Woman finance
-
పలు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 5 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేశ్, తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరిశంకర్, ‘తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ నియమితులయ్యారు. కీలకంగా పనిచేసిన వాళ్లకు.. తెలంగాణ మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్‌గా నియమితులైన ఆకుల లలిత గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు టీఆర్ఎస్లో చేరారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశించినా చివరి నిమిషంలో చేజారింది. తాజాగా నామినేటెడ్ పదవి లభించింది. బీవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా నామినేట్ అయిన గజ్జెల నగేశ్.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తండటాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్‌గా పనిచేస్తున్న పాటిమీది జగన్మోహన్రావు యువజన విభాగంలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చారు. గతంలో జీహెచ్ఎంసీ యువజన విభా గం ఇన్చార్జిగా పనిచేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమితులైన జూలూరు గౌరి శంకర్ పాత్రికేయుడు. రచయితగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. గతంలో బీసీ కమిషన్ సభ్యుడిగా చేసిన శంకర్‌కు ప్రస్తుతం నామినేటెడ్ పదవి లభించింది. విద్యార్థి దశ నుంచే వామపక్ష విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐలో పనిచేసిన డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమంలో 150కి పైగా కేసు లు ఎదుర్కొని 50 రోజులు జైలు జీవితం గడిపారు. కాగా యువ గాయకుడు సాయిచంద్‌ను రెండ్రోజుల క్రితం తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా, విద్యార్థి నాయకులుగా ఉద్యమంలో పాల్గొన్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు! -
కొంగుకు కాసే బంగారం
ఉమన్ ఫైనాన్స్ ఆడపిల్లల విద్యకు, వారి పెళ్లికి ఆర్థికంగా ఉపయోగపడాలనే ముఖ్య ఉద్దేశంతో ‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పొదుపు పథకం పోస్ట్ ఆఫీసులు, నిర్ణీత బ్యాంకు బ్రాంచీలలో అందుబాటులో ఉంటుంది. ఈ ఖాతాను బిడ్డ పుట్టిన సమయం మొదలుకుని 10 ఏళ్ల వయసు వరకు ఆడపిల్ల పేరు మీద ప్రారంభించవచ్చు. ఒక పాప పేరు మీద ఒక ఖాతాని మాత్రమే తీసుకోవాలి. గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేర మీద రెండు ఖాతాలు కలిగి ఉండొచ్చు. ఒకవేళ రెండో కాన్పులో కవల ఆడ పిల్లలు లేదా మొదటి కాన్పులోనే ముగ్గురు ఆడపిల్లలు జన్మించినట్లయితే ముగ్గురి పేరు మీదా ఖాతాను ప్రారంభించవచ్చు. పన్ను లేని పొదుపు ప్రతి ఆర్థిక సంవత్సరానికి కనీసం రు.1000 తప్పనిసరిగా డిపాజిట్ చెయ్యాలి. గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు ప్రతి ఆర్థిక సంవత్సరం డిపాజిట్ చెయ్యవచ్చు. రు.100 మొదలుకొని (100 గణాంకాలుగా) ఎన్నిసార్లయినా డిపాజిట్ చేయవచ్చు. కనీస డిపాజిట్ మొత్తం ఏ సంవత్సరమైనా జమ చేయకపోతే ఖాతా కొనసాగదు. మళ్లీ ఖాతాను కొనసాగించాలంటే 50 రూపాయల అపరాధ రుసుము కనీస డిపాజిట్‌తో కలిపి చెల్లించాలి. ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తానికి చక్రవడ్డీని (ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2016-17 కి 8.6 శాతం) అందజేస్తారు. వడ్డీ రేటును ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయిస్తుంటుంది. డిపాజిట్ చేసిన మొత్తానికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ ఖాతా ద్వారా వచ్చే వడ్డీకి, మెచ్యూరిటీ మొత్తానికి కూడా పన్ను వర్తించదు. వాపస్ తీసుకోవచ్చు ఖాతా కాల పరిమితి ఖాతా ప్రారంభించినప్పటి నుండి 21 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఖాతా ప్రారంభించిన 14 సంవత్సరాల వరకు మాత్రమే డిపాజిట్ చేయవలసి ఉంటుంది. కాల పరిమితి ముగిసిన తర్వాత ఖాతాలో సమకూరిన సొమ్ము మొత్తాన్ని ఆ అమ్మాయికి అందచేస్తారు. ఆమెకు 18 సంవత్సరాల వయసు నిండిన తర్వాత ఖాతాలోని సొమ్ములో 50 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ 18 సం. వయసు నిండాక ఖాతా కాల పరిమితి ముగియక ముందే వివాహం జరిగినట్లయితే ఖాతాను క్లోజ్ చేసి మొత్తం సొమ్మును వాపస్ తీసుకోవచ్చు. ఏ బాలిక పేరు మీదనైతే డిపాజిట్ చేశారో వారు మరణిస్తే ఖాతాలోని సొమ్మును గార్డియన్‌కు అందజేస్తారు. నామినీ సౌకర్యం ఈ ఖాతాకు లేదు. కాల పరిమితి ముగిసిన తర్వాత ఖాతాను క్లోజ్ చేయనట్లయితే అందులో ఉన్న సొమ్ముకు వడ్డీ వస్తుంది. అలాగే ఖాతాను ఒక శాఖ నుండి మరొక శాఖకు, అలాగే వేరొక బ్యాంకుకు కూడా బదలీ చేసుకునే సౌలభ్యం ఉంది. 10 సం. వయసు నిండిన బాలికలు సొంతంగా ఖాతాని నిర్వహించుకోవచ్చు. ఈ ఖాతాలో డబ్బు, చెక్కు, డిమాండ్ డ్రాఫ్టు రూపేణా డిపాజిట్ మొత్తాన్ని జమ చేయవచ్చు. ప్రస్తుతానికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అందుబాటులో లేదు. ఈ ఖాతాలోని సొమ్ము మీద లోన్ తీసుకునే అవకాశం లేదు. చిన్న మొత్తంతో పొదుపు చేసుకుని తమ ఆడపిల్లల భవిష్యత్తుకు ఒక నిర్దిష్ట మొత్తాన్ని అందజేయాలనుకునే తల్లిదండ్రులందరికీ ఈ సుకన్య సమృద్థి యోజన పథకం ఒక చక్కటి పెట్టుబడి మార్గం. -
తెలుసుకుని తీసుకోండి పాలసీ
ఉమన్ ఫైనాన్స్ / హెల్త్ చాలామంది తమ పిల్లల పైచదువులు, పెళ్లిళ్లు, సొంత ఇల్లు వంటి వాటికి తమ తాహతుకు తగ్గట్టుగా పొదుపు చేస్తూ ఉంటారు. అలాగే అనుకోని సంఘటన జరిగి కుటుంబ పెద్ద మరణిస్తే తమ పిల్లల భవిష్యత్తు అవసరాలకు చేదోడువాదోడుగా ఉండటానికి జీవిత బీమా పాలసీలకు ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు. కానీ ఆరోగ్య బీమాని అంతగా పట్టించుకోరు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు.. కూడబెట్టిన సొమ్ము మొత్తం వైద్యానికి ఖర్చుపెట్టవలసి వస్తుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారౌతుంది. కనుక తప్పనిసరిగా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలి. వ్యక్తిగత పాలసీలు: ఇవి ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉండే పాలసీలు. ప్రీమియం అనేది ఆ వ్యక్తి వయస్సు, అలవాట్లు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు: ఇవి కుటుంబం మొత్తానికి కలిపి ఒకే పాలసీగా ఉంటాయి. వ్యక్తిగత పాలసీలతో పోలిస్తే ఇందులో ప్రీమియం తక్కువగా ఉంటుంది. బీమా పాలసీ - అవగాహన సబ్ లిమిట్స్ : కొన్ని ఇన్యూరెన్స్ కంపెనీలు పాలసీలను పేషెంట్ రూము అద్దె, ఐ.సి.యు. చార్జీలు, అలాగే కొన్ని రకాల వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చులకు పాలసీని సబ్ లిమిట్స్‌తో అందజేస్తాయి. ఉదాహరణకు మీరు 3 లక్షల ఆరోగ్య బీమా పాలసీని రూమ్ అద్దెకు 1 శాతం సబ్ లిమిట్ ఉన్నది తీసుకున్నట్లయితే, మీకు 3,000 రూపాయలు మాత్రమే రూమ్ అద్దెను చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని మీరు భరించవలసి ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు సబ్ లిమిట్స్ లేని పాలసీని ఎంచుకోవడం మంచిది. ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు : మీరు తీసుకునే పాలసీ ఎన్ని రోజుల ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవరేజీని అందజేస్తోందో గమనించండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ రోజులు అందించే వాటిని ఎంచుకోండి. చాలావరకు కంపెనీలు 60 రోజుల ప్రీ హాస్పిటలైజేషన్, 90 రోజుల పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజీని అందజేస్తున్నాయి, కొన్ని మాత్రమే 30, 60 రోజుల కవరేజీని ఇస్తున్నాయి. క్లైమ్ సెటిల్మెంట్: క్లైమ్ సెటిల్మెంట్ను రెండు విధాలుగా పొందవచ్చు. మొదటిది పాలసీ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ప్రీ ఆథరైజ్డ్ పొందిన క్యాష్ లెస్ పద్ధతిలో వైద్యం పొందడం. ఈ పద్ధతిలో పాలసీదారుడు ఎటువంటి సొమ్మునూ ఖర్చుపెట్టనవసరం లేదు. రెండవది రీ-ఇంబర్స్మెంట్ పద్ధతి. పాలసీదారుని సొంత డబ్బుతో వైద్యం పొంది, ఆ తరువాత ఆ వైద్యానికి సంబంధించిన ఖర్చుల బిల్లులను, మిగతా డాక్యుమెంట్లను ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసి, రీ-ఇంబర్స్మెంట్ పొందొచ్చు. నో క్లైమ్ బోనస్: చాలా వరకు ఇన్యూరెన్స్ కంపెనీలు పాలసీ సమయంలో క్లైమ్ లేకపోతే బోనస్‌ను అందచేస్తున్నాయి. ఈ బోనస్‌ను రెన్యూ ప్రీమియంలో డిస్కౌంట్, ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచడం, ఫ్రీ హెల్త్ చెకప్ రూపేణా చెల్లిస్తున్నాయి. వయో పరిమితి: పాలసీ తీసుకునేటప్పుడు గమనించదగ్గ అతి ముఖ్యమైన విషయం.. పాలసీ ప్రారంభించడానికి, రెన్యూ చేయడానికి ఉండవలసిన కనిష్ట, గరిష్ట వయో పరిమితులు. రెన్యూ చేయడానికి ఉండే గరిష్ట వయో పరిమితి వరకు మాత్రమే కవరేజీని అందజేస్తారు. ఆ తర్వాత రెన్యూ చేయరు. కొన్ని పాలసీలు జీవితకాలం వరకు రెన్యూ చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. కనుక జీవిత కాల రెన్యూ పాలసీలను ఎంచుకోవడం మంచిది. ప్రీమియం లోడింగ్ ఆఫ్టర్ క్లైమ్: కొన్ని పాలసీలు ఒకవేళ పాలసీ కాలంలో క్లైమ్ ఉన్నట్లయితే తర్వాత సంవత్సరానికి రెన్యూ చేసేటప్పుడు ప్రీమియమ్‌కు కొంత మొత్తాన్ని అదనంగా కలుపుతున్నాయి. కనుక పాలసీ తీసుకునేటప్పుడు దీని గురించి కూడా క్షణ్ణంగా పరిశీలించండి. ఆరోగ్య బీమా పాలసీకి కట్టే ప్రీమియమ్‌ను ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80డి కింద 25,000 రూపాయల వరకు తమ కుటుంబానికి (భార్య/భర్త, పిల్లలు), తల్లిదండ్రులకు (సీనియర్ సిటిజన్) ప్రీమియం చెల్లిస్తే 30,000 రూపాయలకు అదనంగా పన్ను మినహాయింపును పొందవచ్చు. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
సంతోషం అనే వడ్డీ మిగలాలి
రూపాయి వ చ్చినా, పోయినా... ఉమన్ ఫైనాన్స్ మన దేశానికి ఆర్థిక మంత్రి ఎలాగైతే ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను రూపొందించి, ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయ వనరులను వినియోగించి దేశ పురోగతికి తోడ్పడతారో... అదే విధంగా ప్రతి గృహిణీ, ఉద్యోగినీ తన వంతు బాధ్యతగా తమ కుటుంబ బడ్జెట్‌ను రూపొందించుకొని దాని ప్రకారం నడుచుకుంటే సంసారం అనే బండి ఏ ఒడిదుడుకులూ లేకుండా గమ్యాన్ని చేరుతుంది. గమ్యం తెలియకుండా ప్రయాణాన్ని ఎవరూ మొదలు పెట్టరు. ఇదే సూత్రం కుటుంబ ఆర్థిక ప్రణాళిక అమలులోనూ కనిపిస్తుంది. ఆర్థికంగా మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నారు? అనే స్పష్టతను కలిగి ఉండాలి. ఈ స్పష్టతను బడ్జెట్ అందిస్తుంది. బడ్జెట్ అంటే... మీకు ఏయే రూపాలలో ఆదాయం సమకూరుతుంది? మీకు ఉన్నటువంటి ఖర్చులు ఏంటి? అవి పోగా మిగులు / తగులు ఎంత? మిగులును ఏ విధంగా పెట్టుబడి పెట్టి మీ భవిష్యత్తు అవసరాలకు నిధులు సమకూర్చుకోవాలి? తగులును ఏ విధంగా అధిగమించాలి? ఇలాంటివన్నిటినీ నమోదు చేసి మీ కుటుంబానికి ఒక ప్రణాళిక ఏర్పరచుకోవడమే. ముందుగా మీరు మీకు ఉన్నటువంటి ఆదాయ మార్గాలనన్నింటినీ (జీతం, అద్దె, వడ్డీ, వ్యాపారం, వ్యవసాయం మొదలైన వాటి నుంచి వచ్చే ఆదాయం) నమోదు చేయండి. ఈ ఆదాయం ఏయే నిర్ణీత సమయాలలో.. నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి.. వస్తుందో రాయండి. ఏయే ఖర్చులు ఏయే నిర్ణీత సమయాలలో ఉంటాయో పొందుపరచండి. ఉదా: నెలవారీ ఖర్చులైన అద్దె, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, పాలు, నిత్యావసర వస్తువులు మొదలైనవి; మూడు నెలలకు, ఆరు నెలలకు ఉండే పిల్లల స్కూలు ఫీజులు, సంవత్సర ఖర్చులైన ఇంటి పన్ను, ఇన్సూరెన్స్ ప్రీమియం తదితరాలు. మీ ఖర్చులను గమనించి, వాటిలో ఏవి అత్యవసరమైనవి, ఏవి కావలసినవి, ఏవి లగ్జరీ ఖర్చులో విడివిడిగా రాయండి.ఇలా నమోదు చేయడం ద్వారా మీరు అనవసర ఖర్చులు ఎక్కడ పెడుతున్నారో మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్త వహించగలుగుతారు. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలైన పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంత ఇల్లు, రిటైర్మెంట్ సమయానికి కావలసిన ఆదాయం మొదలైన వాటికి నెలవారీగా / సంవత్సరానికీ ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎప్పటి నుండి మొదలు పెట్టాలి? ఎంత అవసరం అవొచ్చు అనే దాన్ని పరిగణనలోకి తీసుకోండి.అత్యవసర నిధిగా కనీసం మూడు నెలల ఖర్చుల మొత్తం మీ బ్యాంకు ఖాతాలో ఉండే విధంగా చూసుకోండి. మీరు బడ్జెట్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యులందరినీ భాగస్వాములను చేయండి. బడ్జెట్‌ని కుటుంబ సభ్యులందరికీ వివరించండి. బడ్జెట్‌ని ప్రిపేర్ చేయడం ఎంత ముఖ్యమో దానికి అనుగుణంగా నడుచుకోవడమూ అంతే ముఖ్యం. ఇక క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా ఖర్చు చేయడం మనం చూస్తూ ఉంటాం. కనుక సాధ్యమైనంత వరకు క్యాష్‌ని / డెబిట్ కార్డుని వినియోగించడం మంచిది. లేదా క్రెడిట్ కార్డు వాడినా మీరు ఏ ఖర్చులనైతే బడ్జెట్లో పొందుపరుస్తారో వాటికి మాత్రమే వాడడం మంచిది. ఈ క్రెడిట్ కార్డుని కూడా బడ్జెట్‌కు అనుగుణంగా వాడితే ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పరిమితి దాటితే ఆ బిల్లులు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొవలసి ఉంటుంది. మీ వ్యక్తిత్వానికి, నష్ట భయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ దశలో ముందుగా ఆదాయ వ్యయాలను పర్యవేక్షించడానికి బడ్జెట్‌ను వేసుకోవాలి. ఖర్చులను తగ్గించుకుని పొదుపు పెంచుకోవడం, ఆ నిధుల మొత్తాన్ని వైవిధ్యభరితంగా దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి మహిళా తన, తన కుంటుంబ ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించగలదు. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
టాక్స్ ఫ్రీ బాండు పన్ను కొరకని పండు
ఉమన్ ఫైనాన్స్ సాధారణంగా చాలామంది దంపతులు తమ తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరం ఒక ఆదాయ వనరు సమకూరాలనో, అలాగే తమ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలనో.. రిస్క్ తక్కువగా ఉండే సాంప్రదాయిక మార్గాలలో (బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్టాఫీస్ డిపాజిట్లు మొదలైనవి) పెట్టుబడి పెడుతూ ఉంటారు. అలాంటి వారికి టాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్ బాండ్స్ ఒక చక్కటి పెట్టుబడి మార్గం. టాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్ బాండ్స్ అంటే ఈ బాండ్స్‌లో పెట్టిన పెట్టుబడి మీద వచ్చిన వడ్డీకి టాక్స్ (పన్ను) వర్తించదు. అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి మీ ఆదాయం మొత్తం లెక్కించేటప్పుడు ఆ ఆర్థిక సంవత్సరంలో మీకు టాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్ బాండ్స్ మీద లభించిన వడ్డీని ఆదాయంలో కలపనవసరం లేదు. * ఈ బాండ్లు చాలా తక్కువ రిస్క్‌తో కూడినవి. ఎందుకంటే ఇవి చాలావరకు ప్రభుత్వం సంస్థల చేత జారీ అయే బాండ్స్. వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు (మౌలిక సదుపాయాలను కల్పించే ప్రాజెక్టులు) ప్రభుత్వం వినియోగిస్తుంది. * ఈ బాండ్లు తీసుకుంటే నిర్ణీత వడ్డీని సంవత్సరానికి ఒకసారి అందజేస్తారు. వడ్డీని నేరుగా ఖాతాదారుని బ్యాంకు ఖాతాకు బదలీ చేస్తారు. టి.డి.ఎస్. (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కూడా వర్తించదు. * ఈ బాండ్లు 10, 15, 20 సంవత్సరాల కాల పరిమితితో జారీ అవుతాయి. * వీటిని ఫిజికల్‌గా, డీమ్యాట్ పద్దతిలోనూ పొందవచ్చు. * ఒకవేళ గడువు తీరక ముందే డబ్బు అవసరమైతే సెకండరీ మార్కెట్లో అమ్మవచ్చు. * సెకండరీ మార్కెట్లో అమ్మితే వచ్చే లాభానికి కాపిటల్ గైన్ టాక్స్ వర్తిస్తుంది. * ఎవరైతే ఒక నిర్ణీత, భద్రమైన వడ్డీ రావాలని కోరుకుంటారో, అలాగే పన్ను భారం ఆ నిర్ణీత వడ్డీ మీద వర్తించకూడదని భావిస్తారో వారికి ఈ బాండ్లు చాలా చాలా మంచి పెట్టుబడి మార్గం. అలాగే మనం వడ్డీ రేట్లు గమనించినట్లయితే అవి క్రమేణా తగ్గుతూ ఉన్నాయి కనుక, ఈ బాండ్లు దీర్ఘకాలానికి ఎక్కువ రిటర్న్స్ అందజేయడాన్ని గమనించవచ్చు. ఎక్కువ టాక్స్ పడే కేటగిరీలో ఉండేవారికి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోలిస్తే ఈ టాక్స్ ఫ్రీ బాండ్లు ఎక్కువ పోస్ట్ టాక్స్ రిటర్న్‌ని అందజేస్తాయి. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీకి పన్ను కట్టవలసి ఉంటుంది. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
కట్టేది తక్కువ... పొందేది ఎక్కువ
టర్మ్ ఇన్సూరెన్స్ ఉమన్ ఫైనాన్స్ ఈ రోజుల్లో ఆలుమగలు ఇద్దరూ సంపాదిస్తే గానీ కుటుంబం సజావుగా సాగదు. కనుక చాలామంది మహిళలు తప్పనిసరిగా ఉద్యోగమో, వ్యాపారమో ఏదో ఒకటి చేస్తూ తమ కుటుంబ ఖర్చులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆదాయంలో తమ మిగులుకు తగ్గట్లుగా పొదుపు చేసి వాటిని సరైన మార్గాలలో పెట్టుబడి పెడుతున్నారు. మరి ఏ కారణం చేతనైనా ఆలూమగలలో ఒకరి ఆ సంపాదన ఆగిపోతే? ఈ ప్రశ్నకు సరైన సమాధానం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక నిర్ణీత కాలానికి లభ్యమయ్యేది. ఆ నిర్ణీత కాలంలో మరణం సంభవిస్తే, ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకొంటామో అంత మొత్తం నామినీకి అందజేస్తారు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే:కనీసం 18 సంవత్సరాల వయస్సు కలవారై ఉండాలి. చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ టర్మ్ పాలసీలను గరిష్టంగా 60 సంవత్సరాల వయస్సు గలవారి వరకు అందజేస్తున్నారు. చాలా తక్కువ (1/2) కంపెనీలు మాత్రమే 70 ఏళ్ల వారికి కూడా అందజేస్తున్నారు. ఈ పాలసీని కనీసం 5 నుండి 40 ఏళ్ల కాలపరిమితి వరకు ఇస్తున్నారు.ఎంత మొత్తం భీమాకి అనుమతిస్తారో పాలసీదారుకి వయస్సు, సంపాదన, తదితర విషయాల మీద ఆధారపడి ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్థారిస్తాయి. {పీమియం ఎంతైతే చెల్లిస్తారో ఆ మొత్తం ఇన్‌కమ్‌ట్యాక్స్ యాక్ట్ 1961, సెక్షన్ 80సి కింద పన్ను రాయితీ లభిస్తుంది. ఈ టర్మ్ పాలసీ ప్రీమియం సాంప్రదాయక పథకాలైన ఎండోమెంట్, హోల్ లైఫ్ మొదలైన వాటితో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం పాలసీదారు చనిపోతేనే నామినీకి ఈ కవరేజీ అందుతుంది. పాలసీ గడువు ముగిసిన తరువాత కూడా పాలసీదారు జీవించి ఉన్నట్లయితే, ఎటువంటి కవరేజీ రాదు. ఎందుకంటే టర్మ్ పాలసీ అనేది పూర్తిగా రిస్క్‌ని అధిగమించడానికి ఉపయోగపడేదిగా ఉంటుంది. పాలసీ తీసుకొనేటప్పుడు గమనించదగ్గ విషయాలు: పాలసీ ప్రపోజల్ ఫామ్‌లో అన్ని విషయాలు (మీ ఫ్యామిలీ హిస్టరీ, సంపాదన, ఆరోగ్య సమస్యలు మొదలైనవి) పొందుపరచండి. ఒకవేళ మీరు దాచిన విషయం ఏదైనా పాలసీ ఇచ్చే విషయంలో ప్రభావం చూపేదైతే, క్లైమ్ సెటిల్మెంట్ చేయరు. నామినీని తప్పనిసరిగా నమోదు చేయండి.పాలసీ నియమ నిబంధనలని తప్పనిసరిగా చదివి ఏ పాలసీ కావాలో నిర్ణయించుకోండి. మీ వయస్సు, సంపాదించడానికి మీకున్న కాలం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక బరువు బాధ్యతలు, భవిష్యత్తులో మీరు సంపాదించే మొత్తం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు... ఇలా పలు విషయాలను పరిగణనలోకి తీసుకొని మీ జీవితానికి ఉండే విలువను లెక్కలోకి తీసుకోవాలి. దానికి అనుగుణంగా జీవిత భీమాని ఈ టర్మ్ పాలసీ ద్వారా తీసుకోవచ్చు లేదా మీ వార్షిక ఆదాయానికి 10 నుండి 12 రెట్ల కవరేజీని తీసుకోవచ్చు. మనిషి చనిపోతేనే కవరేజీ వస్తుంది, బతికి ఉన్నట్లయితే మనం కట్టిన ప్రీమియం మొత్తం పోతుంది కదా అనే ఒక అపోహతో ఈ పాలసీని కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. సంపాదించే వ్యక్తి అనుకోని సంఘటన వల్లో, జబ్బునపడో, మరే ఇతర కారణం చేతనైనా మరణిస్తే అతను/ ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేరు. ఆ కుటుంబం, వారికుండే ఆర్థిక అవసరాలు, లక్ష్యాలు ముందుకు వెళ్లాలి కాబట్టి అందుకు ఆర్థిక చేయూత ఎంతైనా అవసరం. ఆ చేయూతను సరైన భీమా పాలసీ మాత్రమే తీరుస్తుందని గుర్తించాలి. -
కన్నుగప్పకుండానే.. పన్ను తప్పించుకోవచ్చు!
ఉమన్ ఫైనాన్స్ స్త్రీలకు పసుపు కుంకుమల కింద పుట్టింటివారు ఇచ్చే స్థిరాస్తులు, బంగారు ఆభరణాలను ఒక్కోసారి కుటుంబ అవసరాల కోసం విక్రయించవలసి రావచ్చు. అలా విక్రయించగా వచ్చిన డబ్బులో సింహ భాగాన్ని చాలామంది లాభం కోసం దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెడుతుంటారు. అయితే ఆదాయపన్ను యాక్ట్ 1961 సెక్షన్ 54 ఇ.సి. ప్రకారం, ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడుల మీద వచ్చిన లాభానికి పన్ను కట్టవలసి ఉంటుంది. అలా పన్ను భారం పడకూడదు అనుకుంటే, ఆ వచ్చిన లాభాన్ని దీర్ఘకాలిక కాపిటల్ గైన్ టాక్స్‌ఫ్రీ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపన్ను చట్టం ప్రకారం ఏదైనా స్థిరాస్తిని (ఇల్లు, భూమి, స్థలం మొదలైనవి) కనీసం 3 సంవత్సరాలు అమ్మకుండా లేదా ట్రాన్స్ఫర్ చేయకుండా ఉన్నట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణిస్తారు. ప్రస్తుతం దీర్ఘకాలిక పెట్టుబడుల లాభానికి 20 శాతం పన్ను భారం వర్తిస్తుంది. ఈ పన్ను భారం మినహాయింపుకు మన దేశంలో ప్రస్తుతం ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్), ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) వారు జారీ చేసే కాపిటల్ గైన్ టాక్స్‌ఫ్రీ బాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు... * ఒక్కొక్క బాండ్ విలువ 10,000 రూపాయలుగా ఉంటుంది. * ఎన్హెచ్ఏఐ అయితే కనీసం 1 బాండ్, ఆర్ఈసీ అయితే కనీసం 2 బాండ్స్ నుంచి మొదలుకొని గరిష్టంగా 500 బాండ్స్ (రూ.50,00,000) వరకు పెట్టుబడి పెట్టవచ్చు. * వీటిలో పెట్టిన మొత్తానికి సంవత్సరానికి 6 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. * 3 సంవత్సరాల తరువాత పెట్టిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు. * ఈ బాండ్స్‌ను తనఖా పెట్టడానికి గానీ, ట్రాన్స్ఫర్ చేయడానికి గానీ, అమ్మడానికి గానీ లేదా లోన్ తీసుకోవడానికి గానీ వీలుకాదు. * వీటిలో పెట్టిన దీర్ఘకాలిక పెట్టుబడుల లాభం మీద దీర్ఘకాలిక పన్ను మినహాయింపు వర్తిస్తుంది. స్వల్పకాలిక పెట్టుబడుల లాభం మీద పన్ను మినహాయింపు వర్తించదు. * అయితే ఈ బాండ్స్ మీద వచ్చే వడ్డీకి పన్ను కట్టవలసి ఉంటుంది. * ఈ బాండ్స్‌ను ఫిజికల్‌గాను, డీమాట్ పద్ధతిలో కూడా కొనుగోలు చేయవచ్చు. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
ఇంట్లో ఉన్నా పెన్షన్ వస్తుంది!
♦ ఉమన్ ఫైనాన్స్ జీవితం చాలా ఉందనో, పిల్లలు బాగోగులు చూస్తారనో, చనిపోయేవరకు పనిచేస్తూ ఉంటారనో, ఇప్పటికే ఆస్తులు ఉన్నాయనో... ఇలా ఎన్నో ఆలోచనలతో దేశ జనాభాలో సుమారుగా 85 శాతం మంది రిటైర్మెంట్ ప్లానింగ్‌ను అంతగా పట్టించుకోవడం లేదు. గృహిణుల విషయమైతే ఇక చెప్పేదేముందీ? అన్నిటికీ భర్త మీదే ఆధారపడతారు. అలా కాకుండా గృహిణులు కూడా తాము కూడబెట్టిన సొమ్ముతో పెన్షన్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవచ్చు. అరవై సంవత్సరాలు నిండాక నెలవారీ జీతం / ఆదాయం ఎక్కువ మందికి ఉండదు. సంపాదించే వయస్సులోనే తగిన మొత్తాన్ని పొదుపు, మదుపు చేయడం ద్వారా రిటైర్మెంట్ తరువాత జీవితానికి అవసరమయ్యే ఖర్చులని అధిగమించవచ్చు. 50, 55 సంవత్సరాలు వచ్చాక రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తే అది అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం రిటైర్మెంట్ కోసం నిధిని సమకూర్చుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీసులు, స్థిరాస్తి, షేర్లు మొదలైన పలు రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం వారి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (్కఊఖఈఅ) సంస్థచే ఈ ఎన్పీఎస్ నిర్వహించబడుతుంది. ఈ స్కీములో సేకరించిన మొత్తాన్ని పీఎఫ్ఆర్డీఏచే నియమితులైన ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్‌తో వివిధ రకాల పెట్టుబడి మార్గాలలో గవర్నమెంట్ సెక్యూరిటీక్ (ఎ), కార్పొరేట్ బాండ్స్ (ఇ), ఈక్విటీ షేర్స్ (ఉ)ను పీఎఫ్ఆర్డీఏ గైడ్‌లైన్స్ ఆధారంగా మదుపు చేయడం జరుగుతుంది. ఇందులో మదుపు చేయడానికి ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. 18 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగినవాళ్లు పెట్టుబడి చేయడానికి అర్హులు. పెట్టుబడి పెట్టిన సొమ్మును ఏ అసెట్ క్లాసులో మదుపు చేయాలో ఎంచుకొనే సదుపాయం కూడా ఉంది. ఎందులో పెట్టాలో అవగాహన లేనప్పుడు ఆటో చాయిస్ ఎంచుకోవచ్చు. ఇందులో 2 రకాల ఖాతాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. అవి : టైర్ 1, టైర్ 2 టైర్ 1: ఇది రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవడానికి ప్రత్యేకించినదిగా చెప్పుకోవచ్చు. ఈ ఖాతా నుండి 60 సంవత్సరాలలోపు డబ్బును తీసుకోవడం సులభతరం కాదు. ఒకవేళ అత్యవసరమైనప్పుడు తీసుకోవలసివచ్చినప్పుడు జమ చేసిన మొత్తంలో కేవలం 20 శాతం మొత్తాన్ని మాత్రమే ఇస్తారు. మిగతా 80 శాతంతో పెన్షన్ కోసం ఏదైనా యాన్యుటీని కొనుగోలు చేయవలసి ఉంటుంది. 60 సంవత్సరాల తరువాతనైతే 40 శాతం తప్పనిసరిగా యాన్యుటీ కొనుగోలు చేయాలి, మిగతా 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు లేదా అవసరం లేకపోతే మొత్తం 100 శాతంతో పెన్షన్‌కు యాన్యుటీ తీసుకోవచ్చు. అలాగే 60 సంవత్సరాలలోపు ఖాతాదారుకి మరణం సంభవించినట్లయితే మొత్తం 100 శాతం సొమ్మును ఖాతాదారు నామినీకి/ లీగల్ హైర్స్కి అందజేస్తారు. ఈ ఖాతాను నెలకు 500 రూపాయల కనీస మొత్తంతో ప్రారంభించవచ్చు. సంవత్సరానికి కనీసం 6,000 రూపాయలను జమ చేయవలసి ఉంటుంది. గరిష్ట మొత్తం అనేది ఖాతాదారుని వెసులుబాటుని బట్టి ఉంటుంది. టైర్-2: ఇది బ్యాంకు సేవింగ్ ఖాతా లా ఉంటుంది. డబ్బును జమ చేయడం, ఉపసంహరించడం ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఇందులో మదుపు చేయడానికి టైర్-1 ఖాతా యాక్టివ్‌గా ఉండటం తప్పనిసరి. ఈ ఖాతాను 1,000 రూపాయల కనీస మొత్తంలో ప్రారంభించి, ఆ తరువాత 250 రూపాయల కనీస మొత్తంతో జమ చేసుకొనే వెసులుబాటు ఉంది. సంవత్సరానికి కనీసం 2,000 రూపాయల మొత్తాన్ని జమ చేయవలసి ఉంటుంది. టైర్-1 ఖాతాలో ఎవరైతే పెట్టుబడి పెడతారో వారు ఆ మొత్తాన్ని సెక్షన్ 80 ఇఇఈ (1ఆ) కింద గరిష్టంగా 50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇది సెక్షన్ 80ఇ కింద ఇచ్చే 1,50,000 రూపాయల మినహాయింపుకు అదనంగా ఉంటుంది. -
కనిపించని బంగారం.. కురిపించును కనక వర్షం
ఉమన్ ఫైనాన్స్ ప్రస్త్తుతం పసిడిలో పెట్టుబడికి ప్రధానంగా రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 1. ఫిజికల్ గోల్డ్ : ఆభరణాలు, నాణేలు, కడ్డీలు. 2.పేపర్ గోల్డు : గోల్డ్ ఇ.టి.ఎఫ్. (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్), గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. 1. ఫిజికల్ గోల్డ్ అవసరం ఉన్నంత మేరకు శుభకార్యాలకు పసిడి ఆభరణాల చేయించడం మంచిదే. అయితే ఫిజికల్ గోల్డ్‌తో వ్యవహరించేటప్పుడు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. తరుగు, మజూరి ఖర్చులు రావు.ఏ షాపులోనైతే కొన్నారో అదే షాపులో అమ్మినప్పుడు మాత్రమే ఆభరణం ఉన్న బరువుకు సరిపడా బరువు బంగారం ఇస్తారు. వేరే షాపులో అయితే తగ్గిస్తారు. చాలావరకు షాపు యజమానులు బంగారు ఆభరణాలు అమ్మినా, మళ్లీ ఆభరణాలే ఇస్తారు. డబ్బులు ఇవ్వరు. చాలామంది లాకర్లలో నగలు దాచి పెడతారు. కానీ వాటి విలువకు సరిపడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోరు. దీనివలన ఏదైనా దొంగతనం లేదా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు బ్యాంకువారు నామమాత్రపు ఇన్సూరెన్స్‌ను మాత్రమే అందజేస్తారు. మన బంగారం మార్కెట్లో స్వచ్ఛత, సర్టిఫికేషన్ల విషయంలో పూర్తిస్థాయిలో క్రమబద్దీకరించబడలేదు. కనుక చాలామంది మోసపోతూ ఉంటారు. బ్యాంకుల నుండి నాణేలు, కడ్డీలు కొనేటప్పుడు తిరిగి వాటిని బ్యాంకులు కొనవు. తిరిగి వాటిని షాపులవారి వద్దనే అమ్మాలి. ఇక్కడ కొంత నష్టపోవలసి ఉంటుంది. 2. పేపర్ గోల్డ్.. గోల్డ్ ఇ.టి.ఎఫ్ ఒక గోల్డ్ ఇ.టి.ఎఫ్ ఒక గ్రాము బంగారానికి సమానం. ఈ ఇ.టి.ఎఫ్.లలో గోల్డ్ కొనడానికి డీమాట్, ట్రేడింగ్ ఎకౌంట్ తప్పనిసరి. ఇ.టి.ఎఫ్.లు ఆన్లైన్లో ట్రేడ్ అవుతాయి కాబట్టి కొనుగోళ్లు అమ్మకాలు సులభం. బంగారం ధర పడినప్పుడల్లా క్రమబద్ధంగా ఇ.టి.ఎఫ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫిజికల్ బంగారంలో ఎదురయ్యే ఇబ్బందులు (లాకర్ ఛార్జీలు, తరుగు, క్వాలిటీ మొదలైనవి) ఇక్కడ ఉండవు. బంగారంపేపరు రూపంలో మాత్రమే ఉంటుంది. ఒకవేళ బంగారం కొనవలసి ఉంటే ఆన్లైన్లో అమ్మేసి బంగారం కొనవచ్చు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్: గోల్డ్ ఇ.టి.ఎఫ్. వలే కాకుండా వీటిలో నెలనెలా 500 రూపాయల కనీస మొత్తంతో కూడా (సిప్ పద్ధతిలో) పెట్టుబడి పెట్టవచ్చు. నెలనెలా బంగారంలో పెట్టుబడి పెట్టేవారికి ఇది ఒక మంచి పద్ధతి. పెట్టుబడుల కేటాయింపులలో భాగంగా మీ మిగులు మొత్తాలలో 5 శాతం నుండి 10 శాతం వరకు బంగారంలో కేటాయింపులు జరుపవచ్చు. కేవలం పెట్టుబడి దృక్పథంతో బంగారం కొనుగోలు చేయాలనుకొనేవారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ బాండ్ స్కీం అనువైనదిగా చెప్పవచ్చు. -
లక్షలు పెట్టకుండానే.. లక్ష్యాన్ని చేరుకుంటాం!
ఉమన్ ఫైనాన్స్ ఈ రోజుల్లో చాలామంది మహిళలు రిజిస్ట్రేషన్ లేని చిట్టీలు కట్టి మోసపోతున్నారు. అలాగే మరికొంతమంది కిట్టీ పార్టీలు పెట్టుకొని ఆ డబ్బుతో బంగారం/ వెండి కొంటున్నారు. ఇంకొంతమంది నెల నెలా మిగులు డబ్బును పోపు డబ్బాలలో దాస్తున్నారు. దీని వలన ఆ డబ్బుకు వడ్డీ ఏమీ రావడం లేదు. ఇలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఒక చక్కటి మార్గం. మ్యూచువల్ ఫండ్స్ చిన్న మొత్తాలను సేకరించి వివిధ రకాల పెట్టుబడి (ఈక్విటీ, డెట్) మార్గాలలో పెట్టుబడి పెడతారు. వీటిని ఫండ్ మేనేజర్స్ పరిశీలిస్తూ ఉంటారు. వీటిలో ఎప్పుడు మీ దగ్గర డబ్బు మిగిలితే అప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు. లేదా నెల నెలా క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ-సిప్)లో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) ట్యాక్స్ బెనిఫిట్స్‌ని కూడా అందిస్తాయి.మీరు పెట్టుబడి పెట్టిన స్కీమ్ లాక్ ఇన్ పీరియడ్ లేదా ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ కాకపోతే మీ డబ్బును ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ఇప్పుడు చాలావరకు ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి.వీటిలో రాబడి అనేది మార్కెట్ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి పెడితే ఆ లక్ష్యాలను చేరుకోవచ్చు. మీ పిల్లల పైచదువులకు, పెళ్లిళ్లకు, రిటైర్మెంట్ తదితర అవసరాలకు. ఈ కింద తెలిపిన జాగ్రత్తలను తప్పక తీసుకోండిముందు చిన్న మొత్తంతో సిప్‌లో మొదలుపెట్టి ఆ తరువాత క్రమేణా మీ లక్ష్యానికి అనుగుణంగా పెంచుకుంటూ పోండి.{పతి నెలా క్రమం తప్పకుండా ఇది కూడా ఒక అత్యవసర ఖర్చు అనుకొని, సిప్‌లో జమ చేయండి. ఎన్ని సంవత్సరాలకు అనుకొని పెట్టుబడి మొదలుపెట్టారో అన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి. మీ లక్ష్యానికి అవసరమైనప్పుడు అవసరానికి తగినంత సొమ్మును మాత్రమే వెనక్కి తీసుకొని మిగిలిన సొమ్మును ఫండ్‌లోనే ఉంచండి. నెల నెలా ఒక 1000 రూపాయలు ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో సిప్ పద్ధతిలో పెట్టుబడి పెడితే రాబడి ఎలా ఉంటుందో ఈ పట్టికలో చూద్దాము. గడచిన 34 సంవత్సరాలలో ఈక్విటీలో పెట్టుబడిని గమనిస్తే వార్షికంగా 17 నుండి 18శాతం రాబడిని అందించాయి. నెలకు ఒక 1000 రూపాయలను సిప్‌లో పెట్టుబడి పెడితే 18 శాతం చొప్పున 30 సంవత్సరాలకు 1 కోటి 40 లక్షల సంపదను పొందుతూ ఉంటే అలాంటి చిన్న మొత్తాలను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేమా! మ్యూచువల్ ఫండ్స్ స్కీమును ఎంపిక చేసుకొనేటప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ, యాజమాన్యం, వారి పనితీరు, ఆ స్కీము గడచిన 5, 10, అంతకుమించిన కాలాలకు ఏ విధమైన రాబడులను అందించిందో అలాగే భవిష్యత్తు పనితీరును కూడా పరిగణనలోకి తీసుకొని మీ అవసరాలను బట్టి ఒక 2, 3 స్కీములలో పెట్టుబడిని కొనసాగించవచ్చు. అలాగే 6 నెలలకు, సంవత్సరానికి లేదా కాలానుగుణంగా మీ స్కీము పనితీరును గమనిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకొనవలసి ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు మీ ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేయడమే కాకుండా ఆ డబ్బును మ్యూచువల్ఫండ్స్లో ఒక క్రమ పద్ధతిలో సిప్‌లో పెట్టుబడి పెట్టి మీ దీర్ఘకాలిక లక్ష్యాలను నెరవేర్చుకోండి. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
అదుపే పొదుపు
ఉమన్ ఫైనాన్స్ మహిళలు తమ జీవితంలోని ఎన్నో దశలను విజయవంతంగా దాటుతూ కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. ఆ దశలన్నింటిలోనూ ‘మనీ మేనేజ్మెంట్’ ముఖ్యమైనది. కలలు, లక్ష్యాలు ప్రతి గృహిణికీ ఉంటాయి. అయితే కొంతమంది కలలు అలాగే మిగిలిపోతుంటాయి. దీనికి కారణం వారి వారి ఆర్థిక వనరులను సరిగా నిర్వహించకపోవడమే. ప్రతి మహిళా కుటుంబానికి వచ్చే ఆదాయ వ్యయాలను ఎప్పటికప్పుడు నిశితంగా ‘అవసరాలను’ గమనించుకుంటూ, ‘కోరికలను’ వాయిదా వేసుకుంటూనో లేదా తగ్గించుకుంటూనో ఉండాలి. తద్వారా అనవసరపు ఖర్చులను తగ్గిస్తూ ఆ మొత్తాలను పొదుపు-మదుపు కోసం కేటాయించవచ్చు. మన జీవన విధానంలో వాడే వస్తూత్పత్తులు, సేవల విషయంలో కొంత జాగ్రత్త, కొన్ని మెళకువలు పాటిస్తే మన వద్ద కొంత మిగులు ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబానికి అవసరమయ్యే వస్తువుల చిట్టాను ముందుగానే రాసుకోవాలి. దానికి అనుగుణంగా తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు ఎక్కడ దొరుకుతాయో అక్కడ వాటిని కొనుగోలు చేయాలి.ఇప్పటికే కుక్కర్, వాషింగ్‌మెషీన్, మిక్సీ ఇలాంటి వస్తువులను వాడుతుంటే అదనపు ఫీచర్స్ కోసం వాటిని అదే పనిగా మారుస్తూ కొత్తవి కొనడం వల్ల సౌకర్యం పెరిగినా, పొదుపు తగ్గిపోతుందనే విషయం గమనించాలి.ఇంటి భోజనానికి మించినది లేదు. కాని మనలో కొద్దిమంది కుటుంబమంతా కలిసి నెలలో ఎక్కువసార్లు హోటళ్లకు వెళుతుంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యం, పొదుపు ఇబ్బందిలో పడతాయి. అంతగా వాడని, ఎక్కువ కాలం నిరుపయోగంగా ఉండే వస్తువులను తొందరపడి కొనుగోలు చేయకపోవడం మంచిది. ఉదా: ఎక్కువ సామర్థ్యం గల ఇంటర్నెట్, సెల్‌ఫోన్ ఉండగా లాండ్‌లైన్, జిమ్‌కు వెళ్తూ కూడా ఇంట్లో వ్యాయామ పరికరాలు మొదలైనవి. వినోదం, విహారం.. ఉల్లాసాన్ని నింపేవే గాని ఎక్కువసార్లు వాటికి అదే పనిగా డబ్బులు కేటాయిస్తే ఆదాయానికి గండి తప్పదు. బ్లాక్‌లో టిక్కెట్స్ కొన్నా, ప్రయాణానికి తగిన విధంగా ముందుగా ప్లాన్ చేసుకోకున్నా అవి అధిక ధరలతో ఉంటాయి. నీరు, కరెంటు.. ఇలా ఎన్నో విషయాల్లో కొంతమంది చేసే దుబారా వల్ల వారు ఇబ్బంది పడుతుంటారు, కుటుంబాన్ని, ఇతరులను కూడా ఇబ్బంది పెడుతుంటారు. చిన్న చిన్న విషయాలే కదా అంటే.. చిల్లు చిన్నదైనా నీరు వృథా అవుతుంది కదా! అలాగే ఎంత సంపాదిస్తున్నా ఖర్చు అనే చిల్లు ద్వారా మన ఆదాయం వృథాగా పోతుంది. ఒకవైపు అవసరమైన ఖర్చులకు నగదు కేటాయిస్తూ మరోవైపు అనవసరమైన ఖర్చులను తగ్గిస్తూ ప్రతి నెల ఆదాయంలో కనీసం 20 నుండి 30 శాతం ‘పొదుపు-మదుపు’ ప్రక్రియకు మళ్లించగలిగితే మన ఆర్థిక లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చు. అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యలు, లేదా ఇతరత్రా ఖర్చులను అధిగమించాలంటే సరియైన భీమా పథకాలను తీసుకుంటూ, 3 నుండి 6 నెలల ఆదాయాన్ని అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. స్నేహితులను, బంధువులను చూసి భావోద్వేగాలను అదుపు చేసుకోలేక అదే పనిగా వస్తూత్పత్తులు, సేవలు, రుణాలు తీసుకుంటూ వెళితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మన కలలని సాకారం చేసుకోవడం కోసం మన ‘పొదుపు-మదుపు’లను ప్రణాళికాబద్ధంగా కొనసాగించడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందగలుగుతాము. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’