
కామెంట్
అంతా నిన్ననే జరిగినట్లుంది. జ్ఞాపకం ఏమాత్రం మసకబారలేదు. ఫాదర్ టెర్రీని నేను మొదటిసారి కలిసి దాదాపు 45 ఏళ్ల య్యింది. అది 1982. వేసవి కాలం చివరి రోజులు. నిషా, నేను పెళ్లి చేసుకోబోతున్నాం. మా రెండు జీవితాలు ఒక్కటి కాబో తున్నాయి. తను క్యాథలిక్కు. అన్ని లాంఛ నాలతో చర్చిలో పెళ్లి జరగాలని ఆమె కోరిక.
నాకూ అభ్యంతరం లేదు. కాకుంటే చర్చి మతాధికారిని మూడుసార్లు కలిసి పెళ్లి ట్యూషన్ చెప్పించుకోడం ఒక్కటే నాకు నచ్చలేదు. అలా చేస్తేనే నిషాకు నాన్–క్రిష్టియన్ అయిన నాతో పెళ్లి జరుగుతుంది. ఈశాన్య ఇంగ్లాండ్‌లోని నార్తంబర్లాండ్ ఎవెన్యూలోని సెయింట్ మేరీ మాగ్దలీన్ చర్చి నిబంధన అలా ఉంది. కాబట్టి ఒప్పుకోక తప్పలేదు.
సెప్టెంబరు నెలలో ఒక శనివారం నేను, నిషా కలిసి ఫాదర్ టెర్రీ దగ్గరకు వెళ్లాం. అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం 6 గంటలు. ఆయన డెస్క్ వెనుక కూర్చుని ఉన్నారు. గది చివరన ఎదురుగా ఉన్న పాత లెదర్ సోఫా మీద మేం కూర్చున్నాం. ముక్కు మీదకు జారిన కళ్లజోడు పైనుంచి ఆయన మమ్మల్ని నిశితంగా గమనిస్తున్నారు. బయట వేడిగా ఉన్నా ఆ గదిలో వాతావరణం ఎందుకో బాగా చల్లగా ఉంది.
‘‘షెర్రీ తీసుకుంటారా?’’ ఫాదర్ చేసిన ఆఫర్ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘ మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు. నాకు మాత్రం షెర్రీ వైన్ చాలా ఇష్టం’’ అన్నాడాయన. ఆయన ఇచ్చిన టియో పెపే నా ఫేవరైట్ బ్రాండ్. ఫాదర్ టెర్రీకి ఎన్నో విషయాల్లో మంచి పరి జ్ఞానం ఉంది. వివేచనశీలి. కాసేపట్లోనే మేం బాగా దగ్గరయ్యాం. యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, సల్మాన్ రష్దీ ‘మిడ్‌నైట్స్ చిల్డ్రెన్’ నవల... మా మధ్య చర్చకు వచ్చాయి.
విశేష మేమిటంటే... మా పెళ్లి ఎలా జరగాలి, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతం స్వీకరించాల్సి ఉంటుంది వంటి అసలు విషయాలు మినహా అన్నీ చర్చించాం. ఫాదర్ టెర్రీ జారిపోతున్న కళ్ల జోడును వెనక్కు ఎగదోసుకుంటూ సంభాషణను చక్కగా ఎంజాయ్ చేశారు. గంట సేపు ఇట్టే గడచిపోయింది. వచ్చే వారం మళ్లీ కలవాలనుకున్నాం. ఇక మేము సెలవు తీసుకుని అలా తలుపు వద్దకు వెళ్లామో లేదో ఫాదర్ మమ్మల్ని ఆపేశారు.
‘మీరు విడివిడిగా ఎందుకు ఉంటున్నారు?’ అంటూ బాంబు లాంటి ఒక ప్రశ్న కూల్‌గా అడిగారు. అలా అడుగుతున్నప్పుడు, ఆయన గుండ్రటి ముఖం మీద చిరుదరహాసం మెరిసింది. దాంతో మా ముఖాలు లిప్తపాటు రక్తవిహీనం అయ్యాయి. నోట మాట రాలేదు. వాస్తవం ఏమిటంటే, మేం అప్పటికే సహజీవనం చేస్తున్నాం. కానీ ఆ విషయం దాచిపెట్టి, ఫాదర్ టెర్రీకి మేము వేరు వేరు చోట్ల ఉంటు న్నట్లు అడ్రస్‌లు ఇచ్చాం. ఆయన ఆ విషయం పసిగట్టారు. అయినా అదేమంత పెద్ద విషయం కాదులే అంటూ మమ్మల్ని ఆ ఇరకాటం నుంచి బయట పడేశారు. అలా ఉండేది ఆయన సరళి.
ఫాదర్ టెర్రీ మాకు త్వరలోనే ఆప్తమిత్రుడయ్యారు. మా పెళ్లికి రెండు రోజుల ముందు ఒక రిహార్సల్ జరిగింది. పెళ్లిలో భగవద్గీత నుంచి ఏవైనా రెండు మంచి మాటలు చదవాలని ఆ సందర్భంగా ఆయన సూచించారు. ఆ ఎంపిక బాధ్యత నా మీదే పెట్టారు. తీరా ఆ సమయం వచ్చేసరికి నేను చేతులెత్తేశాను. ‘మరేం ఫర్లేదులే, ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించి వేరొకటి రెడీగా పెట్టుకున్నా’ అంటూ నవ్వి మృదువుగా నా వీపు చరిచారు. ఆయన ఎంపిక చేసుకున్న పేరా ఖలీల్ జిబ్రాన్ ‘ప్రాఫెట్’ లోనిది.
పెళ్లి సందర్భంగా ఫాదర్ టెర్రీ చేసిన ఉపదేశం అందరినీ ఆకట్టుకుంది. నరకం, దేవుడు, దేవుడి మంచితనం... వంటి పెద్ద మాటలను పక్కన పెట్టారు. ఐ లవ్ యూ అనే ‘మూడే మూడు చిన్న మాటలు’ చెప్పారు.
‘నేను, నువ్వు అనే భేదాన్ని ప్రేమ చెరిపేస్తుంది... అలాగే అది ఆ రెంటినీ విడదీస్తుంది కూడా! కరణ్, నిషా... మీరు ఈ సత్యం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇద్దరు విభిన్న వ్యక్తులు అనే వాస్తవాన్ని మర్చి పోయిన రోజు ఆ బంధం కూడా వేర్పడిపోతుంది.’’
ఈ ప్రవచనం ఆర్భాటం లేకుండా ఇష్టాగోష్ఠిలా సాగింది. స్నేహ పూర్వకమైన ఆయన సందేశం మర్చిపోలేనిది. పాతికేళ్లుగా అది నా జ్ఞాపకాల్లో మసకబారకుండా నిలిచిపోయింది.
ఆరేళ్ల తర్వాత... నిషా తన ఆఖరు ఘడియల్లో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నప్పుడు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు మత కర్మలు నిర్వహించారు. అంతే కాకుండా, మా అమ్మను కూడా నిషా చెవిలో హిందూ పుణ్యవచనాలు వినిపించవల్సిందిగా కోరారు. చివరకు నిషా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్న క్షణాల్లో కూడా ఫాదర్ టెర్రీ నా పక్కనే ఉన్నారు.
నాకు తెలిసిన ఒకే ఒక క్రైస్తవ మతాచార్యుడు టెర్రీ గిల్ఫెడర్! ఆయన అసాధారణమైన గొప్ప వ్యక్తి. క్రైస్తవుల మీద, ముస్లిముల మీద దాడులు జరిగాయన్న వార్తలు చదివిన ప్రతిసారీ నేను ఆయనను తలచుకుంటాను. గాయపడిన హృదయాలకు సాంత్వన చేకూర్చేందుకు ఫాదర్ టెర్రీ వద్ద ఎప్పుడూ కొన్ని మాటల దివ్యౌ షధాలు ఉండి తీరుతాయి. ఆయన ఆఫర్ చేసే షెర్రీ వారికి ఉపక రిస్తుంది.
ఫాదర్ టెర్రీలు ప్రతి మతంలోనూ ఉంటారు. దైవమే పరమావధిగా భావించేవారు సాటి మానవులను ప్రేమపూర్వకంగా అర్థం చేసుకోగలరు. మనకు అలాంటి వారి అవసరం నేడు
ఎంతగానో ఉంది. అయినా వారెవరూ ఎందుకు నోరు మెదపడం లేదు?
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment