సురక్షిత.. శాశ్వత.. పోర్ట్‌ఫోలియో! | Permanent portfolio | Sakshi
Sakshi News home page

సురక్షిత.. శాశ్వత.. పోర్ట్‌ఫోలియో!

Published Mon, Feb 12 2018 12:06 AM | Last Updated on Mon, Feb 12 2018 8:28 AM

Permanent portfolio - Sakshi

మెరుగైన రాబడుల కోసం వ్యూహాత్మక అలోకేషన్‌తోపాటు, ట్యాక్టికల్‌ అలోకేషన్‌ను కూడా ఇన్వెస్టర్లు అనుసరిస్తుంటారు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా కేటాయింపులను వివిధ సాధనాల మధ్య మార్పు చేస్తుంటారు. అయితే, ఇది సరిగ్గా చేస్తేనే ఇన్వెస్టర్లకు ప్రయోజనం కలుగుతుంది. ఇందుకు ఉదాహరణ మార్కెట్‌ విలువలు తక్కువగా ఉన్నప్పుడు ఈక్విటీలకు నిధుల కేటాయింపును పెంచడం, మార్కెట్‌ విలువలు అధిక స్థాయికి చేరినప్పుడు ఈక్విటీల్లో పెట్టుబడులు తగ్గించుకోవడం వల్ల మంచి రాబడులు అందుకోవచ్చు.

అయితే, ట్యాక్టికల్‌ అలోకేషన్‌లో పెట్టుబడుల కేటాయింపులు అన్నవి ఎక్కువ సార్లు మార్కెట్‌ సెంటిమెంట్‌ ఆధారంగా ఉంటాయి. దాంతో అది తప్పుడు ఎంపిక అవుతుంది. బేర్‌ మార్కెట్లో రిస్క్‌ను భరించలేని ఇన్వెస్టర్లు బుల్‌ మార్కెట్లో రిస్క్‌ తీసుకోవడం గమనించొచ్చు. ‘‘అధిక వ్యాల్యూషన్లు ఉన్నప్పుడు సహజంగా ఎక్స్‌పోజర్‌ తగ్గించుకోవాల్సింది పోయి ఇతర సాధనాల నుంచి మరిన్ని నిధులను ఈక్విటీ వైపు మళ్లిస్తుంటారు’’ అని అవుట్‌లుక్‌ ఏషియా క్యాపిటల్‌ సీఈవో మనోజ్‌ నాగ్‌పాల్‌ పేర్కొన్నారు.

రిస్క్‌ తగ్గించుకోవాలని అనుకుంటున్నవారు, శాశ్వత పోర్ట్‌ఫోలియోను అనుసరించడం ద్వారా మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా నిధుల కేటాయింపుల్లో మార్పులు చేసుకునే అవసరం ఉండదు. నాలుగు ప్రధాన సాధనాల్లో... ఈక్విటీ, ప్రభుత్వ డెట్, బంగారం, నగదు వీటిలో సమాన భాగాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా శాశ్వత పోర్ట్‌ఫోలియో ఏర్పడినట్టు అవుతుంది.  

ఉపయోగాలు
పర్మినెంట్‌ పోర్ట్‌ఫోలియో విధానాన్ని ఆవిష్కరించిన వ్యక్తి అనలిస్ట్‌ హ్యారీ బ్రౌనే. ‘ఫెయిల్‌ సేఫ్‌ ఇన్వెస్టింగ్‌’ అనే పుస్తకంలో తొలిసారిగా పేర్కొన్నారు. ఈ విధానంలో ఒక విభాగంలో మార్కెట్‌ పరిస్థితుల వల్ల విలువ క్షీణిస్తే, అదే సమయంలో మరో విభాగంలో పెరుగుదల కారణంగా పెట్టుబడుల విలువ పడిపోకుండా కాపాడుతుంది. ఉదాహరణకు ఆర్థిక రంగం మంచి ఊపు మీద ఉన్నప్పుడు ఈక్విటీలు బాగా రాణిస్తాయి. అదే సంక్షోభంలో ఇవి వెలుగులు కోల్పోతాయి. ప్రభుత్వ బాండ్లు సంక్షోభంలో మంచిగా రాణిస్తాయి.

వడ్డీ రేట్లు తగ్గి బాండ్ల ధరలు పెరుగుతాయి కనుక. అదే సమయంలో ఆర్థిక రంగం బూమ్‌ మీదున్న సమయంలో ప్రభుత్వ బాండ్లు అంతగా రాణించవు. ఇందుకు నిదర్శనం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్స్‌ 2008 సంక్షోభ సమయంలో 55.38 శాతం పతనం అయితే, దీర్ఘకాల గిల్ట్‌ ఫండ్స్‌ (ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసేవి) 26 శాతం పెరిగాయి. ఇతర సాధనాలతో పోలిస్తే బంగారం భిన్నంగానే ఉంది. ఇది పర్మినెంట్‌ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని ఇచ్చేది. ఆకస్మిక అంతర్జాతీయ పరిణామాల నుంచి రక్షణనిస్తుంది. అంతర్జాతీయంగా ఏవైనా ప్రతికూల పరిణామాల్లో బంగారం మినహా ఇతర సాధనాల్లో ఆటుపోట్లు ఉంటాయి.

