ఇంట్లో ఉన్నా పెన్షన్ వస్తుంది!
♦ ఉమన్ ఫైనాన్స్
జీవితం చాలా ఉందనో, పిల్లలు బాగోగులు చూస్తారనో, చనిపోయేవరకు పనిచేస్తూ ఉంటారనో, ఇప్పటికే ఆస్తులు ఉన్నాయనో... ఇలా ఎన్నో ఆలోచనలతో దేశ జనాభాలో సుమారుగా 85 శాతం మంది రిటైర్‌మెంట్ ప్లానింగ్‌ను అంతగా పట్టించుకోవడం లేదు. గృహిణుల విషయమైతే ఇక చెప్పేదేముందీ? అన్నిటికీ భర్త మీదే ఆధారపడతారు. అలా కాకుండా గృహిణులు కూడా తాము కూడబెట్టిన సొమ్ముతో పెన్షన్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవచ్చు.
అరవై సంవత్సరాలు నిండాక నెలవారీ జీతం / ఆదాయం ఎక్కువ మందికి ఉండదు. సంపాదించే వయస్సులోనే తగిన మొత్తాన్ని పొదుపు, మదుపు చేయడం ద్వారా రిటైర్‌మెంట్ తరువాత జీవితానికి అవసరమయ్యే ఖర్చులని అధిగమించవచ్చు. 50, 55 సంవత్సరాలు వచ్చాక రిటైర్‌మెంట్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తే అది అంత అనుకూలంగా ఉండకపోవచ్చు.
ప్రస్తుతం రిటైర్‌మెంట్ కోసం నిధిని సమకూర్చుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీసులు, స్థిరాస్తి, షేర్లు మొదలైన పలు రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం వారి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ (్కఊఖఈఅ) సంస్థచే ఈ ఎన్‌పీఎస్ నిర్వహించబడుతుంది. ఈ స్కీములో సేకరించిన మొత్తాన్ని పీఎఫ్‌ఆర్‌డీఏచే నియమితులైన ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్‌తో వివిధ రకాల పెట్టుబడి మార్గాలలో గవర్నమెంట్ సెక్యూరిటీక్ (ఎ), కార్పొరేట్ బాండ్స్ (ఇ), ఈక్విటీ షేర్స్ (ఉ)ను పీఎఫ్‌ఆర్‌డీఏ గైడ్‌లైన్స్ ఆధారంగా మదుపు చేయడం జరుగుతుంది. ఇందులో మదుపు చేయడానికి ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి.
18 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగినవాళ్లు పెట్టుబడి చేయడానికి అర్హులు.
పెట్టుబడి పెట్టిన సొమ్మును ఏ అసెట్ క్లాసులో మదుపు చేయాలో ఎంచుకొనే సదుపాయం కూడా ఉంది. ఎందులో పెట్టాలో అవగాహన లేనప్పుడు ఆటో చాయిస్ ఎంచుకోవచ్చు.
ఇందులో 2 రకాల ఖాతాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. అవి : టైర్ 1, టైర్ 2
టైర్ 1: ఇది రిటైర్‌మెంట్ నిధిని సమకూర్చుకోవడానికి ప్రత్యేకించినదిగా చెప్పుకోవచ్చు. ఈ ఖాతా నుండి 60 సంవత్సరాలలోపు డబ్బును తీసుకోవడం సులభతరం కాదు. ఒకవేళ అత్యవసరమైనప్పుడు తీసుకోవలసివచ్చినప్పుడు జమ చేసిన మొత్తంలో కేవలం 20 శాతం మొత్తాన్ని మాత్రమే ఇస్తారు. మిగతా 80 శాతంతో పెన్షన్ కోసం ఏదైనా యాన్యుటీని కొనుగోలు చేయవలసి ఉంటుంది.
60 సంవత్సరాల తరువాతనైతే 40 శాతం తప్పనిసరిగా యాన్యుటీ కొనుగోలు చేయాలి, మిగతా 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు లేదా అవసరం లేకపోతే మొత్తం 100 శాతంతో పెన్షన్‌కు యాన్యుటీ తీసుకోవచ్చు.
అలాగే 60 సంవత్సరాలలోపు ఖాతాదారుకి మరణం సంభవించినట్లయితే మొత్తం 100 శాతం సొమ్మును ఖాతాదారు నామినీకి/ లీగల్ హైర్స్‌కి అందజేస్తారు. ఈ ఖాతాను నెలకు 500 రూపాయల కనీస మొత్తంతో ప్రారంభించవచ్చు. సంవత్సరానికి కనీసం 6,000 రూపాయలను జమ చేయవలసి ఉంటుంది. గరిష్ట మొత్తం అనేది ఖాతాదారుని వెసులుబాటుని బట్టి ఉంటుంది.
టైర్-2: ఇది బ్యాంకు సేవింగ్ ఖాతా లా ఉంటుంది.
డబ్బును జమ చేయడం, ఉపసంహరించడం ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఇందులో మదుపు చేయడానికి టైర్-1 ఖాతా యాక్టివ్‌గా ఉండటం తప్పనిసరి. ఈ ఖాతాను 1,000 రూపాయల కనీస మొత్తంలో ప్రారంభించి, ఆ తరువాత 250 రూపాయల కనీస మొత్తంతో జమ చేసుకొనే వెసులుబాటు ఉంది. సంవత్సరానికి కనీసం 2,000 రూపాయల మొత్తాన్ని జమ చేయవలసి ఉంటుంది. టైర్-1 ఖాతాలో ఎవరైతే పెట్టుబడి పెడతారో వారు ఆ మొత్తాన్ని సెక్షన్ 80 ఇఇఈ (1ఆ) కింద గరిష్టంగా 50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇది సెక్షన్ 80ఇ కింద ఇచ్చే 1,50,000 రూపాయల మినహాయింపుకు అదనంగా ఉంటుంది.