చీకటి మలుపులో చేతికందే దీపం
ఉమెన్ ఫైనాన్స్ / ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన
మన దేశంలో ప్రతి ఒక్కరికీ, మరీ ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన వారందరికీ ప్రమాదం కారణంగానే కాకుండా, మరే ఇతర కారణం చేతనైనా మరణం సంభవిస్తే వారి కుటుంబ సభ్యులకు కొంతమేర ఆర్థిక చేయూతను ఇవ్వాలనే సదుద్దేశంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో మన ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వివరాలను చూద్దాం. ఈ పథకంలో నమోదైన ఖాతాదారులకు ఏ కారణం చేతనైనా మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయలను వారి నామినీకి అందజేస్తారు.
కనీసం 18 సం. మొదలుకొని, 50 సం. వయసు గల వారి వరకు ఈ పథకంలో చేరడానికి అర్హులు.ఏ బ్యాంకులైతే ఈ పథకాన్ని నిర్వహిస్తారో ఆ బ్యాంకులో.. సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి. 330 రూపాయలను ప్రతి సంవత్సరం ఈ పథకానికి ప్రీమియంగా చెల్లించాలి. ఈ పథకం జూన్ 1 మొదలుకొని మే 31 వరకు ఉంటుంది. మళ్లీ తర్వాత సంవత్సరానికి ఈ పథకాన్ని కొనసాగించాలంటే మే 31 లోపల ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. బ్యాంకులు ప్రీమియంను ఆటో-డెబిట్ పద్ధతిలో బ్యాంకు ఖాతాదారుల నుండి తీసుకుంటాయి. కనుక పథకంలో కొనసాగాలనుకునేవారు తమ ఖాతాలో ప్రీమియం సొమ్మును ఉంచవలసి ఉంటుంది.
55 సం. వయసు వరకు మాత్రమే పథకంలో కొనసాగే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత పథకాన్ని కొనసాగించినా సొమ్ము ఏమీ రాదు. ఈ పథకంలో చేరిన తర్వాత 55 సం.లకు ముందు ఏ కారణం చేతనైనా మరణం సంభవిస్తే వారి నామినీకి సొమ్ము అందజేస్తారు. బ్యాంకు ఖాతాను మూసి వేసినా, ప్రీమియం సొమ్ముకు సరిపడా మొత్తాన్ని ఖాతాలో ఉంచకపోయినా ఈ పథకం కొనసాగదు. ఒక బ్యాంకు ఖాతాకన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలలో ఈ పథకానికి ప్రీమియం చెల్లించిన ప్పటికీ ఒక ఖాతా ద్వారా మాత్రమే బీమా లభిస్తుంది. మిగతా ఖాతాల ద్వారా చెల్లించిన ప్రీమియంకు బీమా వర్తించదు.ఈ పథకం ప్రారంభించినప్పుడు కాకుండా తర్వాత చేరేవారు; పథకంలో చేరి, కొనసాగకుండా ఉండి, మళ్లీ జాయిన్ కాదలచుకున్నవారు ‘సెల్ఫ్ సర్టిఫికెట్ ఆఫ్ గుడ్ హెల్త్’ని అందజేయవలసి ఉంటుంది. ఈ పథకంలో చేరేవారికి ఆధార్‌ని ప్రధాన పత్రంగా పరిగణిస్తారు. ఖాతాదారులు ఆధార్‌ని తమ బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా అనుసంధానించాలి.
ఇది చాలా తక్కువ ప్రీమియంతో అతి సులభంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి తమ మరణానంతరం ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వీలుకల్పించే ఒక మంచి పథకం. అయితే పథకంలో చేరడం ఎంత ముఖ్యమో, ఆ ఖాతాను కొనసాగించడమూ అంతే ముఖ్యం అని గ్రహించాలి.
రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’