Rajni Bhimavarapu
-
బంగారం కన్నా బాండ్లు బెటర్
ఉమెన్ ఫైనాన్స్ / గోల్డ్ బాండ్స్ బంగారం డిమాండును తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారు గోల్డ్ బాండ్ స్కీమును ప్రారంభించారు. ఈ గోల్డ్ బాండ్స్‌ని ఆర్.బి.ఐ. (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) జారీ చేస్తుంది. వీటిని డీమ్యాట్ పద్ధతిలో, పేపర్ రూపేణ కూడా జారీ చేస్తారు. వీటిని నిర్ణీత బ్యాంకు శాఖలు, పోస్ట్ ఆఫీసు బ్రాంచీల ద్వారా నిర్వహిస్తారు. గోల్డ్ బాండ్లు కొనాలని ఆసక్తి ఉన్నవారు వాటిపై కనీస అవగాహన కలిగి ఉండాలి. * గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కనీసం 2 గ్రాములు మొదలుకొని 500 గ్రాముల వరకు ఒక ఆర్థిక సంవత్సరానికి కొనుకోలు చేయవచ్చు. * ఈ బాండ్లను జారీ చేసేటప్పుడు గ్రాము విలువ ఎంత? అప్లికేషన్ గడువు తేదీలు ఏమిటి? అన్నది ఆర్.బి.ఐ. నిర్ణయిస్తుంది. * కాల పరిమితి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల తర్వాత గ్రాము విలువ ఎంతైతే ఉంటుందో అంత మొత్తాన్ని ఖాతాదారునికి అందజేస్తారు. బాండ్లు కొన్న తర్వాత కూడా ఐదవ సంవత్సరం నుండీ డబ్బు అవసరం అయితే ఆ సమయానికి ఉన్న గ్రాము ధర ఆధారంగా సొమ్మును పొందవచ్చు. * పెట్టుబడిదారులకు 2.75 శాతం (సంవత్సరానికి) చొప్పున వడ్డీ అందజేస్తారు. ఈ వడ్డీని ఆరు నెలలకు ఒకసారి ఖాతాదారుని ఖాతాకు జమ చేస్తారు. * ఈ గోల్డ్ బాండ్స్ మీద వచ్చే కాపిటల్ గైన్కు పన్ను మినహాయింపు ఉంటుంది. * గోల్డ్ బాండ్ రేటును ఇండియా బులియన్ అండ్ జెవెల్స్ అసోసియేషన్ (ఐ.బి.జె.ఎ) వారు అంతకు క్రితం వారంలోని 999 ప్యూరిటీ బంగారం క్లోజింగ్ రేటు సింపుల్ యావరేజీ ఆధారంగా నిర్ణయించిన ధరను బట్టి నిర్ణయిస్తారు. * ఈ గోల్డ్ బాండ్స్ స్టాక్ ఎక్సేంజీలలో లిస్ట్ అయి, ట్రేడ్అవుతూ ఉంటాయి కనుక ఒకవేళ ఐదేళ్లకు ముందే సొమ్మును వెనక్కి తీసుకోవాలంటే వాటిని అమ్మవచ్చు. * ఈ గోల్డ్ బాండ్స్‌ను లోన్ తీసుకోవడానికి కోల్లేటరల్గా కూడా వాడుకోవచ్చు. పెట్టుబడి కోసమే బంగారం కొనేవారికి ఈ గోల్డ్ బాండ్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బంగారానికి బదులు ఈ గోల్డ్ బాండ్స్ కొనడం వల్ల ఎలాంటి దొంగల భయం, ప్యూరిటీ భయం ఉండదు. అంతేకాకుండా బంగారం బదులు బాండ్స్ కొనడం వల్ల బంగారం డిమాండు తగ్గి, తద్వారా బంగారం దిగుమతులు తగ్గుముఖం పడతాయి. ఈ విధంగా మన దేశ ఉన్నతికి కూడా సహాయపడగలుగుతారు. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
కౌంట్ వాళ్లది.. క్యాష్ మనది
ఉమెన్ ఫైనాన్స్ / పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసు ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవటానికి, ఉన్న సంపదను పెంపొందించుకోవడానికి వివిధ పెట్టుబడి మార్గాలైనటువంటి ఈక్విటీ, డెట్‌లలో పెట్టుబడి పెడుతూ ఉంటారు చాలామంది. కాని, వాటిమీద పూర్తి అవగాహన లేకపోతే తరచూ వాటిని చూసుకుంటూ, అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకోవటానికి వీలు కుదరకపోవచ్చు. ఇలాంటి వారికోసమే పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసు (పిఎంఎస్) ప్రారంభమయింది. ఈ సర్వీసు అందజేసే కంపెనీ సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)తో పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ సర్వీసు పొందగోరే వ్యక్తులు ఎవరైనా సెబీతో రిజిష్టర్ అయిన పోర్ట్‌ఫోలియో మేనేజర్ వద్ద ఖాతాని ప్రారంభించవచ్చు. కనీస మొత్తం 25 లక్షలు మొదలుకుని ఎంత మొత్తానికైనా సర్వీసు పొందవచ్చు. ఈ సొమ్మును చెక్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రూపేణా లేదా షేర్ల రూపేణా జమచేయవచ్చు. ఈ ఖాతాను రెండు రకాలుగా కలిగి ఉండవచ్చు.. 1. డిస్క్రెషనరీ పిఎంఎస్: ఈ పద్ధతిలో ఏయే పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెట్టాలి అనేది ఫండ్ మేనేజర్ నిర్ణయిస్తారు. 2. నాన్ డిస్క్రెషనరీ పిఎంఎస్: ఈ పద్ధతిలో పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఏయే పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెడితే మంచిదో సూచనలిస్తారు. వాటిలో పెట్టాలా లేదా ఎప్పుడు పెట్టాలి అనేది ఖాతాదారుడు నిర్ణయించుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో ఎలా ఉండాలి, ఏమేమి చార్జీలు వర్తిస్తాయి, ఎంత శాతం అనేది ఖాతాదారుడు, పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఖాతా ప్రారంభించినప్పుడు రాసుకున్న రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఉంటాయి. సాధారణంగా రెండు రకాలైనటువంటి ఫీజును చార్జి చేస్తారు. పెట్టుబడులు నిర్వహించడానికి అయ్యే ఖర్చుని ఒక ఫిక్స్డ్ శాతంగానూ, రాబడి ఒక నిర్ణీత శాతం కన్నా ఎక్కువ వస్తే ఆ ఎక్కువ వచ్చిన రాబడి మీద కొంత శాతాన్ని ఫీజుగా చార్జి చేస్తారు. ఖాతాదారులు తప్పనిసరిగా డిమ్యాట్ ఖాతాను కలిగి ఉండాలి. డిస్క్రిషనరీ పద్ధతిలో ఖాతా ప్రారంభించేటప్పుడు ఒకవేళ ఖాతాదారుడు ఏవైనా షేర్లు కొనగూడదు అనుకున్నా, లేదా లార్జ్‌కాప్, మిడ్కాప్ మాత్రమే కొనాలి అని ఉన్నా, వాటిని అగ్రిమెంట్లో పొందుపరిచి వాటి ప్రకారం మేనేజ్ చేయమని చెప్పవచ్చు. ఎన్ఆర్ఐలు కూడా పిఎంఎస్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకోసం ఎన్ఆర్ఐలు పిఐఎస్ ఖాతాను ప్రారంభించవలసి ఉంటుంది. ఎన్ఆర్ఐలకి, రెసిడెంట్ ఇండియన్స్‌కి పిఎంఎస్ ఖాతాని ప్రారంభించడానికి అవసరమైన డాక్యుమెంట్స్ వేరుగా ఉంటాయి. పోర్ట్‌ఫోలియో మేనేజర్వద్ద ఉన్నటువంటి చెక్‌లిస్ట్ ఆధారంగా డాక్యుమెంట్స్ అందజేయాలి. ఈ పిఎంఎస్ ఖాతాలో ప్రతి ఒక్క ఖాతాదారుని పెట్టుబడులు వారి వారి లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించబడతాయి. ప్రతి ఆరు నెలలకొకసారి స్టేట్మెంట్ పొందవచ్చు. లేదా ఎప్పుడైనా పెట్టుబడులు పరిశీలించాలంటే పోర్ట్‌ఫోలియో మేనేజర్స్ స్టేట్మెంట్ అందజేస్తారు. కొంచెం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ పిఎంఎస్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
టాక్స్ ఫ్రీ బాండు పన్ను కొరకని పండు
ఉమన్ ఫైనాన్స్ సాధారణంగా చాలామంది దంపతులు తమ తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరం ఒక ఆదాయ వనరు సమకూరాలనో, అలాగే తమ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలనో.. రిస్క్ తక్కువగా ఉండే సాంప్రదాయిక మార్గాలలో (బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్టాఫీస్ డిపాజిట్లు మొదలైనవి) పెట్టుబడి పెడుతూ ఉంటారు. అలాంటి వారికి టాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్ బాండ్స్ ఒక చక్కటి పెట్టుబడి మార్గం. టాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్ బాండ్స్ అంటే ఈ బాండ్స్‌లో పెట్టిన పెట్టుబడి మీద వచ్చిన వడ్డీకి టాక్స్ (పన్ను) వర్తించదు. అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి మీ ఆదాయం మొత్తం లెక్కించేటప్పుడు ఆ ఆర్థిక సంవత్సరంలో మీకు టాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్ బాండ్స్ మీద లభించిన వడ్డీని ఆదాయంలో కలపనవసరం లేదు. * ఈ బాండ్లు చాలా తక్కువ రిస్క్‌తో కూడినవి. ఎందుకంటే ఇవి చాలావరకు ప్రభుత్వం సంస్థల చేత జారీ అయే బాండ్స్. వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు (మౌలిక సదుపాయాలను కల్పించే ప్రాజెక్టులు) ప్రభుత్వం వినియోగిస్తుంది. * ఈ బాండ్లు తీసుకుంటే నిర్ణీత వడ్డీని సంవత్సరానికి ఒకసారి అందజేస్తారు. వడ్డీని నేరుగా ఖాతాదారుని బ్యాంకు ఖాతాకు బదలీ చేస్తారు. టి.డి.ఎస్. (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కూడా వర్తించదు. * ఈ బాండ్లు 10, 15, 20 సంవత్సరాల కాల పరిమితితో జారీ అవుతాయి. * వీటిని ఫిజికల్‌గా, డీమ్యాట్ పద్దతిలోనూ పొందవచ్చు. * ఒకవేళ గడువు తీరక ముందే డబ్బు అవసరమైతే సెకండరీ మార్కెట్లో అమ్మవచ్చు. * సెకండరీ మార్కెట్లో అమ్మితే వచ్చే లాభానికి కాపిటల్ గైన్ టాక్స్ వర్తిస్తుంది. * ఎవరైతే ఒక నిర్ణీత, భద్రమైన వడ్డీ రావాలని కోరుకుంటారో, అలాగే పన్ను భారం ఆ నిర్ణీత వడ్డీ మీద వర్తించకూడదని భావిస్తారో వారికి ఈ బాండ్లు చాలా చాలా మంచి పెట్టుబడి మార్గం. అలాగే మనం వడ్డీ రేట్లు గమనించినట్లయితే అవి క్రమేణా తగ్గుతూ ఉన్నాయి కనుక, ఈ బాండ్లు దీర్ఘకాలానికి ఎక్కువ రిటర్న్స్ అందజేయడాన్ని గమనించవచ్చు. ఎక్కువ టాక్స్ పడే కేటగిరీలో ఉండేవారికి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోలిస్తే ఈ టాక్స్ ఫ్రీ బాండ్లు ఎక్కువ పోస్ట్ టాక్స్ రిటర్న్‌ని అందజేస్తాయి. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీకి పన్ను కట్టవలసి ఉంటుంది. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
కన్నుగప్పకుండానే.. పన్ను తప్పించుకోవచ్చు!
ఉమన్ ఫైనాన్స్ స్త్రీలకు పసుపు కుంకుమల కింద పుట్టింటివారు ఇచ్చే స్థిరాస్తులు, బంగారు ఆభరణాలను ఒక్కోసారి కుటుంబ అవసరాల కోసం విక్రయించవలసి రావచ్చు. అలా విక్రయించగా వచ్చిన డబ్బులో సింహ భాగాన్ని చాలామంది లాభం కోసం దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెడుతుంటారు. అయితే ఆదాయపన్ను యాక్ట్ 1961 సెక్షన్ 54 ఇ.సి. ప్రకారం, ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడుల మీద వచ్చిన లాభానికి పన్ను కట్టవలసి ఉంటుంది. అలా పన్ను భారం పడకూడదు అనుకుంటే, ఆ వచ్చిన లాభాన్ని దీర్ఘకాలిక కాపిటల్ గైన్ టాక్స్‌ఫ్రీ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపన్ను చట్టం ప్రకారం ఏదైనా స్థిరాస్తిని (ఇల్లు, భూమి, స్థలం మొదలైనవి) కనీసం 3 సంవత్సరాలు అమ్మకుండా లేదా ట్రాన్స్ఫర్ చేయకుండా ఉన్నట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణిస్తారు. ప్రస్తుతం దీర్ఘకాలిక పెట్టుబడుల లాభానికి 20 శాతం పన్ను భారం వర్తిస్తుంది. ఈ పన్ను భారం మినహాయింపుకు మన దేశంలో ప్రస్తుతం ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్), ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) వారు జారీ చేసే కాపిటల్ గైన్ టాక్స్‌ఫ్రీ బాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు... * ఒక్కొక్క బాండ్ విలువ 10,000 రూపాయలుగా ఉంటుంది. * ఎన్హెచ్ఏఐ అయితే కనీసం 1 బాండ్, ఆర్ఈసీ అయితే కనీసం 2 బాండ్స్ నుంచి మొదలుకొని గరిష్టంగా 500 బాండ్స్ (రూ.50,00,000) వరకు పెట్టుబడి పెట్టవచ్చు. * వీటిలో పెట్టిన మొత్తానికి సంవత్సరానికి 6 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. * 3 సంవత్సరాల తరువాత పెట్టిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు. * ఈ బాండ్స్‌ను తనఖా పెట్టడానికి గానీ, ట్రాన్స్ఫర్ చేయడానికి గానీ, అమ్మడానికి గానీ లేదా లోన్ తీసుకోవడానికి గానీ వీలుకాదు. * వీటిలో పెట్టిన దీర్ఘకాలిక పెట్టుబడుల లాభం మీద దీర్ఘకాలిక పన్ను మినహాయింపు వర్తిస్తుంది. స్వల్పకాలిక పెట్టుబడుల లాభం మీద పన్ను మినహాయింపు వర్తించదు. * అయితే ఈ బాండ్స్ మీద వచ్చే వడ్డీకి పన్ను కట్టవలసి ఉంటుంది. * ఈ బాండ్స్‌ను ఫిజికల్‌గాను, డీమాట్ పద్ధతిలో కూడా కొనుగోలు చేయవచ్చు. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’