ఆర్థిక అక్షరాస్యతలో అట్టడుగున
న్యూఢిల్లీ: దాదాపు 76 శాతం మంది భారతీయులకు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు వంటి కీలకమైన ఆర్థిక అంశాలపై అవగాహన లేదని రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ రేటింగ్స్ సర్వీసెస్ ఒక అధ్యయన నివేదికలో పేర్కొంది. వయోజనుల్లో ఆర్థిక అక్షరాస్యత అత్యధిక శాతం ఉన్న దేశాల్లో సింగపూర్ (59%) అగ్రస్థానంలో ఉండగా, హాంకాంగ్.. జపాన్‌లు (రెండూ 43 శాతం), తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
చైనా జనాభాలో మూడో వంతుకన్నా తక్కువ మంది వయోజనులకు (28%) మాత్రమే ఆర్థికాంశాలపై అవగాహన ఉంది. భారత్ విషయానికొస్తే 76ు మంది వయోజనులకు ద్రవ్యోల్బణం, చక్ర వడ్డీ వంటి ప్రాథమిక ఆర్థిక సూత్రాల గురించి తగినంత అవగాహన లేదని నివేదిక పేర్కొంది. ఆర్థిక అక్షరాస్యతలో ప్రపంచ దేశాల సగటు కన్నా ఇది తక్కువ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 66 శాతం మందికి ఆర్థికాంశాలపై అవగాహన లేదు.
ఈ విషయంలో దాదాపు ప్రతి దేశంలోనూ పురుషులు, మహిళల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 65 శాతం మంది పురుషులకు ఆర్థిక అక్షరాస్యత లేకపోగా, మహిళల్లో ఇది 70 శాతంగా ఉంది. భారత్‌లో ఇది మరింత ఎక్కువగా ఉంది. 73 శాతం మంది పురుషులకు, 80 శాతం మంది మహిళలకు ఆర్థిక అంశాలపై అంతగా అవగాహన లేదు.
సుమారు 140 దేశాల్లో నిర్వహించిన సర్వేలో 1.5 లక్షల మంది పాల్గొన్నారు. ప్రధానంగా రిస్కును తగ్గించుకునేలా వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం, ద్రవ్యోల్బణం, చక్ర వడ్డీ (పొదుపు, డెట్ సాధనాలు) మొదలైన అంశాలపై అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం ఆసియా దేశాల్లోని వయోజనుల్లో 75 శాతం మంది, అమెరికాలో 57 శాతం మంది, బ్రిటన్‌లో 67 శాతం మందికి ఆర్థిక అంశాలపై అవగాహన ఉంది. భారత్‌లో రిస్కు డైవర్సిఫికేషన్ విషయంలో 14 శాతం మంది, ద్రవ్యోల్బణంపై 56 శాతం మంది సరైన సమాధానం ఇవ్వగలిగారు.