పెట్టు‘బడి’లో పాఠాలివీ..!
ఇప్పటి పరిస్థితుల్లో ఆర్థిక భద్రత అనేది చాలా ముఖ్యం. కానీ ఇది చక్కటి ఆర్థిక ప్రణాళిక ఉంటేనే సాధ్యమవుతుంది. జీవిత కాలం కష్టపడి సంపాదించిన మొత్తాన్ని చక్కటి ఆర్థిక ప్రణాళికలతో పొదుపు చేస్తే భవిష్యత్తు అవసరాలకు తగినంత నిధిని సమకూర్చుకోవచ్చు. కానీ మనలో చాలామంది ఖర్చు చేసేటప్పుడు అది చిన్న మొత్తమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. అంతెందుకు! కిలో టమాటాలు కొనేటపుడు కూడా గీచి గీచి బేరం చేస్తారు.
* ఇన్వెస్ట్‌మెంట్లకు అనేక మార్గాలు
* వయసు, రిస్కును బట్టే ఎంపిక
* మీ లక్ష్యాన్ని తెలుసుకుంటే మేలు
అదే ఇన్వెస్ట్‌మెంట్ విషయానికి వచ్చేసరికి ఉన్నత విద్యావంతులు సైతం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కష్టపడి చమటోడ్చి సంపాదించిన మొత్తాన్ని కూడా అన్ని విషయాలను పరిశీలించకుండా ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడా విషయాలను పరిశీలిద్దాం...
ఆర్థిక లక్ష్యాలు ప్రధానం..
ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకునేటప్పుడు అనేక అంశాలు చూడాలి. వీటిలో ఆర్థిక లక్ష్యాలనేవి అన్నిటికంటే ప్రధానం. సొంత ఇంటిని కట్టుకోవాలనుకోవడం, కారు కొనుక్కోవడం, పిల్లల చదువు, పెళ్లిళ్లకు కావాల్సిన మొత్తం సమకూర్చుకోవడం, రిటైర్మెంట్, తనపై ఆధారపడి జీవిస్తున్న వారి అవసరాలు తీర్చడం... ఇలా అనేక లక్ష్యాలుంటాయి. వీటిలో మీ లక్ష్యమేంటో నిర్ణయించుకొని... దాన్ని చేరుకోవడానికి ఎంత కాలం పడుతుందో నిర్ణయించుకొని మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్ పథకాలను ఎంచుకోవాలి.
చిన్న వయసులోనే ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే... షేర్లు, ఈక్విటీ ఫండ్స్ వంటి అధిక రిస్క్ ఉండే వాటిని ఎంచుకోవచ్చు. అదే వయసు పైబడుతున్న కొద్దీ.. రిస్క్ తక్కువగా ఉండే డెట్ ఫండ్స్, బ్యాంక్ డిపాజిట్లు వంటివి అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు కుటుంబానికి తగినంత జీవిత, ఆరోగ్య బీమా ఉండే విధంగా చూసుకోవాలి.
దాచుకోవడానికి అనేకం..
* ఇన్వెస్టర్లు దాచుకోవడానికి అనేక పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి..
* బ్యాంకు డిపాజిట్లు, ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు, ఎఫ్‌సీఎన్‌ఆర్, ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌వో ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిట్లు, ప్రైవేటు కంపెనీల డిపాజిట్లు.
* నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్
* బంగారం వంటి ఖరీదైన లోహాలు
* నేషనల్ పెన్షన్ సిస్టమ్
* పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, పోస్టాఫీస్ డిపాజిట్లు
* స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు
* రియల్ ఎస్టేట్
వీటిల్లో బ్యాంకులు, ఇతర డిపాజిట్లు, పీపీఎఫ్, ఎన్‌ఎస్‌లు చాలా తక్కువ రిస్క్ కలిగిన పెట్టుబడి సాధనాలుగా చెప్పవచ్చు. కానీ ఇదే సమయంలో ఇవి అందించే రాబడులు కూడా స్వల్పంగానే ఉంటాయి. అదే షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తాయి కానీ.. స్వల్ప కాలానికి చాలా రిస్క్‌తో కూడుకున్నవి. 200 ఏళ్ల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఇతర పెట్టుబడి సాధనాలను మించి ఈక్విటీలు అధిక రాబడిని అందించాయి.
1980లో ఒక లక్ష రూపాయలు బ్యాంకులో, మరో లక్ష రూపాయలు సెన్సెక్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తం విలువ రూ.15 లక్షలు ఉంటే, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన విలువ రూ. 25 (డివిడెండ్లు కాకుండా) లక్షలయ్యింది. అన్నిటికంటే ఈక్విటీ పెట్టుబడుల్లో ఉన్న ప్రధానమైన ఆకర్షణ ఏమిటంటే... పన్ను ప్రయోజనాలు. ఇవి అందించే రాబడులు, డివిడెండ్లపై ఎటువంటి పన్ను భారం ఉండదు. ఈక్విటీల్లో ఏడాది దాటి ఇన్వెస్ట్ చేసి ఉంటే దీర్ఘకాలిక మూల ధన పన్ను నుండి మినహాయింపు లభిస్తుంది.
ఇవన్నీ లభిస్తాయా?..
ఏదైనా పథకంలో ఇన్వెస్ట్ చేసేముందు మదుపుదారులు చాలా ఆశిస్తుంటారు. ఆ పెట్టుబడిపై క్రమం తప్పకుండా రాబడి రావాలని, ఇన్వెస్ట్ చేసిన ఆస్తుల విలువ పెరగాలని, అవసరానికి కావల్సినప్పుడు వైదొలిగే విధంగా లిక్విడిటీ ఉండాలని, పెట్టిన పెట్టుబడికి పూర్తి రక్షణ ఉండాలని, పన్ను రాయితీలు లభించాలని... ఇలా అనేకం ఆశిస్తుంటారు. కానీ ప్రతి ఇన్వెస్ట్‌మెంట్ సాధనమూ వీటన్నిటినీ అందించలేదు. బ్యాంకు డిపాజిట్లు క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తాయి. కానీ ఇన్వెస్ట్ చేసిన అసలు వృద్ధి చెందదు.
దీర్ఘకాలంలో బంగారం రాబడిని అందించ గలదు. కానీ లిక్విడిటీ, పన్ను ప్రయోజనాలు లభించవు. ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే కావల్సినప్పుడు వెంటనే వెనక్కి తీసుకునే వెసులుబాటుండదు. కాని చక్కటి షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా పైన పేర్కొన్న ప్రయోజనాలన్నీ పొందవచ్చు. అయితే స్వల్ప కాలానికి ఈక్విటీ పెట్టుబడులు చాలా రిస్క్‌తో కూడుకున్నవి.
రిస్క్ ఆధారంగానే నిర్ణయం..
వయసుతో బాటు బాధ్యతలు పెరగడంతో రిస్క్ సామర్థ్యం (నష్టాన్ని భరించే) తగ్గుతుంది. కాబట్టి ఏ మేరకు రిస్క్ చేయగలరనేది మీ వయసుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 35 ఏళ్లలోపు ఉన్న వారు ఎక్కువ రిస్క్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోను తయారు చేసుకోవచ్చు. అదే 35 నుంచి 50 ఏళ్ల లోపు వారు సమతూకం పాటిస్తూ బ్యాలెన్స్‌డ్‌గా వెళ్లాలి. 50 ఏళ్లు దాటితే ఇక రిటైర్మెంట్‌కు దగ్గర అవుతారు కాబట్టి ఇక రిస్క్‌లేకుండా పోర్ట్‌ఫోలియోను తయారు చేసుకోవాలి. పోర్ట్‌ఫోలియో ఏ విధంగా ఉండాలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది.
- డాక్టర్. వి.కె.విజయ్‌కుమార్
ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్