిన సమావేశాల తర్వాత కొందరు రైతులు వచ్చి కోతుల బెడద భరించలేకపోతున్నామని చెప్పారు. వాటి నివాసాలైన వృక్ష సంపదను కొల్లగొడితే అవి మనమీద పడుతున్నయ్. వాళ్లకు కూడా చెట్టు నాటాలని చెప్పా.’ అని వివరించారు.
నా కార్యసాధనపై ఆత్మవిశ్వాసం ఉంది: కేసీఆర్
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా అమలు చేస్తామని, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, వ్యవసాయానికి పూర్తిస్థాయి విద్యుత్ ఇస్తానని, లేదంటే ఓట్ల డగ బోమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ‘నేను చేసే పనులు, సాధించే విధానంపై నాకు పూర్తిగా నమ్మకముంది. కేసీఆర్ మాటిస్తే నూరుశాతం అమలు చేస్తడు.’ అని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్నీ త్వరగా పూర్తిచేసి రైతుల చిరకాల వాంఛను నెరవేరుస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు హరీశ్, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ బూరనర్సయ్య, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, సంజీవరావు, యాదయ్య పాల్గొన్నారు.