నరకమ్మా.. నరుకు! సినిమా మాస్ భాషలో నరకాసుర వధకు బ్యాగ్రౌండ్‌లో వినిపించే కేక.. ‘నరకమ్మా.. నరుకు’!! విషయానికి ఎమోషన్ మిక్స్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడానికి సినిమాటిక్ ఎక్స్‌ప్రెషన్ బాగా పని చేస్తుంది. ఇప్పుడు ధ్వనిస్తున్న ‘మీ టూ’ స్వరాలూ సత్యభామ సంధించిన బాణాలే, సినిమాల్లోని అసురలను వధించిన ఈ ఐదుగురివీ సమర గుణాలే.
కాలానికి ఒక నరకుడు ఉంటాడు. సంహరించడానికి సరిపడా పాపాలు చేస్తూ ఉంటాడు. స్త్రీలు, సత్యభామలు అతడి అంతు చూస్తూ ఉంటారు. నిలువరిస్తూ ఉంటారు. బాణంతో కొట్టి నేలన పడేస్తూ ఉంటారు. నరకుడు మరింత శక్తిమంతుడై తిరిగి జన్మిస్తూ ఉంటాడు. సవాలు విసురుతుంటాడు. అలసిపోవడానికి లేదు. ఆగిపోవడానికి లేదు. పోరాటం చేస్తూ ఉండాల్సిందే. పొగరు అణుస్తూ ఉండాల్సిందే.
గుండెల్లో బాణం దించి సంహరిస్తూ ఉండాల్సిందే. ఇవాళ ‘మీటూ’ ఉద్యమం వల్ల ఎంతమంది నరకులు ఉన్నారో తెలుస్తూ ఉంది. వారిని బట్టబయలు చేసిన సత్యభామలు కూడా కనిపిస్తూ ఉన్నారు. సమాజం నుంచి వారికి సమర్థింపు లభిస్తూ ఉంది. కాని సినిమాల్లో పాత్రలే పోరాటం అంతా చేయాల్సి ఉంటుంది. తమ నిరసనను తెలియచేయాల్సి ఉంటుంది. చెడు ఏ రూపంలో ఉన్నా మొదటి అభ్యంతరం స్త్రీల నుంచే రావాలి. అలా ఎదురు తిరిగి తెర మీద చెరిగిపోకుండా నిలబడిన స్త్రీ పాత్రలు చాలానే ఉన్నాయి.
తాకితే కత్తి తాకుతుంది
మాహిష్మతి రాజ్యంలో కుట్రలు మొదలయ్యాయి. బాహుబలి బదులు భల్లాల దేవుడు శిరస్సు మీదకు కిరీటం అందిపుచ్చుకున్నాడు. తైనాతీ గాళ్లంతా అధికారం ఉన్నవాళ్లు అయ్యారు. అలాంటి సమయంలో బాహుబలి భార్య దేవసేన అమ్మవారి దర్శనానికి గుడి మెట్లు ఎక్కుతుంటే దుర్మార్గుడు ఒకడు ఆమెను అవాంఛిత పద్ధతిలో తాకడానికి చూస్తాడు. స్త్రీ శరీరాన్ని తాకడం మగాడిలోని నరకాసుర లక్షణం.
మౌనంగా భరిస్తే ఆ లక్షణం చెలరేగుతుంది. దానిని ఎక్కడికక్కడ ఖండించాలి. అందుకే దేవసేన మెరుపులా కదిలింది. మొలలోని బాకు తీసి రెప్పపాటులో అతడి వేళ్లు ఖండించింది. తనను తాకితే కత్తి తాకుతుందని హెచ్చరించింది. ఆ కాలంలో కత్తి. ఈ కాలంలో చట్టం. దేని సహాయమైనా తీసుకుని నరకాసుర వధ చేయాల్సిందే. ‘బాహుబలి’లో దేవసేన ఏ క్షణమూ ఓటమిని అంగీకరించలేదు.
తనను బందీని చేసి, సంకెలలు బగించి, ఏ రాజ్యాన్నయితే పట్టమహిషిలా ఏలాల్సి ఉందో ఆ రాజ్యంలోనే బిచ్చగత్తెగా మార్చిన భల్లాల దేవుడి సంహారం కోసం ఓపికగా ఎదురు చూసింది. అతడి చితి కోసం చితుకులు ఏరింది. కుమారుడి సహాయంతో అతడి తొడలు విరిగేలా చేసి చితిలో కూలేలా చేసి నిప్పుతో అతడిని దహనం చేసింది. భల్లాల దేవుడి మరణంతో మాహిష్మితికి నిజమైన దీపావళి వచ్చింది. ఆ దివ్వెల మధ్య ఓ పెను దివ్వె దేవసేన.
నిండుబొట్టు రెడ్డెమ్మ
నల్లగుడిలో బసిరెడ్డి నలుపెక్కిన నరరూప రాక్షసుడు. ఆధిపత్యం కోసం ఫ్యాక్షన్ నడపడం వేరు. కాని హంతక రాజకీయాలతో ఫ్యాక్షన్‌ను నిలబెట్టుకోవాలని అనుకోవడం లేదు. ఏళ్లక్రితం బసిరెడ్డి ఊరి మర్రిచెట్టు కింద పేకాట ఆడి ఐదు రూపాయలు బాకీ పడి దానిని అడిగినందుకు కత్తి పట్టి అప్పటి నుంచి మానవరక్తం పారిస్తూనే ఉన్నాడు. ప్రత్యర్థుల రక్తం కోరితే ఒక అర్థం ఉంది. కాని తన ఉనికి కోసం ఒక దశలో సొంత కొడుకును కూడా చంపడానికి అతడు తెగించాడు.
నరకాసురుడు కూడా సిగ్గుపడేలా ఉన్న ఈ నరకాసురుణ్ణి చూసి అతడి భార్య రెడ్డమ్మ అసహ్యించుకుంది. శపించింది. తిట్లతో ఈసడించుకుంది. ఏ భార్యా భర్త మరణం కోరదు. కాని సమాజహితం కోసం ఊరి శాంతి కోసం ఈ రెడ్డమ్మ భర్త చావు కోరుకుంది. ప్రత్యర్థి శిబిరానికి చెందిన వీర రాఘవరెడ్డి తన భర్తను ఊరి పొలిమేరల్లో చంపి, దుబ్బులో పడేసి, ఆనవాలు లేకుండా తగులబెట్టి ఆ విషయం దాచకుండా నేరుగా వచ్చి రెడ్డమ్మకే చెప్పాడు. క్షమాపణ కోరాడు.
వీర రాఘవ రెడ్డే తన భర్తను చంపాడని ఊళ్లో తెలిస్తే మళ్లీ రక్తపాతం మొదలవుతుంది. అందుకే రెడ్డమ్మ ఏ స్త్రీ చేయని సాహసం చేసింది. అమ్మవారి ఎదుట నుంచి కుంకుమ అందుకుని నుదుటిన దిద్దుకుని నా కొడుకును చంపి భర్త పారిపోయాడని ఊరితో చెబుతుంది. ఎంతో స్థిరత్వంతో, స్థితప్రజ్ఞతతో, భర్త పట్ల హింస పట్ల విముఖతతో ఆమె కథను శాంతింప చేస్తుంది. ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో రెడ్డమ్మ పాత్ర కత్తి పట్టకనే చెడును నిర్మూలించిన సత్యభామ పాత్ర.
యూ టర్న్‌లో ఉగ్రశక్తి
సివిక్ సెన్స్ లేకపోవడానికి మించిన నరకాసుర గుణం మరొకటి లేదు. దారి పక్కన మూత్రం పోయడం, హార్న్ పెద్దగా మోగించడం, వీధుల్ని ఆక్రమించి ఫంక్షన్లు చేయడం, అర్ధరాత్రి లౌడ్ స్పీకర్లు మోగించడం... వీటితో ప్రాణాపాయం లేదు. కాని రోడ్ సేఫ్టీ విషయంలో సివిక్ సెన్స్ పాటించకపోతే ప్రాణాలకు ప్రమాదం. ఆ ఊళ్లో ఒక ఫ్లయ్ ఓవర్ ఉంది. దానిని ఎక్కాక యూ టర్న్ తీసుకోవాలంటే చాలాదూరం వెళ్లి రావాలి. దానికి బద్దకించినవారు మధ్యలోనే డివైడర్ రాళ్లను తొలగించి యూ టర్న్ కొడుతుంటారు.
తొలగించిన రాళ్లను సరిగ్గా పెడితే ప్రమాదం ఉండదు. కాని వాటిని రొడ్డు మీద అడ్డదిడ్డంగా పడేస్తే ఎంత ప్రమాదం. ఆ తల్లీ కూతురు ఆ రోజు బర్త్‌డే పార్టీ ముగించుకుని స్కూటీ మీద వస్తున్నారు. రాత్రి పూట. లైట్లు సరిగ్గా లేవు. కాని అప్పటికే ఎవరో యూ టర్న్ కోసం రాళ్లు తొలగించి రోడ్డు మీదపడేసున్నారు. ఆ తల్లి చూసుకోలేదు. స్కూటీ రాయిని ఢీకొట్టింది. ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
పాప ఎగిరి ఫ్లయ్‌ఓవర్ నుంచి కింద రైలు పట్టాల మీదపడి ప్రాణం విడిచింది. ఏం తప్పు చేశారని వాళ్లకు ఈ మరణం. ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిని శిక్షించాల్సిందే. సంహరించాల్సిందే. అందుకే ‘యూ టర్న్’ సినిమాలో భూమిక ఉగ్రశక్తి రూపం దాల్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రతి ఒక్కరి అంతు చూసింది. ప్రవర్తన సరి చేయడం కూడా దీపం వెలిగించడం వంటిదే.
మూర్ఖత్వాన్ని శుభ్రపరిచి
ప్రేమించిన అతని ప్రాంతం వేరు. తమ ప్రాంతం వేరు. వారి భాష వేరు. తన భాష వేరు. అయినా సరే ప్రేమించింది కాబట్టి అర్జున్ రెడ్డితోనే తన జీవితం అనుకుంది. కాని తండ్రి ఎంతో మూర్ఖత్వానికి వెళ్లాడు. కుదరదన్నాడు. అర్జున్ రెడ్డి అంతకంటే ఎక్కువ మూర్ఖత్వానికి వెళ్లాడు. తిరగబడ్డాడు. ఇద్దరు మూర్ఖులు కలిసి స్త్రీ మనసును అతలాకుతలం చేశారు. ఆమె నిర్ణయం అడగలేదు. తీసుకోనివ్వలేదు.
అతను మత్తుమందు తీసుకుని రెండు రోజులు స్పృహలో లేకపోయేసరికి తండ్రి అదే అదనుగా ఆమె పెళ్లి చేసేశాడు. ఆమె ఎక్స్‌ప్లనేషన్ వినకనే, ఆ తర్వాత ఆమె ఏమైందని తెలుసుకోకనే అర్జున్ రెడ్డి అరాచక జీవితంలోకి ప్రతీకారంగా ప్రవేశించాడు. తనను తాను హింసించుకున్నాడు. అయినవాళ్లని హింసించాడు. అతడు తన మూర్ఖత్వాన్ని శుభ్రపరుచుకుని తనను తాను తెలుసుకునేవరకు ఆమె ఓపిక పట్టింది.
ఆయుధం మాత్రమే ఆయుధం కాదు. సహనం కూడా గొప్ప ఆయుధమే. ఆ ఆయుధం వల్లే ఆమె తండ్రిని మార్చుకోగలిగింది. ప్రియుడిని మార్చుకోగలిగింది. అంతేకాదు.. కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా కాపాడుకోగలిగింది. అర్జున్ రెడ్డి కథ పైకి హీరో కథ. కాని అది నిజానికి హీరోయిన్ కథ. మగ మూర్ఖత్వాలను జయించిన ఒక స్త్రీ కథ. మగవారు తమ బండతనాన్ని వదలుకుని సున్నితంగా మారడం కూడా దీపావళే కదా.
హైనా నుదుటిన బులెట్
మనుషుల శ్రమను దోచుకునే నరకాసులు కొందరుంటారు. కాని మనుషుల దేహాన్ని దోచుకుని తినే నరకాసులు వారి కంటే నీచులు. స్త్రీలను వేశ్యలుగా మార్చి వారి మీద పడి బతికేవారికి మించిన చీకటి మనుషులు మరొకరు ఉండరు. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఉండాల్సిన స్త్రీ కుక్కల్లాంటి మగాళ్ల కింద నలుగుతూ ఉంటే వీళ్లు ఆరాంగా అన్నం తింటారు. తీరుబడిగా మద్యం తాగుతారు.
ఇలాంటి వాళ్లు ఈ నరక కూపం నుంచి బయటపడాలనుకున్నవారిని కూడా వదలరు. జ్యోతిలక్ష్మి ఇలాంటి నరకకూపం నుంచి బయటపడాలనుకుంది. తాను వేశ్య అని తెలిసినా పెళ్లి చేసుకుందామనుకున్న వ్యక్తితో కొత్త జీవితం మొదలెట్టాలనుకుంది. కాని ఒక నరకాసురుడు అందుకు ఒప్పుకోలేదు. ఆమెను పదేపదే వృత్తిలోకి ఈడ్చాడు. పడక మీదకు పరిమితం చేయాలని చూశాడు.
స్త్రీ, పురుషుడు ఒకేరకమైన తప్పు చేస్తే శిక్ష స్త్రీకీ సుఖం పురుషుడికా? అందుకే జ్యోతిలక్ష్మి ఊళ్లో పెద్ద మనుషుల ముఖంతో తిరుగుతున్న విటుల అసలు గుట్టును బయట పడేసింది. అంతేనా ఆడపిల్లలను పట్టుకొచ్చి హీనమైన వ్యాపారం చేస్తున్న ఆ హైనా మీద బుల్లెట్ దించింది. వేశ్యాగృహాలను తగులబెట్టి చేసుకునే దీపావళే కదా అసలైన దీపావళి.
ఇంకా ఎందరో స్త్రీలు ఉన్నారు. స్క్రీన్ మీద చెడుకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. పోరాటాలు విజయవంతమయ్యే కొద్దీ దీపాల కాంతి పెరుగుతుంది. వాటి వెలుగుకు ఉన్న శక్తి పెరుగుతుంది. ఆ కాంతి విస్తరణా పెరుగుతుంది. స్త్రీలు వెలిగించే స్త్రీలను వెలిగించే చైతన్యవంతమైన దీపావళికి స్వాగతం.
న్యాయం కావాలి నుంచి ప్రతిఘటన వరకు
గత సినిమాలలో చెడుపై పోరాడిన సత్యభామలు ఎందరో ఉన్నారు. పెళ్లికి ముందు శారీరకంగా లోబరుచుకుని ఆ తర్వాత పెళ్లికి నిరాకరిస్తే అతడి మీద కేసు పెట్టి న్యాయస్థానానికి ఈడ్చి శిక్ష పడేలా చేసిన పాత్ర ‘న్యాయం కావాలి’ సినిమాలో రాధిక చేసింది. నగరంలో రౌడీయిజం పెరిగిపోతే, రౌడీలు రాజకీయ నాయకులుగా మారి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తుంటే బాధ్యత కలిగిన పౌరురాలిగా గండ్రగొడ్డలితో ఆ దుర్మార్గుణ్ణి నరికిన పాత్రను విజయశాంతి ‘ప్రతిఘటన’లో చేసింది.
అంతే కాదు నేరం చేసిన మగవాళ్లు, పోలీసుల్లో ఉన్న మగవాళ్లు ఏకమై ఒక దారుణ రేప్ కేసును దారి మళ్లిస్తుంటే బాధితురాలి వైపు నిలబడి నేరం చేసినవాడు పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా వదలకుండా పెను పోరాటం చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రను ‘కర్తవ్యం’లో కూడా ఆమే చేసింది. పెళ్లి చేసుకుని బిడ్డ పుట్టాక వదిలేస్తే ఆ బిడ్డను ఒడిలో పెట్టుకుని భర్త ఇంటి ముందు మౌనపోరాటం చేసి ఇలాంటి దుర్మార్గాన్ని లోకం దృష్టికి తీసుకువచ్చిన గిరిజన యువతి పాత్రను ‘మౌనపోరాటం’ సినిమాలో యమున చేసింది.
నాట్యం చేస్తున్నప్పుడు ప్రేమించి, ప్రమాదవశాత్తు కాలు పోగానే విడిచిపెట్టిన మగాడిని తన ఆత్మబలం, కృత్రిమ కాలుడో నాట్యకారిణి అయి శిక్షించిన ధీర పాత్రను సుధ ‘మయూరి’లో చేసింది. కోడలి మీదే కన్నేసిన మామను కత్తితో కండలుగా నరికిన అత్తగా ‘ఆమె’ సినిమాలో సుధ చేసింది. పెళ్లి చేసుకున్న కోడలికి శాడిజంతో అనుక్షణం నరకం చూపిస్తున్న కొడుక్కు స్వయంగా విషం ఇచ్చే తల్లి పాత్రను ‘తాళి’ సినిమాలో సుజాత చేసింది. తన జమిందారీని ఆయుధంగా చేసుకుని స్త్రీల మానప్రాణాలు హరిస్తున్న దుర్మార్గుణ్ణి చంపి జేజమ్మగా జేజేలు అందుకున్న పాత్రను అనుష్క ‘అరుంధతి’లో చేసింది.
Comments
Please login to add a commentAdd a comment