ఎన్నడూ లేని విధంగా, ఊహించని స్థాయిలో ఇటీవలే చిన్న మొత్తాల పొదుపు పథకాల (స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్) వడ్డీ రేట్లు గణనీయంగా కోతకు గురయ్యాయి. దేశంలో వడ్డీ రేట్లు అత్యంత కనిష్టాలకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల్లో వడ్డీ రేట్లను 2020–21 ఏప్రిల్–జూన్ త్రైమాసికి సవరించింది. ఇన్నాళ్లూ మెరుగైన వడ్డీ రేట్లతో చిన్న పొదుపు పథకాలు.. బ్యాంకు ఎఫ్‌డీలు, ఇతర స్థిరాదాయ పథకాలతో పోలిస్తే ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. వడ్డీ రేట్లను పరిశీలించినట్టయితే వివిధ పథకాల్లో 0.7% నుంచి 1.40% వరకు తగ్గించడం జరిగింది. కాకపోతే పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లపై వడ్డీ రేటు 4%లో ఎటువంటి మార్పు చేయలేదు. రేట్లు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ పథకాలను పెట్టుబడులకు పరిశీలించొచ్చా..? వీటిల్లో ఆకర్షణీయత ఇంకా మిగిలి ఉందా..? అన్న విషయమై నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందిస్తున్న ‘ప్రాఫిట్‌ప్లస్’ కథనం..
తాజా రేట్లు ఇవి..
ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) రేటు ఎక్కువగా కోతకు గురైంది. ఇంతకుముందు వరకు 7.2 శాతం వడ్డీ రేటుతో ఈ పథకం ఆకర్షణీయంగా ఉండేది. తాజాగా 1.4 శాతం మేర తగ్గించడంతో 5.8 శాతానికి పరిమితమైంది. అలాగే ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కూడా 6.9 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించారు. ఐదేళ్ల టైమ్ డిపాజిట్ రేటు మాత్రం 7.7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది. వృద్ధులకు నిలకడైన ఆదాయాన్నిచ్చే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్)లోనూ వడ్డీ రేటును 8.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 1.1 శాతం తగ్గి 7.9 శాతం నుంచి 6.8 శాతానికి దిగొచ్చింది. సుకన్య సమృద్ధి యోజనలో 7.6 శాతంగా ఉంది. ఇక ఎంతో ప్రాచుర్యం పొందిన పీపీఎఫ్‌లో వడ్డీ రేటు సవరణ తర్వాత 7.1 శాతంగా ఉంది. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో 6.6 శాతానికి, కిసాన్ వికాస్ పత్రలో వడ్డీ రేటు 6.9 శాతానికి తగ్గిపోయింది.
ఒకేసారి తగ్గింపు ఇంతలా..?
చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను ప్రభుత్వ సెక్యూరిటీల (జీ–సెక్) రేట్లకు అనుసంధానించాలన్నది కేంద్రం ఉద్దేశ్యం. అందుకే 2016 ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లను త్రైమాసికానికి ఒకసారి సవరించడాన్ని ఆరంభించింది. గత రెండేళ్లలో పదేళ్ల జీసెక్ ఈల్డ్స్ 2 శాతం తగ్గిపోయాయి. కానీ అదే స్థాయిలో చిన్న పొదుపు పథకాల రేట్లను తగ్గించలేదు. అలాగే, గత రెండు త్రైమాసికాల్లోనూ రేట్లను అసలు మార్చలేదు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రెపో రేటును గణనీయంగా తగ్గించడంతో ప్రభుత్వం ఒకేవిడత ఈ స్థాయిలో రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని తీసుకుంది.
ఈ రేట్లపై ఇన్వెస్ట్ చేయవచ్చా?
మరి ఈ స్థాయిలో రేట్లు తగ్గిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం దండగా..? అన్న సందేహం రావచ్చు. ఈ పథకాలకు సంబంధించి చూడాల్సిన ప్రధాన అంశం.. పెట్టుబడులకు అత్యధిక భద్రత కలిగి ఉండడం. పైగా మార్కెట్ రిస్క్ లేని స్థిరాదాయ పథకాలు. అదే విధంగా చాలా బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లతో పోల్చి చూస్తే ఇప్పటికీ కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు ఆకర్షణీయంగానే ఉన్నాయి. ప్రముఖ బ్యాంకుల్లో టర్మ్ డిపాజిట్ రేట్లు 6–7 శాతం మధ్యే ఉన్నాయి. పైగా ఈ ఆదాయంపై ఆదాయపన్ను అమలవుతుంది. ఇటీవలే ఆర్‌బీఐ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించినందున బ్యాంకుల డిపాజిట్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎస్‌బీఐ ఇప్పటికే ఈ దిశగా నిర్ణయం కూడా తీసుకుంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ రేటు 7 శాతానికిపైనే ఉండడం గమనార్హం. ఎన్‌ఎస్‌సీ, కిసాన్ వికాస్ పత్ర 6.8 శాతం, 6.9 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈరేట్లు ఆకర్షణీయమేనని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్ల రేట్లు ఏమాత్రం ఆకర్షణీయంగానూ లేవన్నది నిజం.
పన్ను ప్రయోజనాన్ని చూడాలి...
భద్రతకుతోడు, ఆకర్షణీయమైన వడ్డీరేటుతోపాటు కొన్ని పథకాలపై పన్ను ప్రయోజనం కూడా పొందే అవకాశం వీటిల్లో ఉంది. పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, ఎస్‌సీఎస్‌ఎస్, సుకన్య సమృద్ధి యోజన, ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌లో పెట్టుబడులు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా ప్రయోజనానికి అర్హమైనవి. అలాగే, పీపీఎఫ్, సుకన్య స్కీమ్‌లో మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను ఉండదు. ఆ విధంగా చూసుకుంటే పన్ను ఆదాతో కూడిన అధిక రాబడులకు ఇందులో అవకాశం ఉంటుంది.
ప్రత్యామ్నాయాలు..
ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలతోపాటు అధిక రాబడులను ఇచ్చే కొన్ని ఇతర పెట్టుబడి సాధనాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఆర్‌బీఐ జారీ చేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్లు ఒక చక్కని ప్రత్యామ్నాయం. వీటిల్లో రేటు 7.75 శాతంగా ఉంది. భద్రత ఎక్కువే. కాకపోతే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. అలాగే, కొన్ని ప్రైవేటు బ్యాంకులు సైతం డిపాజిట్లపై అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. డీసీబీ బ్యాంకు మూడేళ్ల డిపాజిట్‌పై 7.70 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు 500 రోజుల డిపాజిట్‌పై 7.50 శాతం, ఆర్‌బీఎల్ బ్యాంకు రెండేళ్ల నుంచి మూడేళ్ల డిపాజిట్లపై 7.45 శాతం రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 8.25–9.50 శాతం మధ్యన ఉన్నాయి. బ్యాంకుల్లో ఒక డిపాజిట్‌దారునికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్‌పై బీమా ఉంటుంది. బ్యాంకు సంక్షోభంలో పడినా కానీ, ఆ మేరకు డిపాజిట్‌దారునికి లభిస్తుంది. కనుక వీటిని పరిశీలనలోకి తీసుకోవచ్చు. అయితే, బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఆర్‌బీఐ రేట్లను గణనీయంగా తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు ఇంకా డిపాజిట్ రేట్లను సవరించాల్సి ఉంది.
చిన్న పొదుపులు ఇప్పుడు ఓకేనా?
Published Mon, Apr 20 2020 4:15 AM | Last Updated on Mon, Apr 20 2020 4:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment