కన్నుగప్పకుండానే.. పన్ను తప్పించుకోవచ్చు!
ఉమన్ ఫైనాన్స్
స్త్రీలకు పసుపు కుంకుమల కింద పుట్టింటివారు ఇచ్చే స్థిరాస్తులు, బంగారు ఆభరణాలను ఒక్కోసారి కుటుంబ అవసరాల కోసం విక్రయించవలసి రావచ్చు. అలా విక్రయించగా వచ్చిన డబ్బులో సింహ భాగాన్ని చాలామంది లాభం కోసం దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెడుతుంటారు. అయితే ఆదాయపన్ను యాక్ట్ 1961 సెక్షన్ 54 ఇ.సి. ప్రకారం, ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడుల మీద వచ్చిన లాభానికి పన్ను కట్టవలసి ఉంటుంది. అలా పన్ను భారం పడకూడదు అనుకుంటే, ఆ వచ్చిన లాభాన్ని దీర్ఘకాలిక కాపిటల్ గైన్ టాక్స్‌ఫ్రీ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టి పన్ను మినహాయింపు పొందవచ్చు.
ఆదాయపన్ను చట్టం ప్రకారం ఏదైనా స్థిరాస్తిని (ఇల్లు, భూమి, స్థలం మొదలైనవి) కనీసం 3 సంవత్సరాలు అమ్మకుండా లేదా ట్రాన్స్‌ఫర్ చేయకుండా ఉన్నట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణిస్తారు. ప్రస్తుతం దీర్ఘకాలిక పెట్టుబడుల లాభానికి 20 శాతం పన్ను భారం వర్తిస్తుంది. ఈ పన్ను భారం మినహాయింపుకు మన దేశంలో ప్రస్తుతం ఆర్‌ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్), ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) వారు జారీ చేసే కాపిటల్ గైన్ టాక్స్‌ఫ్రీ బాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు...
* ఒక్కొక్క బాండ్ విలువ 10,000 రూపాయలుగా ఉంటుంది.
* ఎన్‌హెచ్‌ఏఐ అయితే కనీసం 1 బాండ్, ఆర్‌ఈసీ అయితే కనీసం 2 బాండ్స్ నుంచి మొదలుకొని గరిష్టంగా 500 బాండ్స్ (రూ.50,00,000) వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
* వీటిలో పెట్టిన మొత్తానికి సంవత్సరానికి 6 శాతం చొప్పున వడ్డీ వస్తుంది.
* 3 సంవత్సరాల తరువాత పెట్టిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు.
* ఈ బాండ్స్‌ను తనఖా పెట్టడానికి గానీ, ట్రాన్స్‌ఫర్ చేయడానికి గానీ, అమ్మడానికి గానీ లేదా లోన్ తీసుకోవడానికి గానీ వీలుకాదు.
* వీటిలో పెట్టిన దీర్ఘకాలిక పెట్టుబడుల లాభం మీద దీర్ఘకాలిక పన్ను మినహాయింపు వర్తిస్తుంది. స్వల్పకాలిక పెట్టుబడుల లాభం మీద పన్ను మినహాయింపు వర్తించదు.
* అయితే ఈ బాండ్స్ మీద వచ్చే వడ్డీకి పన్ను కట్టవలసి ఉంటుంది.
* ఈ బాండ్స్‌ను ఫిజికల్‌గాను, డీమాట్ పద్ధతిలో కూడా కొనుగోలు చేయవచ్చు.
- రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’