దేశంలో ఏటా.. లక్షల సర్జికల్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసులు | There are lakhs of surgical infection cases in country every year | Sakshi
Sakshi News home page

దేశంలో ఏటా.. లక్షల సర్జికల్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసులు

Published Thu, Feb 20 2025 5:49 AM | Last Updated on Thu, Feb 20 2025 5:49 AM

There are lakhs of surgical infection cases in country every year

5.2 శాతంగా సర్జికల్‌ సైట్‌ ఇన్‌ఫెక్షన్‌ రేట్‌

ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడి  

సాక్షి, అమరావతి: దేశంలో అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్స చేయించుకున్న బాధితులు ఇన్‌ఫెక్షన్‌లతో సతమతమవుతున్నారు. ఏటా దాదాపు 15 లక్షల మంది సర్జికల్‌ సైట్‌ ఇన్‌ఫెక్షన్‌ (ఎస్‌ఎస్‌ఐ) బారినపడుతున్నారు. వీరిలో 54 శాతానికి పైగా ఆర్థోపెడిక్‌ శస్త్ర చికిత్సల బాధితులు ఉంటున్నారు. ఈ అంశం ఇటీవల ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అధ్యయనంలో వెల్లడైంది. 

భారత్‌లో ఎస్‌ఎస్‌ రేటు 5.2 శాతంగా ఉంది. అధిక ఆదాయ దేశాల కంటే ఇంది చాలా ఎక్కువ అని తెలి పింది. ఢిల్లీ ఎయిమ్స్, మణిపాల్‌లోని కస్తూర్బా, ముంబైలోని టాటామెమోరియల్‌ ఆస్పత్రుల్లో 3,090 మంది రోగులపై ఐసీఎంఆర్‌ అధ్యయనం చేపట్టింది. 161 మంది రోగుల్లో శస్త్ర చికిత్సల అనంతరం ఎస్‌ఎస్‌ఐ అభివృద్ధి చెందినట్టు గుర్తించింది. ముఖ్యంగా రెండు గంటల కంటే ఎక్కువ సమయం నిర్వహించే సర్జరీలు ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదాన్ని పెంచుతున్నట్టు కనుగొన్నారు.  

పెరుగుతున్న వ్యయప్రయాసలు
రోగులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక వారి ఆరోగ్య పరిస్థితిపై సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతోనే ఎస్‌ఎస్‌ఐ సమస్య తీవ్రతరంగా ఉంటోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉందని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శస్త్ర చికిత్సల అనంతరం ఇన్‌ఫెక్షన్‌ కారణంగా రోగులు కోలుకునే సమయంతో పాటు, చికిత్సకు అయ్యే ఖర్చులు వంటి వ్యయప్రయాసలు పెరుగుతున్నాయి. 

అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో, శస్త్రచికిత్స చేయించుకునే రోగుల్లో 11శాతం మంది ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో సైతం వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆర్థో, గైనిక్, ఇతర సర్జరీల అనంతరం రోగులు ఇన్‌ఫెక్షన్‌ల బారినపడుతున్న ఘటనలు ఉంటున్నాయి.  

లాప్రో, రోబోటిక్‌ సర్జరీలతో తక్కువ ఇన్‌ఫెక్షన్‌లు 
ఆస్పత్రుల్లో సరైన స్టెరిలైజేషన్‌ లేకపోవడం, రోగుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండటం శస్త్ర చికిత్సల అనంతరం ఇన్‌ఫెక్షన్‌లకు ప్రధాన కారణం. శస్త్ర చికిత్సలకు ముందే సమగ్రంగా ప్రీ–ఆపరేటివ్‌ ఎవాల్యుయేషన్‌ చేపట్టాలి. గుండె వాల్వ్, జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీల్లో శరీరంలో స్టీల్‌ మెటల్స్‌ అమరుస్తుంటారు. ఈ కారణంగా ఇన్‌ఫెక్షన్‌లకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 

ఇలాంటి సర్జరీల్లో ఒక శాతం ఇన్‌ఫెక్షన్‌ రేటు ఉన్నా ప్రమాదమే. ప్రస్తుతం ల్యాప్రోస్కొపీ, రోబోటిక్స్‌ వంటి అత్యాధునిక సర్జరీలు పద్ధతులు అందుబాటులో ఉంటు న్నాయి. ఈ విధానాల్లో శస్త్ర చికిత్సల్లో కచి్చతత్వంతో పాటు, ఇన్‌ఫెక్షన్‌లు సోకడానికి అవకాశం చాలా తక్కువ. సంప్రదాయ సర్జరీల్లో పెద్ద కోతలు ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదాన్ని పెంచుతాయి. 

విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్‌ వినియోగించకూడదు. ప్రస్తుతం వైద్యుల సంప్రదింపులు లేకుండానే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలకు ప్రజలు యాంటిబయోటిక్స్‌ వాడేస్తున్నారు. ఇది మంచిది కాదు.        – డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, రొబోటిక్‌ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement