న్యూఢిల్లీ: చాలాకాలం తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్ తదితర పథకాల్లో డిపాజిట్లపై 0.30–0.40 శాతం వరకు పెంచింది. ఈ మేరకు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి అమల్లో ఉండే వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. ఇంత కాలం వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన కేంద్రం... ఆర్‌బీఐ కీలక రేట్లను పెంపు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకులు సైతం పలు డిపాజిట్లు, రుణాలపై రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటించాయి. చిన్న మొత్తాల పొదుపు, వృద్ధులు, ఆడపిల్లల సంక్షేమానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు రేట్లను సవరించింది. వాస్తవానికి 2012 ఏప్రిల్ 1 నుంచి వడ్డీ రేట్లు తగ్గుతూ వచ్చిన విషయం గమనార్హం.
నూతన రేట్లు
నూతన వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయి. ఈ సవరణ తర్వాత సుకన్య సమృద్ధి యోజన పథకంలో వడ్డీ రేటు 8.1 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ రేటు 8.3 శాతం నుంచి 8.7 శాతానికి చేరింది. పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ పథకాల్లో 7.6 శాతం నుంచి 8 శాతానికి, కిసాన్ వికాస్ పత్ర రేటు 7.3 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగాయి. దీంతో కిసాన్ వికాస్‌పత్ర పథకంలో ఇప్పటి వరకు డిపాజిట్ 118 నెలల్లో రెట్టింపు అవుతుండగా, 112 నెలలకు తగ్గింది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై రేటు 7.8 శాతానికి, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ రేటు 7.3 శాతానికి చేరాయి. పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్లపై మాత్రం వడ్డీ రేటు 4 శాతంగానే కొనసాగుతుంది. అలాగే, ఏడాది నుంచి మూడేళ్ల వరకు కాల వ్యవధి టైమ్ డిపాజిట్లపై 0.30 శాతం అధికంగా వడ్డీ రేటు లభించనుంది.
పొదుపును ప్రోత్సహించేందుకే: జైట్లీ
చిన్న మొత్తంలో పొదుపు చేసే వారిని ప్రోత్సహించేందుకే ఈ చర్య అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. ‘‘ఇది ఆడపిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహిస్తుంది. వృద్ధుల ఆర్థిక భద్రతను మెరుగుపరుస్తుంది’’ అని జైట్లీ పేర్కొన్నారు.
చిన్న మొత్తాల పొదుపు పథకాలకు మంచి రోజులు!
Published Fri, Sep 21 2018 12:33 AM | Last Updated on Fri, Sep 21 2018 12:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment