ఒక మ్యూచువల్ ఫండ్ పథకం రెగ్యులర్ ప్లాన్‌కు, డైరెక్ట్ ప్లాన్‌కు వేర్వేరు రేటింగ్‌ను ఎలా కలిగి ఉంటాయి?– ఆర్ణబ్
ఒక విభాగంలో పోటీ పథకాలతో పోలిస్తే రిస్క్‌ను సర్దుబాటు చేసుకుని ఇచ్చే రాబడులకు సంబంధించి పరిమాణాత్మక కొలమానమే రేటింగ్. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. డైరెక్ట్ ప్లాన్‌ను.. ఇతర పథకాల్లోని డైరెక్ట్ ప్లాన్లతోనే పోల్చి చూడడం జరుగుతుంది. అలాగే, రెగ్యులర్ ప్లాన్లను ఇతర పథకాల రెగ్యులర్ ప్లాన్లతోనే పోల్చి చూస్తారు. డైరెక్ట్ ప్లాన్‌కు, రెగ్యులర్ ప్లాన్‌కు మధ్య రేటింగ్ వేర్వేరుగా ఉండడానికి కారణం.. ఎక్స్‌పెన్స్ రేషియోనే. రెగ్యులర్ ప్లాన్లలో పోటీ పథకాలతో పోలిస్తే ర్యాంకు తక్కువగాను, సగటు కంటే తక్కువగా ఉండడం అన్నది అసాధారణం, అరుదైనదేమీ కాదు. అందుకనే మ్యూచువల్ ఫండ్ పథకం ఎంపికలో ఎక్స్‌పెన్స్ రేషియోకు అంత ప్రాధాన్యం ఉంటుంది. అందులోనూ డెట్ ఫండ్‌లో అయితే ఎక్స్‌పెన్స్ రేషియోకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.
నా వయసు 20 ఏళ్లు. పదవీ విరమణ తర్వాతి జీవితం కోసం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో 40 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను? ఇందుకు అనుసరించే వ్యూహం ఎలా ఉండాలి? – శ్రీజన్‌సింగ్
కచ్చితమైన ప్రణాళిక గురించి మీరు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సిప్ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించడమే ఇప్పుడు కీలకమైనది. మీకు పన్ను చెల్లించే ఆదాయం ఉండి ఉంటే.. అప్పుడు ఒకటి లేదా రెండు మంచి ఈఎల్‌ఎస్‌ఎస్ (ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పన్ను ఆదా సాధనాలు) ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఒకవేళ పన్ను చెల్లించేంత ఆదాయం లేకపోతే కనుక మంచి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో సిప్‌ను మొదలు పెట్టొచ్చు. ఈ వయసులో ఎంతో క్రమశిక్షణగా మెలుగుతూ మార్కెట్లు పెరిగిన సమయాల్లో, పడిన సమయాల్లోనూ సిప్‌ను కొనసాగించడం ఎంతో ముఖ్యమైనది అవుతుంది. సిప్ ప్రారంభంలో కొంత కాలం పాటు రాబడులు మీ అంచనాల స్థాయిలో ఉండకపోవచ్చు. అయినప్పటికీ అది మీ పెట్టుబడులకు అవరోధంగా మారకుండా చూసుకోవాలి. పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉండాలి. అదే విధంగా పెరుగుతున్న మీ ఆదాయానికి అనుగుణంగా సిప్ మొత్తాన్ని కూడా ఏటేటా పెంచుకుంటూ వెళ్లాలి.
నేను ఒకే ఈక్విటీ ఫండ్‌లో సిప్ రూపంలో రూ.20,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. వివిధ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మధ్య ఈ మొత్తాన్ని వైవిధ్యం చేసుకోవాలా? లేదంటే ఇప్పటి మాదిరే కొనసాగాలా? ఇందులో ఉండే లాభ, నష్టాల మాటేమిటి? – హేమంత్
వైవిధ్యం అవసరం ఎంతో ఉంది. కనీసం మరొక మ్యూచువల్ ఫండ్ సంస్థకు సంబంధించిన వేరొక పథకానికి అయినా మీ పోర్ట్‌ఫోలియోలో చోటివ్వాల్సిందే. అలా కాకుండా ఇప్పటి మాదిరే అదే పథకంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారనుకుంటే.. అప్పుడు ఆ పథకం విషయంలో ఏదైనా అనుకోని పరిణామం తలెత్తితే రాబడులన్నీ రిస్క్‌లో పడినట్టు అవుతుంది. వైవిధ్యంలో భాగంగా కనీసం మరొక పథకానికి (వేరే ఫండ్ సంస్థకు సంబంధించి) మీ పోర్ట్‌ఫోలియోలో చోటివ్వాలి. వైవిధ్యం విషయంలో అతిగా వ్యవహరించకుండా (మితిమీరిన వైవిధ్యం) ఉంటే ఇందులో వచ్చే నష్టం ఏమీ ఉండదు. మీరు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న పథకం తర్వాతి కాలంలో అద్భుతమైన పనితీరును చూపించొచ్చు. అప్పుడు పెట్టుబడులను వైవిధ్యం చేసుకుని తప్పు చేశామా? అన్న సందేహం రావచ్చు. కానీ, అలా ఆలోచించడం సరైనది కాదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కనుక వైవిధ్యంలో భాగంగా కనీసం మరొక పథకాన్ని ఎంపిక చేసుకోండి.
- ధీరేంద్రకుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment