సంతోషం అనే వడ్డీ మిగలాలి
రూపాయి వ చ్చినా, పోయినా...
ఉమన్ ఫైనాన్స్
మన దేశానికి ఆర్థిక మంత్రి ఎలాగైతే ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను రూపొందించి, ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయ వనరులను వినియోగించి దేశ పురోగతికి తోడ్పడతారో... అదే విధంగా ప్రతి గృహిణీ, ఉద్యోగినీ తన వంతు బాధ్యతగా తమ కుటుంబ బడ్జెట్‌ను రూపొందించుకొని దాని ప్రకారం నడుచుకుంటే సంసారం అనే బండి ఏ ఒడిదుడుకులూ లేకుండా గమ్యాన్ని చేరుతుంది.
గమ్యం తెలియకుండా ప్రయాణాన్ని ఎవరూ మొదలు పెట్టరు. ఇదే సూత్రం కుటుంబ ఆర్థిక ప్రణాళిక అమలులోనూ కనిపిస్తుంది. ఆర్థికంగా మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నారు? అనే స్పష్టతను కలిగి ఉండాలి. ఈ స్పష్టతను బడ్జెట్ అందిస్తుంది.
బడ్జెట్ అంటే... మీకు ఏయే రూపాలలో ఆదాయం సమకూరుతుంది? మీకు ఉన్నటువంటి ఖర్చులు ఏంటి? అవి పోగా మిగులు / తగులు ఎంత? మిగులును ఏ విధంగా పెట్టుబడి పెట్టి మీ భవిష్యత్తు అవసరాలకు నిధులు సమకూర్చుకోవాలి? తగులును ఏ విధంగా అధిగమించాలి? ఇలాంటివన్నిటినీ నమోదు చేసి మీ కుటుంబానికి ఒక ప్రణాళిక ఏర్పరచుకోవడమే.
ముందుగా మీరు మీకు ఉన్నటువంటి ఆదాయ మార్గాలనన్నింటినీ (జీతం, అద్దె, వడ్డీ, వ్యాపారం, వ్యవసాయం మొదలైన వాటి నుంచి వచ్చే ఆదాయం) నమోదు చేయండి. ఈ ఆదాయం ఏయే నిర్ణీత సమయాలలో.. నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి.. వస్తుందో రాయండి. ఏయే ఖర్చులు ఏయే నిర్ణీత సమయాలలో ఉంటాయో పొందుపరచండి. ఉదా: నెలవారీ ఖర్చులైన అద్దె, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, పాలు, నిత్యావసర వస్తువులు మొదలైనవి; మూడు నెలలకు, ఆరు నెలలకు ఉండే పిల్లల స్కూలు ఫీజులు, సంవత్సర ఖర్చులైన ఇంటి పన్ను, ఇన్సూరెన్స్ ప్రీమియం తదితరాలు.
మీ ఖర్చులను గమనించి, వాటిలో ఏవి అత్యవసరమైనవి, ఏవి కావలసినవి, ఏవి లగ్జరీ ఖర్చులో విడివిడిగా రాయండి.ఇలా నమోదు చేయడం ద్వారా మీరు అనవసర ఖర్చులు ఎక్కడ పెడుతున్నారో మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్త వహించగలుగుతారు. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలైన పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంత ఇల్లు, రిటైర్‌మెంట్ సమయానికి కావలసిన ఆదాయం మొదలైన వాటికి నెలవారీగా / సంవత్సరానికీ ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎప్పటి నుండి మొదలు పెట్టాలి? ఎంత అవసరం అవొచ్చు అనే దాన్ని పరిగణనలోకి తీసుకోండి.అత్యవసర నిధిగా కనీసం మూడు నెలల ఖర్చుల మొత్తం మీ బ్యాంకు ఖాతాలో ఉండే విధంగా చూసుకోండి. మీరు బడ్జెట్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యులందరినీ భాగస్వాములను చేయండి. బడ్జెట్‌ని కుటుంబ సభ్యులందరికీ వివరించండి. బడ్జెట్‌ని ప్రిపేర్ చేయడం ఎంత ముఖ్యమో దానికి అనుగుణంగా నడుచుకోవడమూ అంతే ముఖ్యం.
ఇక క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా ఖర్చు చేయడం మనం చూస్తూ ఉంటాం. కనుక సాధ్యమైనంత వరకు క్యాష్‌ని / డెబిట్ కార్డుని వినియోగించడం మంచిది. లేదా క్రెడిట్ కార్డు వాడినా మీరు ఏ ఖర్చులనైతే బడ్జెట్‌లో పొందుపరుస్తారో వాటికి మాత్రమే వాడడం మంచిది. ఈ క్రెడిట్ కార్డుని కూడా బడ్జెట్‌కు అనుగుణంగా వాడితే ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పరిమితి దాటితే ఆ బిల్లులు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొవలసి ఉంటుంది. మీ వ్యక్తిత్వానికి, నష్ట భయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ దశలో ముందుగా ఆదాయ వ్యయాలను పర్యవేక్షించడానికి బడ్జెట్‌ను వేసుకోవాలి. ఖర్చులను తగ్గించుకుని పొదుపు పెంచుకోవడం, ఆ నిధుల మొత్తాన్ని వైవిధ్యభరితంగా దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి మహిళా తన, తన కుంటుంబ ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించగలదు.
రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’