రూపాయి తరుగుదల ప్రభావాన్ని బంగారం కాచుకోగలదు. 2008లో ఈక్విటీలు 55.38శాతం పతనమైనప్పటికీ దేశీయంగా బంగారం 14.35శాతం రాబడులను ఇచ్చింది. మొత్తం మీద నాటి సంక్షోభ ఏడాదిలో పర్మినెంట్‌ పోర్ట్‌ఫోలియోను గమనిస్తే కేవలం 1.55 శాతం నష్టాలకే  పరిమితమైంది. ప్రభుత్వ బాండ్లు, బంగారమే పెట్టుబడుల విలువ హరించుకుపోకుండా కాపాడాయి.  అదే 2009 సంవత్సరాన్ని గమనిస్తే ఈ పెట్టుబడి సాధనాల రాబడులు మారిపోయాయి. ఈక్విటీలు 88 శాతం రాబడులను ఇచ్చాయి.

ప్రభుత్వ బాండ్లపై రాబడులు పెరిగిపోవడంతో బాండ్ల ధరలు తగ్గిపోయాయి. దీంతో గిల్ట్‌ ఫండ్స్‌లో 6.31 శాతం ప్రతికూల రాబడులు (నష్టాలు) నమోదయ్యాయి. ప్రభుత్వ డెట్‌ అన్నది పూర్తిగా సురక్షితం అన్న నమ్మకాన్ని పోగొట్టింది ఆ సంవత్సరమే. ప్రభుత్వ సెక్యూరిటీలు అన్నవి తిరిగి చెల్లింపుల ఎగవేతల పరంగా రిస్క్‌ లేనివి. అంతేకానీ, రాబడులు ప్రతికూలంగా ఉండవని ఏమీలేదు.

కాకపోతే 2009లో ఈక్విటీ, బంగారం కారణంగా పర్మినెంట్‌ పోర్ట్‌ఫోలియో రాబడులు 29.7%గా నమోదయ్యా యి. నగదు విభాగం ఒక్కటే ఇన్నేళ్ల కాలంలో స్థిరంగా కొనసాగింది. స్వల్పకాలిక రేట్లు పెరిగినప్పుడు లబ్ధి కూడా పొందింది. 2013లో లిక్విడ్‌ ఫండ్‌ అనేది మంచి పనితీరు చూపించిన సాధనం. ఆ ఏడాదిలో 9.08% వృద్ధి చెందింది. అందుకే పర్మినెంట్‌ పోర్ట్‌ఫోలియోలో ఇది చేర్చతగింది. ఎందుకంటే నగదుకు కటకట ఏర్పడినప్పుడూ ఇది ఆదుకుంటుంది.

రాబడులు
శాశ్వత పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను గణనీయంగా తగ్గించేస్తుంది. అయితే, ఇన్వెస్టర్లు మోస్తరు రాబడులతో సంతృప్తి చెందేవారై ఉండాలి. ఇది చాలా సులభ మోడల్‌ అని, సగటు రాబడులే వస్తాయని నాగ్‌పాల్‌ తెలిపారు. అందరూ అత్యాధునిక విధానాలను ఆచరణలో పెట్టి, అధిక రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉండరు. పెట్టుడులకు నిధుల కేటాయింపు ఏ విధంగా చేయాలన్న విషయంలో అవగాహన లేని వారికి పర్మినెంట్‌ పోర్ట్‌ఫోలియో ఉపయోగకరంగా ఉంటుందని సెబీ నమోదిత పెట్టుబడుల సలహాదారు విక్రమ్‌ కృష్ణమూర్తి తెలిపారు.

కనుక పెట్టుబడుల గురించి పెద్దగా తెలియని వారు, తక్కువ రిస్క్‌తో మోస్తరు రాబడులు వచ్చినా, ఫర్వాలేదనుకునే వారు పర్మినెంట్‌ పోర్ట్‌ఫోలియోను నిశ్చింతగా ఆచరణలో పెట్టుకోవచ్చు. ఈ విధానాన్ని ఆచరణలో పెట్టేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రతీ నెలా పెట్టుబడులకు అందుబాటులో ఉన్న నిధుల నుంచి 25 శాతాన్ని ఒక్కో పెట్టుబడుల విభాగంలో ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లడం. ఏటా నిధుల కేటాయింపుల్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు.

ఒకవేళ పెట్టుబడుల గురించి తగిన అవగాహన ఉంటే వార్షికంగా పర్మినెంట్‌ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలన్స్‌ చేసుకోవచ్చు. ఇక, సొంతంగా పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోలేని వారు రెడీమేడ్‌గా ఇన్వెస్ట్‌ చేసుకోవడమే. యాక్సిస్‌ ట్రిపుల్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ఎంచుకుంటే ఇది ఈక్విటీ, డెట్, బంగారంలో సమ భాగాలుగా ఇన్వెస్ట్‌ చేస్తుంది. రిస్క్‌ తక్కువగా ఉండడం ప్రధాన ఆకర్షణ. యాక్సిస్‌ ట్రిపుల్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ఏడేళ్ల వార్షిక వృద్ధి 7.41 శాతంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement