కొంగుకు కాసే బంగారం
ఉమన్ ఫైనాన్స్
ఆడపిల్లల విద్యకు, వారి పెళ్లికి ఆర్థికంగా ఉపయోగపడాలనే ముఖ్య ఉద్దేశంతో ‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పొదుపు పథకం పోస్ట్ ఆఫీసులు, నిర్ణీత బ్యాంకు బ్రాంచీలలో అందుబాటులో ఉంటుంది.
ఈ ఖాతాను బిడ్డ పుట్టిన సమయం మొదలుకుని 10 ఏళ్ల వయసు వరకు ఆడపిల్ల పేరు మీద ప్రారంభించవచ్చు. ఒక పాప పేరు మీద ఒక ఖాతాని మాత్రమే తీసుకోవాలి. గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేర మీద రెండు ఖాతాలు కలిగి ఉండొచ్చు. ఒకవేళ రెండో కాన్పులో కవల ఆడ పిల్లలు లేదా మొదటి కాన్పులోనే ముగ్గురు ఆడపిల్లలు జన్మించినట్లయితే ముగ్గురి పేరు మీదా ఖాతాను ప్రారంభించవచ్చు.
పన్ను లేని పొదుపు
ప్రతి ఆర్థిక సంవత్సరానికి కనీసం రు.1000 తప్పనిసరిగా డిపాజిట్ చెయ్యాలి. గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు ప్రతి ఆర్థిక సంవత్సరం డిపాజిట్ చెయ్యవచ్చు. రు.100 మొదలుకొని (100 గణాంకాలుగా) ఎన్నిసార్లయినా డిపాజిట్ చేయవచ్చు. కనీస డిపాజిట్ మొత్తం ఏ సంవత్సరమైనా జమ చేయకపోతే ఖాతా కొనసాగదు. మళ్లీ ఖాతాను కొనసాగించాలంటే 50 రూపాయల అపరాధ రుసుము కనీస డిపాజిట్‌తో కలిపి చెల్లించాలి. ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తానికి చక్రవడ్డీని (ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి
2016-17 కి 8.6 శాతం) అందజేస్తారు. వడ్డీ రేటును ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయిస్తుంటుంది. డిపాజిట్ చేసిన మొత్తానికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ ఖాతా ద్వారా వచ్చే వడ్డీకి, మెచ్యూరిటీ మొత్తానికి కూడా పన్ను వర్తించదు.
వాపస్ తీసుకోవచ్చు
ఖాతా కాల పరిమితి ఖాతా ప్రారంభించినప్పటి నుండి 21 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఖాతా ప్రారంభించిన 14 సంవత్సరాల వరకు మాత్రమే డిపాజిట్ చేయవలసి ఉంటుంది. కాల పరిమితి ముగిసిన తర్వాత ఖాతాలో సమకూరిన సొమ్ము మొత్తాన్ని ఆ అమ్మాయికి అందచేస్తారు. ఆమెకు 18 సంవత్సరాల వయసు నిండిన తర్వాత ఖాతాలోని సొమ్ములో 50 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ 18 సం. వయసు నిండాక ఖాతా కాల పరిమితి ముగియక ముందే వివాహం జరిగినట్లయితే ఖాతాను క్లోజ్ చేసి మొత్తం సొమ్మును వాపస్ తీసుకోవచ్చు.
ఏ బాలిక పేరు మీదనైతే డిపాజిట్ చేశారో వారు మరణిస్తే ఖాతాలోని సొమ్మును గార్డియన్‌కు అందజేస్తారు. నామినీ సౌకర్యం ఈ ఖాతాకు లేదు. కాల పరిమితి ముగిసిన తర్వాత ఖాతాను క్లోజ్ చేయనట్లయితే అందులో ఉన్న సొమ్ముకు వడ్డీ వస్తుంది. అలాగే ఖాతాను ఒక శాఖ నుండి మరొక శాఖకు, అలాగే వేరొక బ్యాంకుకు కూడా బదలీ చేసుకునే సౌలభ్యం ఉంది. 10 సం. వయసు నిండిన బాలికలు సొంతంగా ఖాతాని నిర్వహించుకోవచ్చు. ఈ ఖాతాలో డబ్బు, చెక్కు, డిమాండ్ డ్రాఫ్టు రూపేణా డిపాజిట్ మొత్తాన్ని జమ చేయవచ్చు. ప్రస్తుతానికి ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ అందుబాటులో లేదు. ఈ ఖాతాలోని సొమ్ము మీద లోన్ తీసుకునే అవకాశం లేదు. చిన్న మొత్తంతో పొదుపు చేసుకుని తమ ఆడపిల్లల భవిష్యత్తుకు ఒక నిర్దిష్ట మొత్తాన్ని అందజేయాలనుకునే తల్లిదండ్రులందరికీ ఈ సుకన్య సమృద్థి యోజన పథకం ఒక చక్కటి పెట్టుబడి మార్గం.