కొద్దికొద్దిగా... కొండంతగా..!
ఉమెన్ ఫైనాన్స్ / రికరింగ్ డిపాజిట్
పరుగెత్తి పాలు తాగటం కన్నా నెమ్మదిగా వెళ్లి నీళ్లు తాగటం మంచిది అనే నానుడి వినే ఉంటారు. చాలామంది తమ పిల్లలకు తమకు మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలనే కోరికతో చాలా కష్టపడి సొమ్మును కూడబెడుతూ ఉంటారు. ఆ సొమ్మును సరైన ప్రణాళిక లేకుండా త్వరగా పెద్ద మొత్తం అవ్వాలనే ఆశతో ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి మార్గాలలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి అనుకోని పరిస్థితుల కారణంగా మొదటకే మోసం జరగవచ్చు.
అందుకే పెట్టుబడి పెట్టే మొత్తాన్ని ఒకే పొదుపు మార్గంలో కాకుండా కొన్నింటిని రిస్క్ తక్కువగా ఉండే వాటిలోను, మరికొంత మొత్తాన్ని కాస్త రిస్క్ భరించగలిగే సాధనంలో పెట్టుబడి పెడితే, అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటారు. రిస్క్ తక్కువగా ఉండి అతి తక్కువ మొత్తంతో మొదలు పెట్టుకొనే సాధనమే బ్యాంకువారు అందజేసే రికరింగ్ డిపాజిట్స్.
► ఈ రికరింగ్ డిపాజిట్‌ను నెలకు అతితక్కువ మొత్తమైన 100 రూ.తో మొదలుపెట్టవచ్చు.
► సాధారణంగా బ్యాంకులు 7 శాతం నుండి 8 శాతం వరకు వడ్డీని అందజేస్తున్నాయి.
► ఈ రికరింగ్ డిపాజిట్ కాల వ్యవధిని 6 నెలల నుండి 10 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు.
► సీనియర్ సిటిజన్స్‌కి వడ్డీ రేటు 0.5 శాతం అదనంగా లభిస్తుంది.
► రికరింగ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ గనుక రూ. 10,000లు దాటితే టీడీఎస్ కట్ అవుతుంది.
► ఈ రికరింగ్ డిపాజిట్ మీద లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది.
{పతి నెలా తప్పనిసరిగా రికరింగ్ డిపాజిట్ ఎంత మొత్తానికైతే తీసుకుంటారో అంత మొత్తాన్ని బ్యాంకులో జమ చేయాలి. లేకపోతే పెనాల్టీ పడుతుంది.
► రికరింగ్ డిపాజిట్‌లో ఉన్న మొత్తానికి ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని లెక్కగడతారు.
కొన్ని బ్యాంకులు ఇన్‌స్టాల్‌మెంట్ కట్టకపోయినా పెనాల్టీ వేయకుండా, సౌలభ్యం ఉన్నప్పుడు కట్టే విధంగా కూడా రికరింగ్ డిపాజిట్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
► బ్యాంకులు ఖాతాదారుల సేవింగ్స్ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా వారి రికరింగ్ ఖాతాకు ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ మొత్తాన్ని బదిలీ చేసే సౌకర్యాన్ని కూడా అందజేస్తున్నాయి.
► ఇలా అతి తక్కువ రిస్క్ కలిగి ఉండి తమకు వచ్చే సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాలకు సమకూర్చుకోవడానికి ఈ రికరింగ్ డిపాజిట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.