Recurring Deposit
-
డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలు
డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినూత్న ప్రొడక్టులను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తోంది. రికరింగ్ డిపాజిట్– క్రమానుగత పెట్టుబడి విధానం (ఎస్ఐపీ) కాంబో ప్రొడక్ట్సహా వినూత్నమైన ఉత్పత్తులను తీసుకురావాలని యోచిస్తున్నట్లు బ్యాంక్ ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నందున కస్టమర్లు ఆర్థికంగా మరింత అవగాహనతో వ్యవహరిస్తున్నారని, వ్యవస్థలో డిమాండ్ ఉందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో వారు వినూత్న పెట్టుబడి సాధనాల కోసం వెతకడం ప్రారంభించారని కూడా తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఆర్థిక అక్షరాస్యత మెరుగుపడటంతో కస్టమర్లు తమ పెట్టుబడులపై అధిక రాబడుల గురించి ఆలోచిస్తున్నారు. ఆ మేరకు పోర్ట్‌ఫోలియో రూపకల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.సహజంగానే ఎవరూ ప్రతి రూపాయినీ ప్రమాదకర లేదా ఊహాజనిత ఇన్వెస్ట్మెంట్లో ఉంచాలని కోరుకోరు. బ్యాంకింగ్ ప్రొడక్టులు ఎల్లప్పుడూ పోర్ట్‌ఫోలియోలో భాగమే. కాబట్టి మేము వారికి నచ్చే ఉత్పత్తులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.రికరింగ్ డిపాజిట్ వంటి కొన్ని సంప్రదాయ ప్రొడక్టుల్లో కొత్త విధానాలు తీసుకురావాలని యోచిస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్/ రికరింగ్ డిపాజిట్–ఎస్ఐపీను డిజిటల్‌గా యాక్సెస్ చేయగల కాంబో ప్రోడక్ట్‌గా రూపొందించాలనే ప్రతిపాదనలున్నాయి.తాజా ప్రొడక్టులు జన్ జెడ్‌లో (12 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు) ప్రాచుర్యం పొందడానికి అనుగుణమైన ఆవిష్కరణలపై బ్యాంక్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది.అంతేకాకుండా, డిపాజిట్ సమీకరణ కోసం బ్యాంక్ భారీ ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.ఇదీ చదవండి: బీమా పాలసీ వెనక్కిస్తే మెరుగైన ప్రయోజనాలు!కొత్త ఖాతాలను తెరవడంపై బ్యాంక్ దృష్టి సారిస్తోంది. రోజుకు దాదాపు 50,000 నుంచి 60,000 సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలను తెరవడం లక్ష్యంగా పెట్టుకున్నాం.ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లలో దాదాపు 50 శాతం డిజిటల్ ఛానెల్‌ల ద్వారానే తెరుస్తున్నాం.వచ్చే 3–5 ఏళ్లలో రూ.లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటాలని దేశీయంగా బలమైన ఆర్థిక సంస్థగా అవతరించాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని బ్యాంక్ నమోదుచేసింది. -
కేంద్రం వడ్డీ రేట్లు పెంచింది.. చెక్ చేసుకున్నారా?
న్యూఢిల్లీ: ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేటును కేంద్రం శుక్రవారం 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. అన్ని ఇతర చిన్న పొదుపు పథకాల రేట్లను యథాతథంగా ఉంచింది. డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి తాజా రేట్ల విధానంపై ఆర్థికశాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. డిసెంబర్ త్రైమాసికానికి యథాతథంగా కొనసాగుతున్న మిగిలిన పొదుపు పథకాల రేట్లు ఇలా... -
రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ దిశగా మంగళవారం విద్యాశాఖ జీవో జారీ చేసింది. వీటి ఏర్పాటుకు రికరింగ్ బడ్జెట్‌గా రూ.60 లక్షలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. జిల్లాల విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన మండలాల్లో 20 కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించగా, ఆయా ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014లో రాష్ట్రంలో 391 కేజీబీవీలుండేవి. 2017–18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరు చేశా రు. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కు చేరింది. తాజాగా మంజూరైన వాటి తో వీటి సంఖ్య 495కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్ విద్య, మరో 230 కేజీబీవీలను పదోతరగతి వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసినవి ఇవే.. మావల (ఆదిలాబాద్), బీర్పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్), దంతాలపల్లి (మహబూబాబాద్), మహ్మదాబాద్ (మహబూబ్‌నగర్), నార్సింగి, నిజాంపేట, హవేలి, ఘన్పూర్ (మెదక్), నిజామాబాద్ (సౌత్), నిజామాబాద్ (నార్త్), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్ (వికారాబాద్). -
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 61 రోజుల నుంచి 89 నెలల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. గతంలో ఇంట్రస్ట్ రేట్లు 4శాతం ఉండగా ఇప్పుడు (50బేసిస్) 4.50 శాతానికి పెంచింది. ► 90 రోజుల నుంచి 6 నెలల కాలానికి.. గతంలో 4.25 శాతం ఉండగా ఇప్పుడు 4.50 శాతానికి పెంచింది. ►1 రోజుల నుంచి 9 నెలల కంటే తక్కువ 6 నెలల తగ్గకుండా చేసిన ఎఫ్డీలపై నిన్న వరకు 5 శాతం వడ్డీని చెల్లించేది. ఇప్పుడు ఆ వడ్డీని 5.25 శాతానికి పెంచింది. ►1 రోజు నుంచి ఏడాదికి కాలానికి 9 నెలలు ఎఫ్డీని కొనసాగిస్తే.. వాటిపై 5.50శాతం వడ్డీని పొందవచ్చు. గమనిక : పెరిగిన పిక్స్డ్ రేట్లు ►ఒక సంవత్సరం నుండి 15 నెలల ఎఫ్డీ టెన్యూర్ కాలానికి 6.10 శాతం, 15 నెలల నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్డీలపై 6.15 శాతం ఇంట్రస్ట్ పొందవచ్చు. ►ఒక రోజు నుండి ఐదేళ్ల లోపు అంటే (రెండేళ్ళ టెన్యూర్ కాలానికి) చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం, ఐదు నుంచి పదేళ్ల టెన్యూర్ కాలానికి 6.20 శాతం వడ్డీని పొందవచ్చు. ►60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు 0.50 శాతం అదనపు వడ్డీని పొందుతారు. గమనిక : పెరిగిన రికరింగ్ డిపాజిట్ రేట్లు ►హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 నెలల నుంచి 120 నెలల కాలానికి చేసే సాధారణ రికరింగ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. చదవండి👉 భారత్‌లో అదరగొట్టిన ధంతేరాస్ సేల్స్, చైనాకు రూ. 75 వేల కోట్లు నష్టం! -
బిస్కెట్లుగా దేవుడి నగలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ముఖ్య దేవాలయాల్లో మూలుగుతున్న బంగారు, వెండి ఆభరణాలు, వస్తువుల మూటలకు మోక్షం కలగనుంది. బంగారం బిస్కెట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా లాకర్ల ఖర్చు తగ్గించుకోవడంతో పాటు వడ్డీ రూపంలో ఆదాయం సమకూర్చుకునే దిశగా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. తెలంగాణలోనే ప్రధాన దేవాలయం వేములవాడ.. భక్తుల కొంగుబంగారం. అందుకు తగ్గట్టుగానే అక్కడికి వచ్చే భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. ఇందులో పెద్దమొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు కూడా ఉంటాయి. అయితే స్వామికి అలంకరించే ఆభరణాలు పోను మిగతావి పదుల సంఖ్యలో మూటల్లో నింపి లాకర్లలో పడేశారు. రాష్ట్రంలోని భద్రాచలం, బాసర, కొండగట్టు, యాదగిరిగుట్ట, కొమురవెల్లి, ధర్మపురి, వరంగల్ భద్రకాళి, ఉజ్జయినీ మహంకాళి.. ఇలా ముఖ్య దేవాలయాలన్నిటిలో ఇదే పరిస్థితి. భద్రాచలం దేవాలయంలో ఉత్సవాల సమయంలో ఎక్కువ నగలను దేవతా మూర్తులకు అలంకరిస్తున్నారు. యాదగిరిగుట్టలో దేవాలయ పునర్నిర్మాణం నేపథ్యంలో బంగారాన్ని కరిగించి ఆలయానికే వినియోగిస్తున్నారు. కానీ మిగతా దేవాలయాల్లో ఆభరణాలు, వస్తువులు, తుసుర్ల రూపంలో ఉన్న వెండి, బంగారం ఎన్నో ఏళ్లుగా లాకర్లలో మూలుగుతున్నాయి. అయితే ఇప్పుడవి బంగారం బిస్కెట్లలా మారనున్నాయి. తర్వాత అవి స్టేట్ బ్యాంకు అధీనంలోకి వెళ్లడం ద్వారా వడ్డీ రూపంలో దేవాదాయ శాఖకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూరనుంది. గోల్డ్ మానిటైజేషన్ పథకం కింద.. బంగారాన్ని డిపాజిట్ చేసే పని ఇప్పటికే మొదలు కాగా, తాజాగా వేల కిలోల వెండి.. దాని విలువకు తగ్గ బంగారం బిస్కెట్లుగా మారనుంది. వెండిని కరిగించి దానికి బదులుగా స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో ఇచ్చేందుకు మింట్ అంగీకరించింది. మొత్తం బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ పథకంలో డిపాజిట్ చేయటం ద్వారా సాలీనా రూ.2.5 కోట్ల వడ్డీ దేవాదాయ శాఖకు అందుతుందని సమాచారం. ఇంతకాలం ఆ వెండి, బంగారాన్ని బ్యాంకు లాకర్లలో భద్రపరిచినందుకు లాకర్ అద్దె, కొన్నింటికి బీమా చేయించినందుకు ప్రీమియం రూపంలో లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆ ఖర్చు మిగలనుంది. వేములవాడ ఆలయంతో మొదలు.. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయాల్లో వినియోగంలో లేని బంగారం దాదాపు 425 కిలోలు ఉంది. అలాగే 18 వేల కిలోల వెండి లాకర్లలో మూలుగుతోంది. నిజానికి ఆలయాల్లో 38 వేల కిలోల వెండి ఆభరణాలు, వస్తువులున్నాయి. కానీ అందులో సగానికంటే కాస్త ఎక్కువ మాత్రమే వినియోగంలో ఉండగా మిగతావి లాకర్లలోనే ఉంటోంది. అయితే ప్రస్తుతం దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు కూడా నిధులు సరిపోక ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ఆదాయాన్ని పెంచుకునే కసరత్తులో భాగంగా బంగారం, వెండి వస్తువులను స్టేట్ బ్యాంకు గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో భాగంగా డిపాజిట్ చేయాలని ఇటీవల నిర్ణయించారు. ఆ మేరకు వినియోగంలో లేని బంగారాన్ని మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ) ఆధ్వర్యంలో కరిగించి బిస్కెట్లుగా మార్చే కసరత్తు ప్రారంభమయ్యింది. ఇటీవలే కొంత బంగారాన్ని స్టేట్ బ్యాంకుకు అప్పగించారు. దాదాపు 70 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేయనున్నారు. మింట్ అధికారులతో చర్చ తాజా సమాచారం ప్రకారం.. బంగారాన్ని నేరుగా స్టేట్‌బ్యాంకే ఎంఎంటీసీలో కరిగిస్తుంది. అక్కడ 95 శాతం ప్యూరిటీ స్థాయికి తెప్పించి దాన్ని బిస్కట్లుగా మారుస్తారు. వెండి విషయంలో మాత్రం ఇటీవల మింట్ యంత్రాంగంతో దేవాదాయ శాఖ అధికారులు చర్చించారు. వెండిని కరిగించి పూర్తి స్వచ్ఛమైన వెండిలా మార్చి.. అప్పటి బులియన్ ధరల ప్రకారం దాని విలువను బంగారంతో లెక్కగట్టి.. అంత విలువైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కట్ల రూపంలో దేవాదాయ శాఖకు అందించేందుకు మింట్ అంగీకరించినట్టు తెలిసింది. దీంతో ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలోని దేవాలయాల్లో నిరుపయోగంగా ఉన్న 18 వేల కిలోల వెండిని మింట్‌కు అప్పగించనున్నారు. తొలుత వేములవాడ దేవాలయం వెండిని బిస్కెట్లుగా మార్చే పనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ దేవాలయంలోని 800 కిలోల వెండికి బదులుగా మింట్ నుంచి దాదాపు 8 కిలోల బంగారు బిస్కెట్లు సమకూరుతాయని అంచనా. అలా అన్ని దేవాలయాల్లోని వెండి ద్వారా దాదాపు 180 కిలోల వరకు బంగారం సమకూరుతుందని భావిస్తున్నారు. అంటే వంద కిలోల వెండికి కిలో బంగారం వస్తుందన్నమాట. -
చిన్న పొదుపులు ఇప్పుడు ఓకేనా?
ఎన్నడూ లేని విధంగా, ఊహించని స్థాయిలో ఇటీవలే చిన్న మొత్తాల పొదుపు పథకాల (స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్) వడ్డీ రేట్లు గణనీయంగా కోతకు గురయ్యాయి. దేశంలో వడ్డీ రేట్లు అత్యంత కనిష్టాలకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల్లో వడ్డీ రేట్లను 2020–21 ఏప్రిల్–జూన్ త్రైమాసికి సవరించింది. ఇన్నాళ్లూ మెరుగైన వడ్డీ రేట్లతో చిన్న పొదుపు పథకాలు.. బ్యాంకు ఎఫ్డీలు, ఇతర స్థిరాదాయ పథకాలతో పోలిస్తే ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. వడ్డీ రేట్లను పరిశీలించినట్టయితే వివిధ పథకాల్లో 0.7% నుంచి 1.40% వరకు తగ్గించడం జరిగింది. కాకపోతే పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లపై వడ్డీ రేటు 4%లో ఎటువంటి మార్పు చేయలేదు. రేట్లు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ పథకాలను పెట్టుబడులకు పరిశీలించొచ్చా..? వీటిల్లో ఆకర్షణీయత ఇంకా మిగిలి ఉందా..? అన్న విషయమై నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందిస్తున్న ‘ప్రాఫిట్‌ప్లస్’ కథనం.. తాజా రేట్లు ఇవి.. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) రేటు ఎక్కువగా కోతకు గురైంది. ఇంతకుముందు వరకు 7.2 శాతం వడ్డీ రేటుతో ఈ పథకం ఆకర్షణీయంగా ఉండేది. తాజాగా 1.4 శాతం మేర తగ్గించడంతో 5.8 శాతానికి పరిమితమైంది. అలాగే ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కూడా 6.9 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించారు. ఐదేళ్ల టైమ్ డిపాజిట్ రేటు మాత్రం 7.7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది. వృద్ధులకు నిలకడైన ఆదాయాన్నిచ్చే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లోనూ వడ్డీ రేటును 8.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 1.1 శాతం తగ్గి 7.9 శాతం నుంచి 6.8 శాతానికి దిగొచ్చింది. సుకన్య సమృద్ధి యోజనలో 7.6 శాతంగా ఉంది. ఇక ఎంతో ప్రాచుర్యం పొందిన పీపీఎఫ్‌లో వడ్డీ రేటు సవరణ తర్వాత 7.1 శాతంగా ఉంది. పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో 6.6 శాతానికి, కిసాన్ వికాస్ పత్రలో వడ్డీ రేటు 6.9 శాతానికి తగ్గిపోయింది. ఒకేసారి తగ్గింపు ఇంతలా..? చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను ప్రభుత్వ సెక్యూరిటీల (జీ–సెక్) రేట్లకు అనుసంధానించాలన్నది కేంద్రం ఉద్దేశ్యం. అందుకే 2016 ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లను త్రైమాసికానికి ఒకసారి సవరించడాన్ని ఆరంభించింది. గత రెండేళ్లలో పదేళ్ల జీసెక్ ఈల్డ్స్ 2 శాతం తగ్గిపోయాయి. కానీ అదే స్థాయిలో చిన్న పొదుపు పథకాల రేట్లను తగ్గించలేదు. అలాగే, గత రెండు త్రైమాసికాల్లోనూ రేట్లను అసలు మార్చలేదు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును గణనీయంగా తగ్గించడంతో ప్రభుత్వం ఒకేవిడత ఈ స్థాయిలో రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని తీసుకుంది. ఈ రేట్లపై ఇన్వెస్ట్ చేయవచ్చా? మరి ఈ స్థాయిలో రేట్లు తగ్గిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం దండగా..? అన్న సందేహం రావచ్చు. ఈ పథకాలకు సంబంధించి చూడాల్సిన ప్రధాన అంశం.. పెట్టుబడులకు అత్యధిక భద్రత కలిగి ఉండడం. పైగా మార్కెట్ రిస్క్ లేని స్థిరాదాయ పథకాలు. అదే విధంగా చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లతో పోల్చి చూస్తే ఇప్పటికీ కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు ఆకర్షణీయంగానే ఉన్నాయి. ప్రముఖ బ్యాంకుల్లో టర్మ్ డిపాజిట్ రేట్లు 6–7 శాతం మధ్యే ఉన్నాయి. పైగా ఈ ఆదాయంపై ఆదాయపన్ను అమలవుతుంది. ఇటీవలే ఆర్బీఐ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించినందున బ్యాంకుల డిపాజిట్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎస్బీఐ ఇప్పటికే ఈ దిశగా నిర్ణయం కూడా తీసుకుంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ రేటు 7 శాతానికిపైనే ఉండడం గమనార్హం. ఎన్ఎస్సీ, కిసాన్ వికాస్ పత్ర 6.8 శాతం, 6.9 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈరేట్లు ఆకర్షణీయమేనని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్ల రేట్లు ఏమాత్రం ఆకర్షణీయంగానూ లేవన్నది నిజం. పన్ను ప్రయోజనాన్ని చూడాలి... భద్రతకుతోడు, ఆకర్షణీయమైన వడ్డీరేటుతోపాటు కొన్ని పథకాలపై పన్ను ప్రయోజనం కూడా పొందే అవకాశం వీటిల్లో ఉంది. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎస్సీఎస్ఎస్, సుకన్య సమృద్ధి యోజన, ఐదేళ్ల టైమ్ డిపాజిట్లో పెట్టుబడులు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా ప్రయోజనానికి అర్హమైనవి. అలాగే, పీపీఎఫ్, సుకన్య స్కీమ్‌లో మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదు. ఆ విధంగా చూసుకుంటే పన్ను ఆదాతో కూడిన అధిక రాబడులకు ఇందులో అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయాలు.. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలతోపాటు అధిక రాబడులను ఇచ్చే కొన్ని ఇతర పెట్టుబడి సాధనాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఆర్బీఐ జారీ చేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్లు ఒక చక్కని ప్రత్యామ్నాయం. వీటిల్లో రేటు 7.75 శాతంగా ఉంది. భద్రత ఎక్కువే. కాకపోతే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. అలాగే, కొన్ని ప్రైవేటు బ్యాంకులు సైతం డిపాజిట్లపై అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. డీసీబీ బ్యాంకు మూడేళ్ల డిపాజిట్‌పై 7.70 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 500 రోజుల డిపాజిట్‌పై 7.50 శాతం, ఆర్బీఎల్ బ్యాంకు రెండేళ్ల నుంచి మూడేళ్ల డిపాజిట్లపై 7.45 శాతం రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 8.25–9.50 శాతం మధ్యన ఉన్నాయి. బ్యాంకుల్లో ఒక డిపాజిట్‌దారునికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్‌పై బీమా ఉంటుంది. బ్యాంకు సంక్షోభంలో పడినా కానీ, ఆ మేరకు డిపాజిట్‌దారునికి లభిస్తుంది. కనుక వీటిని పరిశీలనలోకి తీసుకోవచ్చు. అయితే, బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆర్బీఐ రేట్లను గణనీయంగా తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు ఇంకా డిపాజిట్ రేట్లను సవరించాల్సి ఉంది. -
కొద్దికొద్దిగా... కొండంతగా..!
ఉమెన్ ఫైనాన్స్ / రికరింగ్ డిపాజిట్ పరుగెత్తి పాలు తాగటం కన్నా నెమ్మదిగా వెళ్లి నీళ్లు తాగటం మంచిది అనే నానుడి వినే ఉంటారు. చాలామంది తమ పిల్లలకు తమకు మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలనే కోరికతో చాలా కష్టపడి సొమ్మును కూడబెడుతూ ఉంటారు. ఆ సొమ్మును సరైన ప్రణాళిక లేకుండా త్వరగా పెద్ద మొత్తం అవ్వాలనే ఆశతో ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి మార్గాలలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి అనుకోని పరిస్థితుల కారణంగా మొదటకే మోసం జరగవచ్చు. అందుకే పెట్టుబడి పెట్టే మొత్తాన్ని ఒకే పొదుపు మార్గంలో కాకుండా కొన్నింటిని రిస్క్ తక్కువగా ఉండే వాటిలోను, మరికొంత మొత్తాన్ని కాస్త రిస్క్ భరించగలిగే సాధనంలో పెట్టుబడి పెడితే, అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటారు. రిస్క్ తక్కువగా ఉండి అతి తక్కువ మొత్తంతో మొదలు పెట్టుకొనే సాధనమే బ్యాంకువారు అందజేసే రికరింగ్ డిపాజిట్స్. ► ఈ రికరింగ్ డిపాజిట్‌ను నెలకు అతితక్కువ మొత్తమైన 100 రూ.తో మొదలుపెట్టవచ్చు. ► సాధారణంగా బ్యాంకులు 7 శాతం నుండి 8 శాతం వరకు వడ్డీని అందజేస్తున్నాయి. ► ఈ రికరింగ్ డిపాజిట్ కాల వ్యవధిని 6 నెలల నుండి 10 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. ► సీనియర్ సిటిజన్స్‌కి వడ్డీ రేటు 0.5 శాతం అదనంగా లభిస్తుంది. ► రికరింగ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ గనుక రూ. 10,000లు దాటితే టీడీఎస్ కట్ అవుతుంది. ► ఈ రికరింగ్ డిపాజిట్ మీద లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. {పతి నెలా తప్పనిసరిగా రికరింగ్ డిపాజిట్ ఎంత మొత్తానికైతే తీసుకుంటారో అంత మొత్తాన్ని బ్యాంకులో జమ చేయాలి. లేకపోతే పెనాల్టీ పడుతుంది. ► రికరింగ్ డిపాజిట్లో ఉన్న మొత్తానికి ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని లెక్కగడతారు. కొన్ని బ్యాంకులు ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా పెనాల్టీ వేయకుండా, సౌలభ్యం ఉన్నప్పుడు కట్టే విధంగా కూడా రికరింగ్ డిపాజిట్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ► బ్యాంకులు ఖాతాదారుల సేవింగ్స్ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా వారి రికరింగ్ ఖాతాకు ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ మొత్తాన్ని బదిలీ చేసే సౌకర్యాన్ని కూడా అందజేస్తున్నాయి. ► ఇలా అతి తక్కువ రిస్క్ కలిగి ఉండి తమకు వచ్చే సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాలకు సమకూర్చుకోవడానికి ఈ రికరింగ్ డిపాజిట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. -
పిల్లల ఇంజినీరింగ్ చదువు కోసం...
పొదుపు సలహా మాకు 5, 8 ఏళ్ల వయసు పిల్లలున్నారు. వాళ్ల పై చదువుల కోసమని ప్రతి నెలా చెరి ఐదువందలు ఆర్డీ (రికరింగ్ డిపాజిట్) కడుతున్నాను. ఈ ఆర్డీ ఇంకో రెండేళ్లలో పూర్తవుతుంది. ఆ వచ్చిన మొత్తాన్ని ఎందులో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ల ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులకు ఉపయోగపడుతుంది? - చందన, హైదరాబాద్ ఆర్డీ ఒక సాంప్రదాయిక పెట్టుబడి మార్గం. ఇది సురక్షితమైనదే. నష్టభయం ఉండదు. ప్రస్తుతం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఆర్డీపై దాదాపు 9 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి. అయితే దీనివల్ల దీర్ఘకాలిక ఖర్చులను ఎదుర్కోవ డం సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం ఇంజినీరింగ్, మెడిసిన్ ఓపెన్ కేటగిరీలో చదవాలంటే నాలుగేళ్లకు కలిపి ఒక్కొక్క పాపకు 4 లక్షలు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఐదేళ్ల పాపకు ఇంజినీరింగ్‌కు 12 ఏళ్లు, ఎనిమిదేళ్ల పాపకు తొమ్మిదేళ్ల వ్యవధి ఉంది. ప్రస్తుతం ఆరు శాతం ద్రవ్యోల్బణం ప్రకారం ఈ మొత్తం 12 సంవత్సరాలకు సుమారు 8 లక్షలు, తొమ్మిదేళ్లకు 7 లక్షలు అవుతాయి. కాబట్టి ఈ ఖర్చును దృష్టిలో ఉంచుకుని ఆర్డీని కొనసాగించండి. మరో చెరో రు. 1500 ఇప్పటి నుండి ఈక్విటీ గ్రోత్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతూ, రెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఆర్డీ మొత్తాన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు. - రజని భీమవరపు, సిఎఫ్‌పి, జెన్‌మనీ మీ ఆర్థిక, పొదుపు లక్ష్యాల సాధనలో ఎదురయ్యే సందేహాల నివృత్తికోసం, మీ సమస్యలను ఈ చిరునామాకు పంపించండి పొదుపు సలహా, కేరాఫ్ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34, aame.sakshi@gmail.com