మీ బ్యాంకును మారుస్తారా? | Change our bank? | Sakshi
Sakshi News home page

మీ బ్యాంకును మారుస్తారా?

Published Mon, Jan 11 2016 1:09 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

మీ బ్యాంకును మారుస్తారా? - Sakshi

మీ బ్యాంకును మారుస్తారా?

సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఈ నాలుగులో బాగున్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేతప్ప ఫ్లాప్ సినిమాకు వెళ్లాలని అనుకోరు. సినిమా బాగుందా? లేదా? అనే విషయం తొలి షో పడ్డ వెంటనే తెలిసిపోతుంది. ఇదంతా ఎందుకంటే... ఇదే విషయాన్ని మీ ఖాతా ఉన్న బ్యాంకులకూ వర్తింపజేసుకోండి. అంటే... ప్రస్తుతం చాలా బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. అలాగని అన్నింటి సేవలూ ఒకేలా ఉండవు. తేడాలుంటాయి. కొన్ని బ్యాంకులు మెరుగైన సేవలందిస్తే... మరికొన్ని ఒక మోస్తరు సేవలందిస్తూ ఉంటాయి. బ్యాంకుల సేవలు బ్రాంచీని బట్టి కూడా మారుతుంటాయి.

వడ్డీ రేట్లు, సేవలు బాగుంటే ఓకే
* పెనాల్టీల మోత ఎక్కువైతే మార్చాల్సిందే
* టెక్నాలజీపై దృష్టి లేకుంటే ఆలోచించక తప్పదు


మీరు ఖాతా నిర్వహిస్తున్న బ్యాంకు మంచిదా... కాదా? అనేది ఆ బ్యాంకు మీకు అందిస్తున్న సేవల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన సేవల్ని అందిస్తుంటే ఆ బ్యాంకును మంచి బ్యాంకుగా అనుకోవచ్చు. ఎందుకంటే బ్యాంకుల మూలధనం, లావాదేవీల విలువ వంటి అంశాలు సాధారణ ప్రజలకు పెద్దగా తెలియవు. అందుకే వారు ఈ అంశాల ప్రాతిపదికన కాకుండా వారు పొందే సేవల ఆధారంగా బ్యాంకులకు మార్కులు వేస్తారు.

ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ప్రతి ముగ్గురిలో ఒక కస్టమర్ తన బ్యాంకు సేవలపై అసంతృప్తిగా ఉన్నాడనే విషయం వెల్లడైంది. దీంతో బ్యాంకులను మార్చుకోవాలని భావిస్తున్న వారు చాలామందే ఉన్నట్టు వెల్లడయింది. మీరు కూడా ఆ వరుసలో ఉన్నారేమో తెలుసుకోవాలంటే... ఈ కింది అంశాలను ఒకసారి సరిచూసుకోండి.
 
మీ బ్యాంకు మీకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌ను సిఫార్సు చేసిందా?
బ్యాంకులు సాధారణంగా సేవింగ్స్ ఖాతాలు నిర్వహించటంతో పాటు రుణాలిస్తూ ఉంటాయి. పిక్స్‌డ్ డిపాజిట్లు, రెగ్యులర్ సేవింగ్స్ పథకాలను కాకుండా స్వీప్ ఇన్, స్వీప్ ఆప్ సర్వీసులు కూడా అం దిస్తుంటాయి. కొన్ని అందించవు. ఈ సేవలతోపాటు ఇన్వెస్ట్‌మెంట్/ ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లను కూడా సిఫార్సు చేస్తూ ఉంటాయి. ఇటీవల ‘ఎకనమిక్స్.కామ్’ నిర్వహించిన ఓ సర్వేలో బ్యాంకులు సిఫార్సు చేసే ప్రొడక్ట్స్ తమ అవసరాలకు అనుగుణంగా లేవని ప్రతి ఐదుగురిలో ముగ్గురు తెలిపారు. కొందరు ఇన్వెస్ట్‌మెంట్ సంబంధిత ఆర్థిక సలహాల కోసం బ్యాంకులను సంప్రదించినప్పుడు వాటిల్లో చాలా బ్యాంకులు సాంప్రదాయ ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలను తీసుకోవాలని సూచించాయి.

ఇవి తక్కువ రాబడులను అందించేవే. అనువుగాని పాలసీలను విక్రయించడం కూడా నేరమని, కస్టమర్లు దీనికి సంబంధించి న్యాయం పొందొచ్చనేది బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) చైర్మన్ ఏసీ మహజన్ మాట. మీకు గనక మీ బ్యాంకు అనువుకాని, సరిపోని ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తే మీరు ఆ బ్యాంకు నుంచి తప్పుకోవటమే మంచిది. ఎందుకంటే బాధాకరమైన బంధాన్ని కొనసాగించాలని ఎవ్వరూ కోరుకోరు. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ నివేదిక ప్రకారం... 2014-15లో బ్యాంకులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులు 11 శాతం పెరిగాయి. బీసీఎస్‌బీఐ నిర్వహించిన ఒక సర్వేలో 47 బ్యాంకుల్లో కేవలం 14 బ్యాంకులు మాత్రమే హై రేటింగ్‌ను పొందాయి. ఈ 14 బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు ఒకటి మాత్రమే ఉంది.
 
టెక్నాలజీలో ముందుందా?
ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి తదితర అంశాలకు సంబంధించిన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కస్టమర్లు బ్యాంకులకు వెళ్లడం చాలా తగ్గింది. టెక్నాలజీతో అన్నీ మారిపోయాయి. భౌతికంగా నగదు డిపాజిట్ చెయ్యటం, ఎఫ్‌డీలు చెయ్యటంతో పాటు డీడీ వంటివి కావాలనుకున్న కొన్ని సందర్భాల్లో తప్ప కస్టమర్లు బ్యాంకులకు వెళ్లడం లేదు. కొన్ని బ్యాంకులు మాత్రం టెక్నాలజీ వినియోగంలో వెనుకంజలో ఉన్నాయని చెప్పొచ్చు.

పదేపదే వెబ్‌సైట్ డౌన్ కావడం, ఏటీఎంలు ఎప్పుడూ మరమ్మతుల్లోనే ఉండటం, పొరపాటున ట్రాన్సాక్షన్ ఫెయిలైతే ఆ డబ్బు చాలా ఆలస్యంగా అకౌంట్లో జమ కావటం, వారాంతాల్లో నెట్ బ్యాంకింగ్ అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు కస్టమర్లకు చికాకు తెప్పిస్తున్నాయి. ఈ సమస్యలు మీకూ ఎదురయ్యాయేమో చూసుకోండి. టెక్నాలజీ విషయంలో సర్దుకొని పోవాల్సిన పనేమీ లేదు. మీ బ్యాంకులు ఈ విషయంలో వెనుకంజలో ఉంటే దాన్ని మార్చడంలో తప్పులేదు.
 
వడ్డీ రేట్ల సంగతేంటి?
ఒక వ్యక్తి బ్యాంకుకు కస్టమర్‌గా మారుతున్నాడంటే ఆ విషయంలో వడ్డీ రేట్లు కీలక పాత్ర పోషిస్తాయి. సేవింగ్ డిపాజిట్లకు సంబంధించి కొన్ని బ్యాంకులేమో 5-6 శాతం వడ్డీ రేటు ఇస్తుంటే.. కొన్నేమో 4 శాతమే ఇస్తున్నాయి. అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్స్ రేట్లు కూడా వేరుగా ఉంటాయి. కొన్ని బ్యాంకులేమో అవి ఇచ్చే రుణాలపై అధిక వడ్డీ రేట్లను విధిస్తుంటాయి. ఒక బ్యాంకుతో మరొకదాన్ని పోల్చి చూసుకోండి. ఎక్కడ మీకు అనువైన వడ్డీ రేట్ల ఉంటే ఆ బ్యాంకు కస్టమర్‌గా కొనసాగండి. కొన్ని బ్యాంకులు ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించడంలోనూ వెనుకంజలో ఉన్నాయి. వాటిపై కన్నేయండి.
 
అధిక చార్జీలు, పెనాల్టీలు
బ్యాంకులు వాటి సేవల మీద కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంటాయి. అలాగే మనకు తెలియని చార్జీల్ని కూడా వసూలు చేస్తుంటాయి. క్యాష్ విత్ డ్రాయల్స్‌పై సర్వీస్ చార్జ్ చెల్లింపులు మనకు తె లియకుండానే జరిగిపోతుంటాయి. అలాగే క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనప్పుడు, ఇతర చెల్లింపుల జాప్యాల విషయంలోనూ కొన్ని బ్యాంకులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే చార్జ్ చేస్తూ ఉంటాయి. నిజానికి క్రెడిట్ కార్డు చెల్లింపులు 3 రోజుల ఆలస్యమైతే పెనాల్టీలను వసూలు చేయరాదని ఆర్‌బీఐ పేర్కొంది. కానీ బ్యాంకులు మాత్రం వాటి పని అవి చేసుకొని పోతున్నాయి. నెలలో ఏటీఎం విత్‌డ్రాయల్స్ పరిమితి దాటినా కూడా అదనపు చార్జీలను కట్టాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement