పెట్టుబడులపై రిస్క్‌కు భయపడేవారు, డెట్ సాధనాల్లోనూ కాస్తంత సురక్షితమైన సాధనం కోసం చూసే వారు ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్–సూపర్ ఇనిస్టిట్యూషనల్ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. అధిక రేటింగ్ కలిగిన షార్ట్ టర్మ్ డెట్ ఇనుస్ట్రుమెంట్లలో పెట్టుబడులు పెడుతుంది. మనీ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్లు, కమర్షియల్ పేపర్లు పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ వాటాను ఆక్రమిస్తాయి. ఈ కేటగిరీలో గత పదేళ్ల కాలంలో టాప్ పథకాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. ఇందులో రాబడులను చూసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఏడాది కాలంలో బెంచ్ మార్క్ (క్రిసిల్ లిక్విడిటీ ఫండ్ ఇండెక్స్) రాబడులు 7.2%గా ఉంటే ఈ పథకంలో 7.5%గా ఉన్నాయి. అలాగే, ఈ పథకంలో మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు 8.7%, ఐదేళ్లలో వార్షిక రాబడులు 9.2%గా ఉన్నాయి. కేటగిరీ రాబడులు మూడేళ్లలో 7.2%, ఐదేళ్లలో 7.9% ఉండడం గమనార్హం. కేటగిరీతో పోలి స్తే దీర్ఘకాలంలో 1.5% అధిక రాబడులను ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్ ఇచ్చింది.
ఎక్కువ సమయాల్లో బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రాబడులను అందించిన చరిత్ర ఉంది. కనుక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునేవారు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆ మొత్తంపై మంచి రాబడులను పొందొచ్చు. ఇక ఐదేళ్లు, పదేళ్ల కాలంలో మెరుగైన రాబడుల దృష్ట్యా దీర్ఘకాల అవసరాలకు ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారికి ఈ పథకం అనువే. ఎందుకంటే డైనమిక్ బాండ్ లేదా క్రెడిట్‌రిస్క్ ఫండ్స్ కంటే ఇందులోనే రాబడులు అధికంగా ఉన్నాయి.
పోర్ట్‌ఫోలియో
పేరులో ఉన్నట్టు... ఏడాదిలోపు కాల వ్యవధి తీరే సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. పోర్ట్‌ఫోలియో ఈల్డ్‌ను కొన్నేళ్లుగా 8.5–8.7% మధ్య ఉండేలా చూస్తోంది. ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్ తన పెట్టుబడుల్లో సగం మేర స్వల్ప కాల సాధనాలకు టాప్ రేటింగ్ అయిన ఏ1ప్లస్ వాటిల్లోనే ఇన్వెస్ట్ చేసింది. యాక్సిస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు సర్టి ఫికేట్ డిపాజిట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, నాబార్డ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కమర్షియల్ పేపర్లు, ఐఆర్‌ఎఫ్‌సీ, రెన్యూ పవర్ తదితర కంపెనీల కార్పొరేట్ డెట్ సాధనాల్లో ఈ పథకం పెట్టుబడులు ఉన్నాయి.
ఇటీవల రేటింగ్ స్వల్పంగా తగ్గిన సాధనాల్లోనూ పెట్టుబడులు కలిగి ఉంది. కాకపోతే వీటి వెనుక పెద్ద వ్యాపార గ్రూపులు ఉన్నాయి. పిరమల్ రియాలిటీ, టాటా మోటార్స్, రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ ఇందుకు ఉదాహరణలు. మొత్తం మీద 75–80 వరకు భిన్న సంస్థల సెక్యూరిటీల్లో పెట్టుబడులు కలిగి ఉంది. నిజానికి అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను స్వల్ప కాలం కోసమే సూచిస్తుంటారు. అయితే, దీర్ఘకాలంలో రాబడులు మెరుగ్గా ఉన్నప్పుడు దీర్ఘకాల అవసరాలకు కూడా వీటిని ఎంచుకోవడం తప్పేమీ కాదు.
Comments
Please login to add a commentAdd a comment