Females
-
రాష్రంలో మహిళలే ఎక్కువ
దేశంలో అత్యధిక మహిళలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళలు 1,030 మంది ఉన్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ స్త్రీ, పురుష నిష్పత్తిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను చూస్తే 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల సంఖ్యే ఎక్కువ. – సాక్షి, అమరావతి దేశంలో పట్టణాలు ,గ్రామాల్లో పరిస్థితి ఇది దేశంలో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 941 మంది స్త్రీలు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 947 మంది స్త్రీలు ఏపీలో పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,030 మంది స్త్రీలు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,017 మంది స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,035 మంది స్త్రీలు -
కరోనా వైరస్: ఆ విషయంలో మహిళలే బెటర్
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ను నివారించేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. కాగా వైరస్‌ను తట్టుకునేందుకు రోగనిరోధకశక్తి చాలా కీలకమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పురుషుల కన్న మహిళలకే రోగనిరోధకశక్తి ఎక్కువని, అందువల్ల కరోనాను మహిళలు సులభంగా జయిస్తున్నారని యేల్ యూనివర్సిటీకి(యూఎస్ఎ) చెందిన నేచర్ జర్నల్ నివేదికలో తెలిపింది. కాగా కరోనాను ఎదుర్కొనే టీసెల్స్ మహిళలకు ఎక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొంది. అయితే మానవుల్లో టీసెల్స్ సమృద్ధిగా ఉంటే క్రిమికారక వైరస్‌లను సులభంగా ఎదుర్కొంటాయి. అయితే పురుషుల్లో టీసెల్స్ నామమంత్రంగా పనిచేస్తున్నట్లు నివేదిక తెలిపింది. కాగా 98 మంది కరోనా బాధితులను పరీక్షించి నివేదికను రూపోందించారు. మరోవైపు రోగనిరోధక శక్తికి బలం చేకూర్చే సైటోకైన్స్ వ్యవస్థ మహిళల్లో అత్యద్భుతంగా పనిచేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. చదవండి: ఈ టెక్నిక్‌తో కరోనా వైరస్‌కు చెక్! -
ల్యాప్‌టాప్
‘నేను మగ’ అని హెల్ప్ చెయ్యకపోవడం కాదు. ‘ఆమె ఆడ’ అని హెల్ప్ చెయ్యడం కాదు. ఇంట్లో పనిని మగవాళ్లు పని అనుకోవడం, అనుకోకపోవడాన్ని బట్టే.. ఇంట్లో ఆడవాళ్లకు సహాయం అందడం, అందకపోవడం ఉంటుంది! కెవ్వుమంది ఆమె! ‘ఏంటీ?!’ అని పైకి లేచాడతను. ‘బ..బ.. బల్లి’ అంది. ‘ఎక్కడ?’. ‘బాత్రూమ్’లో. చిరాకుపడ్డాడు. బల్లికి భయపడ్డం ఏంటి! నేరుగా బాత్రూమ్లోకి వెళ్లాడు. కిటికీలో బల్లి ఇంకా అక్కడే ఉంది. అతడి వెనుక నుంచి ఆమె ఇంకా భయంగానే బల్లివైపు చూస్తోంది. ‘మీవారిని తీసుకొచ్చావా?’ అని ఆ బల్లి తననే చూస్తున్నట్లు అనిపించింది ఆమెకు. బల్లి దగ్గరకు వెళ్లాడు అతను. అదిలించాడు. కదిలించాడు. ఎగిరి కిందపడింది. మళ్లీ కెవ్వుమంది ఆమె. ఆమె చేతిలోని చీపురును తను తీసుకుని బల్లిని తరిమేశాడు.కయ్యిమన్నాడు అతడు! ‘ఏంటీ!’ అని పరుగెత్తుకొచ్చింది ఆమె. ‘బూజు’ అన్నాడు. ‘ఎక్కడ?’ అంది. ‘అదేమిటి?’ అన్నాడు. తలెత్తి చూసింది. గదికి పైన ఓ మూల ఉంది. బూజుకర్ర తెచ్చింది. ‘నిన్ను పంపించారా మీవారు, తను చెయ్యనని’ అని ఆ బూజు తనను అడిగినట్లుగా ఆమెకేమీ అనిపించలేదు. తనకు అందకపోతే కదా భర్తనే వెళ్లమనడం. కర్రను రెండు చుట్లు చుట్టి శుభ్రం చేసి వెళ్లిందామె. ఈలోపు, నోటికి తీసుకోబోతూ పక్కన పెట్టేసిన టీ కొంచెం చల్లారిపోయింది. నష్టమేం లేదు. మళ్లీ వేడి చేసుకుంటుంది. తాగబోతుండగా మళ్లీ కయ్యిమని పిలుపొచ్చినా మళ్లీ టీని అక్కడ పెట్టేసి వెళుతుంది. ఆమెకు మూమూలే.. రోజుకి రెండు మూడు ‘కయ్’లన్నా వినడం. ఆమెకు కోపం రాదు. ఆమె కెవ్వుమన్నందుకు అతడికి చిరాగ్గా అనిపించవచ్చు కానీ, అతను కయ్మన్నందుకు ఆమెకు కోపం రాదు! బల్లినంటే ఆమె తరమలేకపోయింది కానీ, బూజును అతడు తుడిచేయొచ్చు. బూజేమీ బల్లిలా ఒళ్లు తిప్పుకుంటూ వెళ్లదు. కళ్లు మిటకరిస్తూ చూడదు. తోకను కదల్చదు. అదో టైపులో కటకటమని అరవదు. ఇవన్నీ కాదు, బల్లి అంటే ఆమెకు ఉన్నట్లుగా, బూజు అంటే అతడికి భయం లేదు. మరి తనే బూజుకర్ర తీసుకొచ్చి ఆమె చుట్టినట్లు రెండు చుట్లు చుట్టి బూజును తీసేయొచ్చు కదా! తీసేయొచ్చు కానీ, ఆమేం పుట్టింట్లో లేదు కదా.. వచ్చేందుకు టైమ్ పడుతుంది, ఈలోపు బూజు ఎగిరొచ్చి తన నెత్తి మీదో, భుజం మీదో పడుతుంది.. అనుకుని బూజుకర్ర అందుకోవడానికి!తప్పేం లేదు. సరిగ్గానే ఉన్నాడతడు. ఇల్లు దులపడం ఆడ పని, మగ పని అని అనుకునేంత దూరంగా కూడా ఏమీ వెళ్లిపోలేదు. తను పనిలో ఉన్నట్లుగానే, తనలా ఇంట్లో ఉన్న మరో మనిషి కూడా ఏదో పనిలో ఉంటుందన్న ఆలోచనైతే రావాలి. రాలేదు. బూజు కనిపించింది.. కయ్యిమన్నాడు. అది కూడా కాదు. బూజు దులపడాన్ని అసలతడు పనే అనుకోలేదు. దాన్ని పని అనుకుని ఉంటే, లోపల మనిషి చేస్తున్నదీ పనే అనుకునేవాడు. పనిలో ఉన్న మనిషిని పిలిచి మళ్లీ ఒక పని చెప్పేవాడు కాదు. లేచి తనే చేసేవాడు. లేదంటే, ఆమె తన పని పూర్తి చేసుకుని అటుగా వచ్చినప్పుడు.. పని గురించి వినే తీరికలో, వినే ఓపికలో ఆమె ఉందా అని గమనించి చెప్పేవాడు. ఆ చెప్పడం కూడా.. ‘ఓ సెలవు రోజు ఇద్దరం కలిసి ఇంటిని శుభ్రం చేయాలి’ అని సీలింగ్ వైపు చూస్తూ చెప్పేవాడు. ఆ తర్వాత ఆమెకు కుదిరినప్పుడు ఆమె, అతడికి కుదిరితే అతడు, ఇద్దరికీ కుదిరితే ఇద్దరూ కలిసి చేసుకునేవాళ్లు. ఇంటి పనుల్లో మగవాళ్లు హెల్ప్ చెయ్యకపోవడానికి కనిపించే సాధారణ కారణం.. ‘ఎవరి పని వారు’ చెయ్యాలనే ఒక ఆలోచన వారిలో ఇన్‌బిల్ట్‌గా ఉండిపోవడం అనుకుంటాం. ఆలోచన కాదు, ‘అనాలోచన’ ఇన్‌బిల్ట్‌గా ఉండిపోవడం అసలు కారణం. టమాటాలు తరగడం పనిలా కనిపించనప్పుడు.. టమాటాలు తరిగే మనిషి కూడా పని చేస్తున్నట్లుగా కనిపించదు. పని చేస్తున్నట్లు కనిపించనప్పుడు పనిగట్టుకుని వెళ్లి హెల్ప్ చేయడం ఏమంటుందనే ఆ అనాలోచన.. సెన్సిటివిటీ లేకపోవడమే కానీ, జెండర్ సెన్సిటివిటీ లేకపోవడం కాదు. ఇంటపనుల్లో చక్కగా హెల్ప్ చేస్తుండే మగవాళ్లు కూడా.. ‘అయ్యో పాపం.. ఆడ మనిషి’ అని హెల్ప్ చెయ్యడం కాదు. స్త్రీ పురుష సమానత్వం అనుకుని టమాటాల్ని, కత్తిపీటను ఆమె నుంచి లాక్కోవడం కాదు. హెల్ప్ చెయ్యాలని అనిపించడం కాదు. హెల్ప్ చేస్తున్నామని అనుకోవడమూ కాదు. ఎదురుగా ఒక మనిషికి ఏకకాలంలో రెండు మూడు పనులున్నాయి కనుక సాటి మనిషిగా వాటిల్లో ఒక పనిని చేతికి అందుకోవడం. అది కూడా సెన్సిటివిటీ తప్ప జెండర్ సెన్సిటివిటీ కాదు. ఇంట్లో పనిని మగవాళ్లు పని అనుకోవడం, అనుకోకపోవడాన్ని బట్టే ఇంట్లో ఆడవాళ్లకు సహాయం అందడం, అందకపోవడం తప్ప.. ఇది మగ పని, ఇది ఆడ పని అని జనరల్‌గా అక్కడ పురాతత్వ పని విభజన నియమాలేవీ అప్లయ్ అవ్వవు. కొందరికి పేస్ట్ అందించాలి. బ్రష్ అందించాలి. బ్రష్‌లో పేస్ట్ వేసి కూడా అందించాలి. తమ పళ్లు, తమ పని అనుకోరు. మీరు తినడానికే మేము పళ్లు తోముకుంటున్నాం అన్నట్లుంటారు. ఇలాంటి వాళ్లను సెన్సిటైజ్ చెయ్యడానికి తప్ప, మహిళలూ పెద్దగా ఉద్యమాలేం చెయ్యరు కూడా. ‘ఇల్లు క్లీన్ చెయ్యడం ఆడవాళ్ల పని, ల్యాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని కూర్చోవడం మగవాళ్ల పని అనుకోకండి. మనుషులకు తప్ప, పనులకు జెండర్ లేదు’ అని చెప్పడానికి మాత్రమే వాళ్ల ప్రయత్నమంతా. మొన్న చూడండి. వాలంటైన్స్ డేకి హాంకాంగ్, లండన్లలో హెచ్.ఎస్.బి.సి. సిబ్బందికి ఓ పెద్ద కంపెనీ బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ చార్ట్‌లో ‘ఫర్ హిమ్’ సెక్షన్ కింద ల్యాప్‌టాప్ కంప్యూటర్లు, గోప్రో కెమెరాలు, వైర్లెస్ హెడ్ఫోన్లు ఉన్నాయి. ‘ఫర్ హర్’ సెక్షన్ కింద వ్యాక్యూమ్ క్లీనర్లు, ఆహార పదార్థాల్ని కలియదిప్పే బ్లెండర్లు, కిచెన్ వాటర్ ట్యాప్‌లు ఉన్నాయి! ఈ లైంగిక వివక్ష ఉమెన్ స్టాఫ్‌కి ఆగ్రహం తెప్పించింది. ఆఫీస్‌ల నుంచి వాకవుట్ చేశారు. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ అనిపిస్తుంది. ఇంట్లో మగాళ్లు హెల్ప్ చెయ్యకపోవడం అనాలోచన వల్ల కాదేమో, ఆడా మగా అనే ఆలోచన వల్లనేనేమో అని! ఒక్క యుగంలో లోకం ఏమీ మారిపోదేమో. యుగాలుగా లోకం మగాళ్లదే కనుక. బల్లిని చూసి ఆమె భయపడినప్పుడు అతడు వెళ్లి తరిమేశాడు. కొన్నిసార్లు ఇంటి పని కూడా బల్లిలా ఆమెను భయపెడుతుంది. అప్పుడు బల్లిని తరమాల్సింది బల్లి అంటే భయం లేనివాళ్లే. అతడెళ్లి పని అందుకోవాలి. చిన్న పనులు కూడా ఒక్కోసారి ఆమెకు చేయలేని పనులవుతాయి. ఆ గమనింపు ఉంటే చాలు. పని చేయకున్నా పని అందుకున్నట్లే. మరి బూజు? బూజు అయినా, ల్యాప్‌టాప్ అయినా.. మేడమ్ వచ్చి తుడిస్తేనే నేను క్లీన్ అవుతానని, సారొచ్చి ఒడిలో పెట్టుకుంటేనే నేను ఆన్ అవుతాయని అంటాయా?! - మాధవ్ శింగరాజు -
సినిమాసుర వధ
నరకమ్మా.. నరుకు! సినిమా మాస్ భాషలో నరకాసుర వధకు బ్యాగ్రౌండ్లో వినిపించే కేక.. ‘నరకమ్మా.. నరుకు’!! విషయానికి ఎమోషన్ మిక్స్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడానికి సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ బాగా పని చేస్తుంది. ఇప్పుడు ధ్వనిస్తున్న ‘మీ టూ’ స్వరాలూ సత్యభామ సంధించిన బాణాలే, సినిమాల్లోని అసురలను వధించిన ఈ ఐదుగురివీ సమర గుణాలే. కాలానికి ఒక నరకుడు ఉంటాడు. సంహరించడానికి సరిపడా పాపాలు చేస్తూ ఉంటాడు. స్త్రీలు, సత్యభామలు అతడి అంతు చూస్తూ ఉంటారు. నిలువరిస్తూ ఉంటారు. బాణంతో కొట్టి నేలన పడేస్తూ ఉంటారు. నరకుడు మరింత శక్తిమంతుడై తిరిగి జన్మిస్తూ ఉంటాడు. సవాలు విసురుతుంటాడు. అలసిపోవడానికి లేదు. ఆగిపోవడానికి లేదు. పోరాటం చేస్తూ ఉండాల్సిందే. పొగరు అణుస్తూ ఉండాల్సిందే. గుండెల్లో బాణం దించి సంహరిస్తూ ఉండాల్సిందే. ఇవాళ ‘మీటూ’ ఉద్యమం వల్ల ఎంతమంది నరకులు ఉన్నారో తెలుస్తూ ఉంది. వారిని బట్టబయలు చేసిన సత్యభామలు కూడా కనిపిస్తూ ఉన్నారు. సమాజం నుంచి వారికి సమర్థింపు లభిస్తూ ఉంది. కాని సినిమాల్లో పాత్రలే పోరాటం అంతా చేయాల్సి ఉంటుంది. తమ నిరసనను తెలియచేయాల్సి ఉంటుంది. చెడు ఏ రూపంలో ఉన్నా మొదటి అభ్యంతరం స్త్రీల నుంచే రావాలి. అలా ఎదురు తిరిగి తెర మీద చెరిగిపోకుండా నిలబడిన స్త్రీ పాత్రలు చాలానే ఉన్నాయి. తాకితే కత్తి తాకుతుంది మాహిష్మతి రాజ్యంలో కుట్రలు మొదలయ్యాయి. బాహుబలి బదులు భల్లాల దేవుడు శిరస్సు మీదకు కిరీటం అందిపుచ్చుకున్నాడు. తైనాతీ గాళ్లంతా అధికారం ఉన్నవాళ్లు అయ్యారు. అలాంటి సమయంలో బాహుబలి భార్య దేవసేన అమ్మవారి దర్శనానికి గుడి మెట్లు ఎక్కుతుంటే దుర్మార్గుడు ఒకడు ఆమెను అవాంఛిత పద్ధతిలో తాకడానికి చూస్తాడు. స్త్రీ శరీరాన్ని తాకడం మగాడిలోని నరకాసుర లక్షణం. మౌనంగా భరిస్తే ఆ లక్షణం చెలరేగుతుంది. దానిని ఎక్కడికక్కడ ఖండించాలి. అందుకే దేవసేన మెరుపులా కదిలింది. మొలలోని బాకు తీసి రెప్పపాటులో అతడి వేళ్లు ఖండించింది. తనను తాకితే కత్తి తాకుతుందని హెచ్చరించింది. ఆ కాలంలో కత్తి. ఈ కాలంలో చట్టం. దేని సహాయమైనా తీసుకుని నరకాసుర వధ చేయాల్సిందే. ‘బాహుబలి’లో దేవసేన ఏ క్షణమూ ఓటమిని అంగీకరించలేదు. తనను బందీని చేసి, సంకెలలు బగించి, ఏ రాజ్యాన్నయితే పట్టమహిషిలా ఏలాల్సి ఉందో ఆ రాజ్యంలోనే బిచ్చగత్తెగా మార్చిన భల్లాల దేవుడి సంహారం కోసం ఓపికగా ఎదురు చూసింది. అతడి