అల్ట్రాషార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్స్..
స్వల్పకాల పెట్టుబడులకు..
వీటి కాల పరిమితి సాధారణంగా ఏడాది అధిక ద్రవ్యలభ్యతే లక్ష్యం
నిర్దేశిత లక్ష్యాల సాకారం కోసం సరైన ఆర్థిక ప్రణాళికా వ్యూహరచన చాలా అవసరం. ఆర్థిక ప్రణాళికలను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిల్లో మార్కెట్ స్థితిగతులు, స్థూల, సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు ముందు వరుసలో ఉంటాయి. అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే దాని కోసం కొన్ని సార్లు స్థితప్రజ్ఞతను ప్రదర్శించాల్సి ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాలు ద్రవ్య విధానాన్ని (మానిటరీ పాలసీ) కఠినతరం చేస్తాయి. రూపాయి పతనం, బాండ్ రాబడి పెరుగుదల విషయాలు రేట్ల పెంపునకు ప్రతీకగా నిలుస్తాయి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎవరైనా తమ తమ పెట్టుబడులను సురక్షితమైన ప్రాంతంలో ఉంచాలని భావిస్తారు. ఉదాహరణకు మీరు 9 ఏళ్ల క్రితం ఒక ఇంటిని కొందామని భావిస్తారు. ఆ లక్ష్యంతోనే వివిధ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా మూలధనాన్ని సమకూర్చుకుంటారు. తీరా ఇక ఒక ఏడాదిలో ఇల్లు కొందామనుకుంటే.. అప్పటి నుంచే మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతుంది. వచ్చిన రాబడి మొత్తం పోతోంది. మన శ్రమ, కాలం, ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఇప్పుడు పరిస్థితేంటి? అల్ట్రా షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్స్ దీనికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.
అల్ట్రా షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్ అంటే?
మార్కెట్‌లో ప్రస్తుతం అనేక అల్ట్రా షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి తక్కువ అస్థిరత ఉన్న డెబ్ట్ స్కీమ్స్. మనం ఈ స్కీమ్స్‌ను ఎంచుకుంటే.. అంటే ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే.. మన డబ్బుల్ని ఈ స్కీమ్స్‌కు చెందిన ఫండ్ మేనేజర్స్ తక్కువ మెచ్యూరిటీ కాలపరిధి ఉన్న ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. మెచ్యూరిటీ సాధారణంగా ఏడాది కాలం ఉంటుంది. ఈ అల్ట్రా షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్ మేనేజర్లు వడ్డీ రేట్ల ఆధారంగా అప్పుడప్పుడు పోర్ట్‌ఫోలియోను మారుస్తారు కూడా. వడ్డీ రే ట్ల అస్థిరత ప్రభావం.. మధ్య, దీర్ఘకాల బాండ్ ఫండ్స్‌తో పోలిస్తే స్వల్పకాల బాండ్ ఫండ్స్‌పై తక్కువగా ఉంటుంది.
వీటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి?
మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, స్వల్ప కాలంలో రాబడి పొందాలనుకున్న వారికి అల్ట్రా షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అలాగే బైక్ కొనుగోలు వంటి తదితర స్వల్పకాల లక్ష్యాల సాకారానికి కూడా ఈ ఫండ్స్ బాసటగా నిలుస్తాయి. లిక్విడ్ ఫండ్స్‌తో పోలిస్తే అల్ట్రా షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్స్, ఫండ్ మేనేజర్లకు మూలధన ప్రమాదం లేకుండా పోర్ట్‌ఫోలియో ఏర్పాటు సౌలభ్యాన్ని అందిస్తాయి.
ప్రత్యేకతలు
►ఓపెన్ ఎండెడ్ స్కీమ్.
► ద్రవ్య లభ్యత అధికంగా ఉంటుంది.
►సహేతుకమైన రాబడి పొందొచ్చు.
► స్వల్పకాలం మాత్రమే ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి సరిపోతాయి.
► ఎక్కువ రిస్క్‌ను భరించలేని వారికి అనుగుణంగా ఉంటాయి.