తెలుసుకుని తీసుకోండి పాలసీ | Finance Woman | Sakshi
Sakshi News home page

తెలుసుకుని తీసుకోండి పాలసీ

Published Tue, Mar 8 2016 10:46 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

తెలుసుకుని తీసుకోండి పాలసీ

తెలుసుకుని తీసుకోండి పాలసీ

ఉమన్ ఫైనాన్స్ / హెల్త్
 
చాలామంది తమ పిల్లల పైచదువులు, పెళ్లిళ్లు, సొంత ఇల్లు వంటి వాటికి తమ తాహతుకు తగ్గట్టుగా పొదుపు చేస్తూ ఉంటారు. అలాగే అనుకోని సంఘటన జరిగి కుటుంబ పెద్ద మరణిస్తే తమ పిల్లల భవిష్యత్తు అవసరాలకు చేదోడువాదోడుగా ఉండటానికి జీవిత బీమా పాలసీలకు ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు. కానీ ఆరోగ్య బీమాని అంతగా పట్టించుకోరు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు.. కూడబెట్టిన సొమ్ము మొత్తం వైద్యానికి ఖర్చుపెట్టవలసి వస్తుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారౌతుంది. కనుక తప్పనిసరిగా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలి.

వ్యక్తిగత పాలసీలు: ఇవి ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉండే పాలసీలు. ప్రీమియం అనేది ఆ వ్యక్తి వయస్సు, అలవాట్లు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
 
ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు
: ఇవి కుటుంబం మొత్తానికి కలిపి ఒకే పాలసీగా ఉంటాయి. వ్యక్తిగత పాలసీలతో పోలిస్తే ఇందులో ప్రీమియం తక్కువగా ఉంటుంది.
 
బీమా పాలసీ - అవగాహన
సబ్ లిమిట్స్ : కొన్ని ఇన్యూరెన్స్ కంపెనీలు పాలసీలను పేషెంట్ రూము అద్దె, ఐ.సి.యు. చార్జీలు, అలాగే కొన్ని రకాల వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చులకు పాలసీని సబ్ లిమిట్స్‌తో అందజేస్తాయి. ఉదాహరణకు మీరు 3 లక్షల ఆరోగ్య బీమా పాలసీని రూమ్ అద్దెకు 1 శాతం సబ్ లిమిట్ ఉన్నది తీసుకున్నట్లయితే, మీకు 3,000 రూపాయలు మాత్రమే రూమ్ అద్దెను చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని మీరు భరించవలసి ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు సబ్ లిమిట్స్ లేని పాలసీని ఎంచుకోవడం మంచిది.
 ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు : మీరు తీసుకునే పాలసీ ఎన్ని రోజుల ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులకు కవరేజీని అందజేస్తోందో గమనించండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ రోజులు అందించే వాటిని ఎంచుకోండి. చాలావరకు కంపెనీలు 60 రోజుల ప్రీ హాస్పిటలైజేషన్, 90 రోజుల పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజీని అందజేస్తున్నాయి, కొన్ని మాత్రమే 30, 60 రోజుల కవరేజీని ఇస్తున్నాయి.
 క్లైమ్ సెటిల్‌మెంట్: క్లైమ్ సెటిల్‌మెంట్‌ను రెండు విధాలుగా పొందవచ్చు. మొదటిది పాలసీ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో ప్రీ ఆథరైజ్డ్ పొందిన క్యాష్ లెస్ పద్ధతిలో వైద్యం పొందడం. ఈ పద్ధతిలో పాలసీదారుడు ఎటువంటి సొమ్మునూ ఖర్చుపెట్టనవసరం లేదు. రెండవది రీ-ఇంబర్స్‌మెంట్ పద్ధతి. పాలసీదారుని సొంత డబ్బుతో వైద్యం పొంది, ఆ తరువాత ఆ వైద్యానికి సంబంధించిన ఖర్చుల బిల్లులను, మిగతా డాక్యుమెంట్‌లను ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసి, రీ-ఇంబర్స్‌మెంట్ పొందొచ్చు.

నో క్లైమ్ బోనస్: చాలా వరకు ఇన్యూరెన్స్ కంపెనీలు పాలసీ సమయంలో క్లైమ్ లేకపోతే బోనస్‌ను అందచేస్తున్నాయి. ఈ బోనస్‌ను రెన్యూ ప్రీమియంలో డిస్కౌంట్, ఇన్సూరెన్స్ మొత్తాన్ని పెంచడం, ఫ్రీ హెల్త్ చెకప్ రూపేణా చెల్లిస్తున్నాయి.
 
వయో పరిమితి: పాలసీ తీసుకునేటప్పుడు గమనించదగ్గ అతి ముఖ్యమైన విషయం.. పాలసీ ప్రారంభించడానికి, రెన్యూ చేయడానికి ఉండవలసిన కనిష్ట, గరిష్ట వయో పరిమితులు. రెన్యూ చేయడానికి ఉండే గరిష్ట వయో పరిమితి వరకు మాత్రమే కవరేజీని అందజేస్తారు. ఆ తర్వాత రెన్యూ చేయరు. కొన్ని పాలసీలు జీవితకాలం వరకు రెన్యూ చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. కనుక జీవిత కాల రెన్యూ పాలసీలను ఎంచుకోవడం మంచిది.
 
ప్రీమియం లోడింగ్ ఆఫ్టర్ క్లైమ్
: కొన్ని పాలసీలు ఒకవేళ పాలసీ కాలంలో క్లైమ్ ఉన్నట్లయితే తర్వాత సంవత్సరానికి రెన్యూ చేసేటప్పుడు ప్రీమియమ్‌కు కొంత మొత్తాన్ని అదనంగా కలుపుతున్నాయి. కనుక పాలసీ తీసుకునేటప్పుడు దీని గురించి కూడా క్షణ్ణంగా పరిశీలించండి.

ఆరోగ్య బీమా పాలసీకి కట్టే ప్రీమియమ్‌ను ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80డి కింద 25,000 రూపాయల వరకు తమ కుటుంబానికి (భార్య/భర్త, పిల్లలు), తల్లిదండ్రులకు (సీనియర్ సిటిజన్) ప్రీమియం చెల్లిస్తే 30,000 రూపాయలకు అదనంగా పన్ను మినహాయింపును పొందవచ్చు.
 రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement