కనిపించని బంగారం.. కురిపించును కనక వర్షం
ఉమన్ ఫైనాన్స్
ప్రస్త్తుతం పసిడిలో పెట్టుబడికి ప్రధానంగా రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 1. ఫిజికల్ గోల్డ్ : ఆభరణాలు, నాణేలు, కడ్డీలు. 2.పేపర్ గోల్డు : గోల్డ్ ఇ.టి.ఎఫ్. (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్), గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్.
1. ఫిజికల్ గోల్డ్
అవసరం ఉన్నంత మేరకు శుభకార్యాలకు పసిడి ఆభరణాల చేయించడం మంచిదే. అయితే ఫిజికల్ గోల్డ్‌తో వ్యవహరించేటప్పుడు ఈ కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. తరుగు, మజూరి ఖర్చులు రావు.ఏ షాపులోనైతే కొన్నారో అదే షాపులో అమ్మినప్పుడు మాత్రమే ఆభరణం ఉన్న బరువుకు సరిపడా బరువు బంగారం ఇస్తారు. వేరే షాపులో అయితే తగ్గిస్తారు. చాలావరకు షాపు యజమానులు బంగారు ఆభరణాలు అమ్మినా, మళ్లీ ఆభరణాలే ఇస్తారు. డబ్బులు ఇవ్వరు.
చాలామంది లాకర్లలో నగలు దాచి పెడతారు. కానీ వాటి విలువకు సరిపడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోరు. దీనివలన ఏదైనా దొంగతనం లేదా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు బ్యాంకువారు నామమాత్రపు ఇన్సూరెన్స్‌ను మాత్రమే అందజేస్తారు. మన బంగారం మార్కెట్‌లో స్వచ్ఛత, సర్టిఫికేషన్‌ల విషయంలో పూర్తిస్థాయిలో క్రమబద్దీకరించబడలేదు. కనుక చాలామంది మోసపోతూ ఉంటారు. బ్యాంకుల నుండి నాణేలు, కడ్డీలు కొనేటప్పుడు తిరిగి వాటిని బ్యాంకులు కొనవు. తిరిగి వాటిని షాపులవారి వద్దనే అమ్మాలి. ఇక్కడ కొంత నష్టపోవలసి ఉంటుంది.
2. పేపర్ గోల్డ్.. గోల్డ్ ఇ.టి.ఎఫ్
ఒక గోల్డ్ ఇ.టి.ఎఫ్ ఒక గ్రాము బంగారానికి సమానం. ఈ ఇ.టి.ఎఫ్.లలో గోల్డ్ కొనడానికి డీమాట్, ట్రేడింగ్ ఎకౌంట్ తప్పనిసరి. ఇ.టి.ఎఫ్.లు ఆన్‌లైన్‌లో ట్రేడ్ అవుతాయి కాబట్టి కొనుగోళ్లు అమ్మకాలు సులభం. బంగారం ధర పడినప్పుడల్లా క్రమబద్ధంగా ఇ.టి.ఎఫ్‌లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫిజికల్ బంగారంలో ఎదురయ్యే ఇబ్బందులు (లాకర్ ఛార్జీలు, తరుగు, క్వాలిటీ మొదలైనవి) ఇక్కడ ఉండవు. బంగారంపేపరు రూపంలో మాత్రమే ఉంటుంది. ఒకవేళ బంగారం కొనవలసి ఉంటే ఆన్‌లైన్‌లో అమ్మేసి బంగారం కొనవచ్చు.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్: గోల్డ్ ఇ.టి.ఎఫ్. వలే కాకుండా వీటిలో నెలనెలా 500 రూపాయల కనీస మొత్తంతో కూడా (సిప్ పద్ధతిలో) పెట్టుబడి పెట్టవచ్చు. నెలనెలా బంగారంలో పెట్టుబడి పెట్టేవారికి ఇది ఒక మంచి పద్ధతి. పెట్టుబడుల కేటాయింపులలో భాగంగా మీ మిగులు మొత్తాలలో 5 శాతం నుండి 10 శాతం వరకు బంగారంలో కేటాయింపులు జరుపవచ్చు. కేవలం పెట్టుబడి దృక్పథంతో బంగారం కొనుగోలు చేయాలనుకొనేవారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ బాండ్ స్కీం అనువైనదిగా చెప్పవచ్చు.