మీ ఇంటికి దీపం మీరే! | women finance | Sakshi
Sakshi News home page

మీ ఇంటికి దీపం మీరే!

Published Mon, Nov 7 2016 11:30 PM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

మీ ఇంటికి దీపం మీరే! - Sakshi

మీ ఇంటికి దీపం మీరే!

ఉమెన్ ఫైనాన్స్

వందన సాధారణ గృహిణి. భర్త, ఇద్దరు ఆడపిల్లల ఇంటి వ్యవహారాలు చూసుకోవడంలోనే రాత్రీ పగలూ గడిపేస్తుండేది. ఆర్థిక వ్యవహారాలన్నీ సంపాదనపరుడైన భర్త రాజేశే చూసుకొనేవారు. ఇంటి బడ్జెట్ మాత్రం ఆమె చూసుకొంటూ వచ్చేది. జీతం నుంచి నెల నెలా భర్త ఇచ్చిన డబ్బులతోనే ఇంటి ఖర్చులు చూసేది. ఆ డబ్బుతోనే ఇల్లు గడిపి, అందులోనే కాస్తంత దాచి, పిల్లలు అడిగినవి ఏమైనా కొనిపెట్టేది. అయితే, కొన్నేళ్ళుగా పెరుగుతున్న ధరలు, వాటితో పెరుగుతున్న ఇంటి ఖర్చులు ఇబ్బందిపెడుతూ వచ్చాయి. పిల్లల చదువుల ఖర్చూ పెరిగింది. పొదుపు సూత్రం పాటించని వందన ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పురుగు మీద పుట్రలా కొద్ది నెలల క్రితం ఆమె భర్త రాజేశ్ దురదృష్టవశాత్తూ ఒక ప్రమాదంలో కన్నుమూశాడు. అప్పటి దాకా గృహ ఋణం వాయిదాలు కట్టడం దగ్గర నుంచి అన్నీ చూసుకున్న భర్త చనిపోవడంతో, ఆర్థిక వ్యవహారాలేవీ తెలియని వందన ఇబ్బందుల్లో పడింది. అప్పటి దాకా తన భర్త నడిపినవన్నీ తెలుసుకోవడానికి తంటాలు పడింది.

వందన లానే చాలామంది భారతీయ గృహిణులు ఆర్థిక వ్యవహారాల పట్ల అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలు, మరోపక్క గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి అన్నిటి మీదా తగ్గిపోతున్న సబ్సిడీల నేపథ్యంలో ఇంటి బడ్జెట్‌నూ, కుటుంబ భవిష్యత్తునూ ప్లాన్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అయితే, కొద్దిపాటి అవగాహనతో ఆడవాళ్ళు చాలా అద్భుతంగా ఈ పని చేయగలరు. నిజం చెప్పాలంటే, మగవాళ్ళ కన్నా బ్రహ్మాండంగా చేయగలరు. దాని కోసం గృహిణులు పాటించాల్సిన కొన్ని టిప్స్ ఏమిటంటే...

1. ఆదాయం, ఖర్చు లెక్క చూసుకోండి!
ఇంటికి సరుకులు, సామాన్లు కొనే విషయంలో బడ్జెట్ వేసుకోవడం గృహిణులకు అలవాటే. ఆ మంచి అలవాటును కేవలం నెల నెలా ఇల్లు నడపడానికే పరిమితం చేయకండి. కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, ఇంటి అద్దె, క్రెడిట్ కార్డ్ బిల్లు, హౌసింగ్ లోన్ లాంటి వాటితో సహా మొత్తం ఇంటి బడ్జెట్‌కు ఎంత అవసరమో చూసుకోండి. వచ్చే ఆదాయం, పెట్టాల్సిన ఈ ఖర్చు - రెండూ లెక్కవేసుకోండి. దీనికి నిపుణుల అవసరమేమీ లేదు. కంప్యూటర్‌లో ఎక్సెల్ వర్క్‌షీట్‌లో టైప్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్‌గా ఒక డైరీ పెట్టుకొని, లెక్క రాసుకోవచ్చు.

2. ఎక్కడ అతిగా ఖర్చవుతోందో చూడండి!
ఇంటికయ్యే ఖర్చు మొత్తం లెక్క చూసుకున్నాక, ఏయే విషయాల్లో ఎక్కువ ఖర్చవుతోందో అర్థమవుతుంది. వాటిని ఏ మేరకు తగ్గించుకోవచ్చో చూసుకోవాలి. ఉదాహరణకు, వారం వారం హోటల్‌కు వెళ్ళి భోజనం చేయడం, వారాంతంలో మాల్స్‌కు వెళ్ళి షాపింగ్ చేయడం, తరచూ సినిమాలకూ, షికార్లకూ వెళ్ళడం లాంటివి. వీటిని పూర్తిగా మానేయక్కర్లేదు కానీ, తగ్గించుకోవచ్చు. ఎక్కువగా వాడనట్లయితే, ఫోన్, ఇంటర్‌నెట్‌లకు తక్కువ ప్యాకేజ్ తీసుకోవచ్చు. అలాగే, పెద్ద పెద్ద మాల్స్‌కు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టి కొనే పని పెట్టుకోకుండా, దగ్గరలోనే ధర తగ్గించి సరుకులు అమ్మే పచారీ కొట్లు చూసుకోవడం బెటర్.

3. ముందు ఆదా! ఆ తరువాతే ఖర్చులు!!
సాధారణంగా ఇంటిని నడిపే ఇల్లాళ్ళకు డబ్బులు ఆదా చేసే మంచి అలవాటు ఉంటుంది. మానుకోదగ్గ ఖర్చులేవో చూసుకొని, వాటిని మానుకొంటే ఆదా మరింత పెరుగుతుంది. అలాగే, బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా తెరిచి, కాస్తంత అదనంగా డబ్బు ఉందనుకున్నప్పుడల్లా దానిలో డబ్బు డిపాజిట్ చేస్తూ ఉండాలి. అలా కొద్ది కొద్దిగా దాచుకుంటూ వచ్చిన సొమ్మే ఒకనాటికి పెద్ద మొత్తం అవుతుంది. ఇలా దాచుకోగా మిగిలిన మొత్తంతోనే ఖర్చులు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.

4. తెలివిగా మదుపు చేయాలి!
డబ్బు దాచడం ఒక్కటే కాదు... ఆ డబ్బు భవిష్యత్తులో అవసరాలకు తగ్గట్లు పెరిగేలా చూసుకోవడం కూడా ముఖ్యం. డబ్బులు అటు బ్యాంకులోనో, ఇటు ఇంట్లోనో ఉత్తినే పడి మూలుగుతుండడం వల్ల ఉపయోగం లేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ధరలకు అది సరిపోదు. కాబట్టి, దాచుకొన్న డబ్బును తెలివిగా ఎలా మదుపు చేయాలన్నది చూసుకోవాలి. అందుకోసం అవసరమైతే నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. కావాలంటే, డబ్బు మదుపు చేయడం గురించి జీవిత భాగస్వామి సలహాలు అడిగి తీసుకోవాలి.

5. అత్యవసర ఖర్చులకు ప్లానింగ్!
గృహిణులు సాధారణంగా భర్త చేసే ప్లానింగ్ మీద ఆధారపడుతూ ఉంటారు. పూర్తిగా అలా ఆధారపడడం తప్పు. కొన్నిసార్లు అనుకోకుండా వైద్యం ఖర్చులో, మరొకటో రావచ్చు. అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండేలా చూసుకోవాలి. భర్తతో కలసి మీరు కూడా ఆర్థిక ప్లానింగ్‌లో పాలు పంచుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలకని, పిల్లల చదువులకని కొంత డబ్బును విడిగా పెట్టుకోవడం మంచిది. అలాగే, రిటైర్మెంట్ తరువాతి జీవితం గురించి కూడా ఆలోచించాలి. ఆ వయసులో డబ్బుకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.

6. అవగాహన పెంచుకోవాలి!
ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు డబ్బుల వ్యవహారాలు ఎందుకని కొందరు అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. అసలు ఆర్థిక వ్యవహారాల అవగాహన ఇంటిని నడిపే గృహిణులకే ఎక్కువగా ఉండాలి. స్త్రీలు కూడా దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. డబ్బు ఆదా చేయడానికీ, దాన్ని మదుపు చేయడానికీ ఉన్న మార్గాలు తెలుసుకోవాలి. ముందుగా బ్యాంకులో ఉన్న ఆదా మార్గాలు తెలుసుకోవడం ద్వారా మొదలుపెట్టాలి. అయితే, బ్యాంకులో సేవింగ్ ఎకౌంట్‌తో ఆగిపోకుండా, మదుపు చేయడానికి ఉన్న ఇతర మార్గాలు తెలుసుకోవాలి. తరువాత ఆర్థిక నిపుణులతో విషయం చర్చించాలి. వీలుంటే, ఇంటర్‌నెట్‌లో సదరు మదుపు అవకాశాల గురించి అన్వేషించి, వివరాలు తెలుసుకోవాలి. కొన్ని టీవీ ఛానళ్ళు మహిళల పర్సనల్ ఫైనాన్స్‌పైన ప్రత్యేక కార్యక్రమాలు వేస్తుంటాయి. అవి చూడడం కూడా ఒక మంచి ఆలోచన.

జీవితంలో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు కాబట్టి, అన్ని రకాల పరిస్థితులకూ సిద్ధంగా ఉండాలి. ఆర్థిక అంశాల పట్ల ఎంత అవగాహన పెంచుకొంటే, అంత మంచిది.     - మహతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement