సొంతింటి స్వతంత్రం
ఉమెన్ ఫైనాన్స్ / రివర్స్ మార్ట్‌గేజ్
ప్రతి ఒక్కరూ తమ వృద్ధాప్యంలో ఏ చీకూ చింతా లేని ప్రశాంత జీవితం గడపాలని కోరుకుంటారు. మరి అలాంటి జీవితం అందరూ పొందగలుగుతున్నారా? దీనికి సమాధానం ‘లేదు’ అనే చెప్పాలి. ఎందుకంటే.. కొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులు, మరికొందరికి ఆరోగ్య సమస్యలు. ఇంకొంత మందికి అన్ని వనరులూ, వసతులూ ఉన్నా కూడా తమ వారితో లేమనే బెంగ. అన్నిటికన్నా ముఖ్య సమస్య.. ఉన్న సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అనే టెన్షన్ పడుతూ సమస్యను మరింత జటిలం చేసుకోవడం.
అనగనగా... ఓ చిన్న కథ
ఒక ఊరిలో ఒక పెద్దావిడ ఉండేవారు. భర్త వైద్యం నిమిత్తం ఒక వ డ్డీ ప్యాపారి దగ్గర తన ఇంటిని తనఖా పెట్టి కొంత డబ్బును అప్పుగా తీసుకుంది. కాలక్రమంలో ఆమె భర్త మరణిస్తాడు. ఆమెకు పిల్లా జల్లా, ముందూ వెనుకా ఎవరూ లేరు. ఆమె, ఆమె భర్త కలిసి సంపాదించి నిర్మించుకున్న ఆ ఇల్లు తప్ప ఏమీ లేదు. ఆ ఇల్లు కూడా తనఖాలో ఉంది. ఆమెకు ఇంకా పని చేయగల శక్తి ఉంది. కానీ తనకు ఎవరూ లేరనీ, ఆ వడ్డీ వ్యాపారి వచ్చి అప్పు కట్టమని అడిగితే డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని, ఒకవేళ తీసుకురాకపోతే ఎక్కడ తన ఇంటిని వేలం వేస్తాడోనని భయం పట్టుకుంది. ఆ భయమే ఎక్కువై... పనిచేసే ఆవిడ కూడా మంచం పట్టింది. ఈ విషయం కాస్తా ఆ వడ్డీ వ్యాపారి చెవిన పడింది. ఆ వడ్డీ వ్యాపారి అత్యాశతో ఆమెకు ఎవరూ లేరు కనుక ఎలాగైనా ఆ ఇంటిని చేజిక్కించుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఊరి పెద్దలతో పంచాయితీ పెట్టించాడు. ఆమె ఎటూ మంచాన పడింది కనుక, నెలకు కొంత మొత్తాన్ని ఆమె బతికి ఉన్నన్నాళ్లూ ఆమెకు ఇచ్చి, ఆమె మరణానంతరం ఇల్లు తన సొంత అయ్యేలా తీర్మానం చేయించుకున్నాడు. నెలా, రెండు నెలల్లో ఆ ఇల్లు తన సొంతం అవుతుందని చాలా సంతోషపడిపోయాడు. కానీ అలా జరగలేదు! ఏళ్లకు ఏళ్లు పెద్దావిడకు నెలనెలా డబ్బు ఇస్తూనే ఉన్నాడు.
అలా ఎందుకు జరిగిందంటే... అతడు చేయించిన తీర్మానంతో ఆ పెద్దావిడ బెంగ తీరిపోయింది! తను పని చేసినా చేయకపోయినా కొంత మొత్తం క్రమం తప్పకుండా వడ్డీ వ్యాపారి నుంచి అందుతోంది. అంతే కాకుండా, తనకి ఓపిక ఉంటే పని చేస్తూ అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. అలాగే తన ఇంటి నుంచి కూడా తనను ఎవరూ వెళ్లగొట్టరు. ఈ నిశ్చింతతో ఆమె పుష్టిగా తింటూ, హాయిగా ఉండసాగింది.
మనకూ ఉంది ఈ సదుపాయం!
ప్రస్తుత పరిస్థితుల్లో మనక్కూడా ఈ పెద్దావిడకే ఉన్న సదుపాయం లాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది కదా. ఉంటే కాదు, ఉంది! దాని పేరే ‘రివర్స్ మార్ట్‌గేజ్’. బ్యాంకులు సొంత ఇల్లు కలిగి ఉండి అందులో నివసిస్తూ 60 సం॥పైబడిన వారికి ఈ రివర్స్ మార్ట్‌గేజ్ లోన్‌ను అందిస్తున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఇంటి లోన్‌కు ఆపోజిట్‌గా ఉంటుంది!
ఇంటి స్థితి, ప్రస్తుత మార్కెట్ విలువ, ప్రస్తుత డిమాండ్.. వీటిని బట్టి ఇంటి విలువను బ్యాంకు వారు లెక్క గడతారు. ఆ విలువను బట్టి ఎంతవరకు లోన్ ఇవ్వవచ్చో ఆ మొత్తాన్ని ఇ.ఎం.ఐ. (నెలసరి వాయిదా) రూపంలో అందజేస్తారు. ఈ ఇ.ఎం.ఐ. ని ఒక నిర్ణీత కాల పరిమితికి అందజేస్తారు. ఇ.ఎం.ఐ.ని నెలవారీగా కానీ, మూడు నెలలకొకసారి గానీ ఎంచుకునే వీలు ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న లోన్‌ను వ్యక్తి మరణించినప్పుడు లేదా ఇంటిని అమ్ముకోదలచినప్పుడు చెల్లించవలసి ఉంటుంది. ఉదా: ఒక వ్యక్తి ఈ లోన్‌ను 10 సం. వరకు తీసుకున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి 10 సం.ల వరకు ఇ.ఎం.ఐ.ని పొందుతాడు. గడువు తీరిన తర్వాత ఎటువంటి ఇ.ఎం.ఐ. రాదు. ఆ తరువాత అతడు మరణించినప్పుడు ఆ వ్యక్తి వారసులు ఆ లోన్ చెల్లించి ఆ ఇంటిని తమ సొంతానికి వాడుకోవచ్చు. లేకపోతే బ్యాంకు వారు ఆ ఇంటిని అమ్మి లోన్‌కు జమ చేసుకుని మిగిలిన మొత్తాన్ని ఆ వ్యక్తి వారసులకు అందజేస్తారు. ఒకవేళ ఆ ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు లోన్‌కి సరిపోకపోతే బ్యాంకు వారు నష్టపోవలసి ఉంటుంది. అందుకే బ్యాంకు వారు లోన్ ఇచ్చేటప్పుడే ఇంటి విలువను లెక్కించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇద్దరూ కలిసి తీసుకోవచ్చు
ఈ రుణాన్ని భార్యభర్తలు ఇద్దరూ కలిపి కూడా తీసుకోవచ్చు. ఇద్దరూ కలిసి తీసుకున్నప్పుడు ఇద్దరి మరణానంతరం మాత్రమే బ్యాంకు వారికి ఇంటిని అమ్మడానికి హక్కు ఉంటుంది. అయితే ఈ కింది సందర్భాలలో గడువు కన్నా ముందే బ్యాంకు వారు లోన్ అకౌంట్ క్లోజ్ చేస్తారు.
లోన్ తీసుకున్నవారు ఒక ఏడాదిపాటు ఆ ఇంటిలో నివసించనట్లయితే ఇంటి పన్ను కట్టనట్లయితే లోన్ తీసుకున్న వ్యక్తి తను దివాళా తీశానని ప్రకటిస్తే ఆ ఇంటి హక్కులకు సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తే ప్రభుత్వం వారు వివిధ కారణాల వల్ల ఆ ఇంటిని స్వాధీన పరచుకున్నా, లేదా పడగొట్టినా. ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడకుండా, తాము సంపాదించి కట్టుకున్న ఇంటిలో తమ తుది శ్వాస వరకు నివసించాలని కోరుకునే వారికి ఈ రివర్స్ మార్టిగేజ్ చాలా చక్కటి మార్గం.
రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’