చితి కోసం చితుకులు ఏరింది. కుమారుడి సహాయంతో అతడి తొడలు విరిగేలా చేసి చితిలో కూలేలా చేసి నిప్పుతో అతడిని దహనం చేసింది. భల్లాల దేవుడి మరణంతో మాహిష్మితికి నిజమైన దీపావళి వచ్చింది. ఆ దివ్వెల మధ్య ఓ పెను దివ్వె దేవసేన. నిండుబొట్టు రెడ్డెమ్మ నల్లగుడిలో బసిరెడ్డి నలుపెక్కిన నరరూప రాక్షసుడు. ఆధిపత్యం కోసం ఫ్యాక్షన్ నడపడం వేరు. కాని హంతక రాజకీయాలతో ఫ్యాక్షన్‌ను నిలబెట్టుకోవాలని అనుకోవడం లేదు. ఏళ్లక్రితం బసిరెడ్డి ఊరి మర్రిచెట్టు కింద పేకాట ఆడి ఐదు రూపాయలు బాకీ పడి దానిని అడిగినందుకు కత్తి పట్టి అప్పటి నుంచి మానవరక్తం పారిస్తూనే ఉన్నాడు. ప్రత్యర్థుల రక్తం కోరితే ఒక అర్థం ఉంది. కాని తన ఉనికి కోసం ఒక దశలో సొంత కొడుకును కూడా చంపడానికి అతడు తెగించాడు. నరకాసురుడు కూడా సిగ్గుపడేలా ఉన్న ఈ నరకాసురుణ్ణి చూసి అతడి భార్య రెడ్డమ్మ అసహ్యించుకుంది. శపించింది. తిట్లతో ఈసడించుకుంది. ఏ భార్యా భర్త మరణం కోరదు. కాని సమాజహితం కోసం ఊరి శాంతి కోసం ఈ రెడ్డమ్మ భర్త చావు కోరుకుంది. ప్రత్యర్థి శిబిరానికి చెందిన వీర రాఘవరెడ్డి తన భర్తను ఊరి పొలిమేరల్లో చంపి, దుబ్బులో పడేసి, ఆనవాలు లేకుండా తగులబెట్టి ఆ విషయం దాచకుండా నేరుగా వచ్చి రెడ్డమ్మకే చెప్పాడు. క్షమాపణ కోరాడు. వీర రాఘవ రెడ్డే తన భర్తను చంపాడని ఊళ్లో తెలిస్తే మళ్లీ రక్తపాతం మొదలవుతుంది. అందుకే రెడ్డమ్మ ఏ స్త్రీ చేయని సాహసం చేసింది. అమ్మవారి ఎదుట నుంచి కుంకుమ అందుకుని నుదుటిన దిద్దుకుని నా కొడుకును చంపి భర్త పారిపోయాడని ఊరితో చెబుతుంది. ఎంతో స్థిరత్వంతో, స్థితప్రజ్ఞతతో, భర్త పట్ల హింస పట్ల విముఖతతో ఆమె కథను శాంతింప చేస్తుంది. ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో రెడ్డమ్మ పాత్ర కత్తి పట్టకనే చెడును నిర్మూలించిన సత్యభామ పాత్ర. యూ టర్న్‌లో ఉగ్రశక్తి సివిక్ సెన్స్ లేకపోవడానికి మించిన నరకాసుర గుణం మరొకటి లేదు. దారి పక్కన మూత్రం పోయడం, హార్న్ పెద్దగా మోగించడం, వీధుల్ని ఆక్రమించి ఫంక్షన్లు చేయడం, అర్ధరాత్రి లౌడ్ స్పీకర్లు మోగించడం... వీటితో ప్రాణాపాయం లేదు. కాని రోడ్ సేఫ్టీ విషయంలో సివిక్ సెన్స్ పాటించకపోతే ప్రాణాలకు ప్రమాదం. ఆ ఊళ్లో ఒక ఫ్లయ్ ఓవర్ ఉంది. దానిని ఎక్కాక యూ టర్న్ తీసుకోవాలంటే చాలాదూరం వెళ్లి రావాలి. దానికి బద్దకించినవారు మధ్యలోనే డివైడర్ రాళ్లను తొలగించి యూ టర్న్ కొడుతుంటారు. తొలగించిన రాళ్లను సరిగ్గా పెడితే ప్రమాదం ఉండదు. కాని వాటిని రొడ్డు మీద అడ్డదిడ్డంగా పడేస్తే ఎంత ప్రమాదం. ఆ తల్లీ కూతురు ఆ రోజు బర్త్‌డే పార్టీ ముగించుకుని స్కూటీ మీద వస్తున్నారు. రాత్రి పూట. లైట్లు సరిగ్గా లేవు. కాని అప్పటికే ఎవరో యూ టర్న్ కోసం రాళ్లు తొలగించి రోడ్డు మీదపడేసున్నారు. ఆ తల్లి చూసుకోలేదు. స్కూటీ రాయిని ఢీకొట్టింది. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. పాప ఎగిరి ఫ్లయ్‌ఓవర్ నుంచి కింద రైలు పట్టాల మీదపడి ప్రాణం విడిచింది. ఏం తప్పు చేశారని వాళ్లకు ఈ మరణం. ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిని శిక్షించాల్సిందే. సంహరించాల్సిందే. అందుకే ‘యూ టర్న్’ సినిమాలో భూమిక ఉగ్రశక్తి రూపం దాల్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రతి ఒక్కరి అంతు చూసింది. ప్రవర్తన సరి చేయడం కూడా దీపం వెలిగించడం వంటిదే. మూర్ఖత్వాన్ని శుభ్రపరిచి ప్రేమించిన అతని ప్రాంతం వేరు. తమ ప్రాంతం వేరు. వారి భాష వేరు. తన భాష వేరు. అయినా సరే ప్రేమించింది కాబట్టి అర్జున్ రెడ్డితోనే తన జీవితం అనుకుంది. కాని తండ్రి ఎంతో మూర్ఖత్వానికి వెళ్లాడు. కుదరదన్నాడు. అర్జున్ రెడ్డి అంతకంటే ఎక్కువ మూర్ఖత్వానికి వెళ్లాడు. తిరగబడ్డాడు. ఇద్దరు మూర్ఖులు కలిసి స్త్రీ మనసును అతలాకుతలం చేశారు. ఆమె నిర్ణయం అడగలేదు. తీసుకోనివ్వలేదు. అతను మత్తుమందు తీసుకుని రెండు రోజులు స్పృహలో లేకపోయేసరికి తండ్రి అదే అదనుగా ఆమె పెళ్లి చేసేశాడు. ఆమె ఎక్స్ప్లనేషన్ వినకనే, ఆ తర్వాత ఆమె ఏమైందని తెలుసుకోకనే అర్జున్ రెడ్డి అరాచక జీవితంలోకి ప్రతీకారంగా ప్రవేశించాడు. తనను తాను హింసించుకున్నాడు. అయినవాళ్లని హింసించాడు. అతడు తన మూర్ఖత్వాన్ని శుభ్రపరుచుకుని తనను తాను తెలుసుకునేవరకు ఆమె ఓపిక పట్టింది. ఆయుధం మాత్రమే ఆయుధం కాదు. సహనం కూడా గొప్ప ఆయుధమే. ఆ ఆయుధం వల్లే ఆమె తండ్రిని మార్చుకోగలిగింది. ప్రియుడిని మార్చుకోగలిగింది. అంతేకాదు.. కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా కాపాడుకోగలిగింది. అర్జున్ రెడ్డి కథ పైకి హీరో కథ. కాని అది నిజానికి హీరోయిన్ కథ. మగ మూర్ఖత్వాలను జయించిన ఒక స్త్రీ కథ. మగవారు తమ బండతనాన్ని వదలుకుని సున్నితంగా మారడం కూడా దీపావళే కదా. హైనా నుదుటిన బులెట్ మనుషుల శ్రమను దోచుకునే నరకాసులు కొందరుంటారు. కాని మనుషుల దేహాన్ని దోచుకుని తినే నరకాసులు వారి కంటే నీచులు. స్త్రీలను వేశ్యలుగా మార్చి వారి మీద పడి బతికేవారికి మించిన చీకటి మనుషులు మరొకరు ఉండరు. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఉండాల్సిన స్త్రీ కుక్కల్లాంటి మగాళ్ల కింద నలుగుతూ ఉంటే వీళ్లు ఆరాంగా అన్నం తింటారు. తీరుబడిగా మద్యం తాగుతారు. ఇలాంటి వాళ్లు ఈ నరక కూపం నుంచి బయటపడాలనుకున్నవారిని కూడా వదలరు. జ్యోతిలక్ష్మి ఇలాంటి నరకకూపం నుంచి బయటపడాలనుకుంది. తాను వేశ్య అని తెలిసినా పెళ్లి చేసుకుందామనుకున్న వ్యక్తితో కొత్త జీవితం మొదలెట్టాలనుకుంది. కాని ఒక నరకాసురుడు అందుకు ఒప్పుకోలేదు. ఆమెను పదేపదే వృత్తిలోకి ఈడ్చాడు. పడక మీదకు పరిమితం చేయాలని చూశాడు. స్త్రీ, పురుషుడు ఒకేరకమైన తప్పు చేస్తే శిక్ష స్త్రీకీ సుఖం పురుషుడికా? అందుకే జ్యోతిలక్ష్మి ఊళ్లో పెద్ద మనుషుల ముఖంతో తిరుగుతున్న విటుల అసలు గుట్టును బయట పడేసింది. అంతేనా ఆడపిల్లలను పట్టుకొచ్చి హీనమైన వ్యాపారం చేస్తున్న ఆ హైనా మీద బుల్లెట్ దించింది. వేశ్యాగృహాలను తగులబెట్టి చేసుకునే దీపావళే కదా అసలైన దీపావళి. ఇంకా ఎందరో స్త్రీలు ఉన్నారు. స్క్రీన్ మీద చెడుకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. పోరాటాలు విజయవంతమయ్యే కొద్దీ దీపాల కాంతి పెరుగుతుంది. వాటి వెలుగుకు ఉన్న శక్తి పెరుగుతుంది. ఆ కాంతి విస్తరణా పెరుగుతుంది. స్త్రీలు వెలిగించే స్త్రీలను వెలిగించే చైతన్యవంతమైన దీపావళికి స్వాగతం. న్యాయం కావాలి నుంచి ప్రతిఘటన వరకు గత సినిమాలలో చెడుపై పోరాడిన సత్యభామలు ఎందరో ఉన్నారు. పెళ్లికి ముందు శారీరకంగా లోబరుచుకుని ఆ తర్వాత పెళ్లికి నిరాకరిస్తే అతడి మీద కేసు పెట్టి న్యాయస్థానానికి ఈడ్చి శిక్ష పడేలా చేసిన పాత్ర ‘న్యాయం కావాలి’ సినిమాలో రాధిక చేసింది. నగరంలో రౌడీయిజం పెరిగిపోతే, రౌడీలు రాజకీయ నాయకులుగా మారి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తుంటే బాధ్యత కలిగిన పౌరురాలిగా గండ్రగొడ్డలితో ఆ దుర్మార్గుణ్ణి నరికిన పాత్రను విజయశాంతి ‘ప్రతిఘటన’లో చేసింది. అంతే కాదు నేరం చేసిన మగవాళ్లు, పోలీసుల్లో ఉన్న మగవాళ్లు ఏకమై ఒక దారుణ రేప్ కేసును దారి మళ్లిస్తుంటే బాధితురాలి వైపు నిలబడి నేరం చేసినవాడు పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా వదలకుండా పెను పోరాటం చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రను ‘కర్తవ్యం’లో కూడా ఆమే చేసింది. పెళ్లి చేసుకుని బిడ్డ పుట్టాక వదిలేస్తే ఆ బిడ్డను ఒడిలో పెట్టుకుని భర్త ఇంటి ముందు మౌనపోరాటం చేసి ఇలాంటి దుర్మార్గాన్ని లోకం దృష్టికి తీసుకువచ్చిన గిరిజన యువతి పాత్రను ‘మౌనపోరాటం’ సినిమాలో యమున చేసింది. నాట్యం చేస్తున్నప్పుడు ప్రేమించి, ప్రమాదవశాత్తు కాలు పోగానే విడిచిపెట్టిన మగాడిని తన ఆత్మబలం, కృత్రిమ కాలుడో నాట్యకారిణి అయి శిక్షించిన ధీర పాత్రను సుధ ‘మయూరి’లో చేసింది. కోడలి మీదే కన్నేసిన మామను కత్తితో కండలుగా నరికిన అత్తగా ‘ఆమె’ సినిమాలో సుధ చేసింది. పెళ్లి చేసుకున్న కోడలికి శాడిజంతో అనుక్షణం నరకం చూపిస్తున్న కొడుక్కు స్వయంగా విషం ఇచ్చే తల్లి పాత్రను ‘తాళి’ సినిమాలో సుజాత చేసింది. తన జమిందారీని ఆయుధంగా చేసుకుని స్త్రీల మానప్రాణాలు హరిస్తున్న దుర్మార్గుణ్ణి చంపి జేజమ్మగా జేజేలు అందుకున్న పాత్రను అనుష్క ‘అరుంధతి’లో చేసింది. -
కన్నుగప్పకుండానే.. పన్ను తప్పించుకోవచ్చు!
ఉమన్ ఫైనాన్స్ స్త్రీలకు పసుపు కుంకుమల కింద పుట్టింటివారు ఇచ్చే స్థిరాస్తులు, బంగారు ఆభరణాలను ఒక్కోసారి కుటుంబ అవసరాల కోసం విక్రయించవలసి రావచ్చు. అలా విక్రయించగా వచ్చిన డబ్బులో సింహ భాగాన్ని చాలామంది లాభం కోసం దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెడుతుంటారు. అయితే ఆదాయపన్ను యాక్ట్ 1961 సెక్షన్ 54 ఇ.సి. ప్రకారం, ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడుల మీద వచ్చిన లాభానికి పన్ను కట్టవలసి ఉంటుంది. అలా పన్ను భారం పడకూడదు అనుకుంటే, ఆ వచ్చిన లాభాన్ని దీర్ఘకాలిక కాపిటల్ గైన్ టాక్స్‌ఫ్రీ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపన్ను చట్టం ప్రకారం ఏదైనా స్థిరాస్తిని (ఇల్లు, భూమి, స్థలం మొదలైనవి) కనీసం 3 సంవత్సరాలు అమ్మకుండా లేదా ట్రాన్స్ఫర్ చేయకుండా ఉన్నట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణిస్తారు. ప్రస్తుతం దీర్ఘకాలిక పెట్టుబడుల లాభానికి 20 శాతం పన్ను భారం వర్తిస్తుంది. ఈ పన్ను భారం మినహాయింపుకు మన దేశంలో ప్రస్తుతం ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్), ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) వారు జారీ చేసే కాపిటల్ గైన్ టాక్స్‌ఫ్రీ బాండ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు... * ఒక్కొక్క బాండ్ విలువ 10,000 రూపాయలుగా ఉంటుంది. * ఎన్హెచ్ఏఐ అయితే కనీసం 1 బాండ్, ఆర్ఈసీ అయితే కనీసం 2 బాండ్స్ నుంచి మొదలుకొని గరిష్టంగా 500 బాండ్స్ (రూ.50,00,000) వరకు పెట్టుబడి పెట్టవచ్చు. * వీటిలో పెట్టిన మొత్తానికి సంవత్సరానికి 6 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. * 3 సంవత్సరాల తరువాత పెట్టిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు. * ఈ బాండ్స్‌ను తనఖా పెట్టడానికి గానీ, ట్రాన్స్ఫర్ చేయడానికి గానీ, అమ్మడానికి గానీ లేదా లోన్ తీసుకోవడానికి గానీ వీలుకాదు. * వీటిలో పెట్టిన దీర్ఘకాలిక పెట్టుబడుల లాభం మీద దీర్ఘకాలిక పన్ను మినహాయింపు వర్తిస్తుంది. స్వల్పకాలిక పెట్టుబడుల లాభం మీద పన్ను మినహాయింపు వర్తించదు. * అయితే ఈ బాండ్స్ మీద వచ్చే వడ్డీకి పన్ను కట్టవలసి ఉంటుంది. * ఈ బాండ్స్‌ను ఫిజికల్‌గాను, డీమాట్ పద్ధతిలో కూడా కొనుగోలు చేయవచ్చు. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
స్త్రీలకూ వయాగ్రా!
ఎఫ్‌డీఏ ఆమోదం వాషింగ్టన్: కామోద్దీపన ఔషధం వయాగ్రా ఇకపై స్త్రీలకూ అందుబాటులోకి రానుంది. రుతుచక్రం ఆగిపోయే దశకు చేరువైన స్త్రీలలో లైంగిక కోరికలు తగ్గిపోయే సమస్యకు చికిత్స చేసేందుకు గాను తొలిసారిగా ఓ ఔషధానికి ఆమోదం లభించింది. ‘ఫిమేల్ వయాగ్రా’గా పిలుస్తున్న ఈ మందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) మంగళవారం ఆమోదం తెలిపింది. అయితే, ఈ మందు వినియోగం వల్ల రక్తపోటు పడిపోవడం, మూర్ఛపోవడం వంటి తీవ్రమైన దుష్ర్పభావాలు కలిగే అవకాశాలుంటాయని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. ‘యాడ్‌యీ(ఫ్లిబాన్సెరిన్ ఔషధం)’ పేరుతో తయారుచేసిన ఈ మందును రుతుచక్రం ఆగిపోయే దశకు ముందు ఉన్న స్త్రీలలో ‘హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్(హెచ్ఎస్డీడీ)’ సమస్యకు చికిత్స చేసేందుకుగాను ఎఫ్‌డీఏ అనుమతించింది. అయితే, ఇంతవరకూ స్త్రీలలో లేదా పురుషుల్లో లైంగిక కోరికలకు సంబంధించి ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన చికిత్సలేవీ లేవని ఎఫ్‌డీఏకు చెందిన ఔషధ పరిశోధన కేంద్రం డెరైక్టర్ వుడ్‌కాక్ వెల్లడించారు. లైంగిక కోరికలు తగ్గే సమస్యతో బాధపడుతున్న స్త్రీలకు తొలిసారిగా యాడ్‌యీ మందుతో చికిత్సకు వీలవుతుందని తెలిపారు. అతిగా మద్యం సేవించడం, మానసిక సమస్యలు, ఇతర కారణాల వల్ల వచ్చే హెచ్ఎస్డీడీకి ఈ మందుతో చికిత్స చేయొచ్చన్నారు. అయితే, దీనితో చికిత్సకు ముందు దుష్ర్పభావాల గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నారు.