డిపాజిటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినూత్న ప్రొడక్టులను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తోంది. రికరింగ్ డిపాజిట్– క్రమానుగత పెట్టుబడి విధానం (ఎస్‌ఐపీ) కాంబో ప్రొడక్ట్‌సహా వినూత్నమైన ఉత్పత్తులను తీసుకురావాలని యోచిస్తున్నట్లు బ్యాంక్ ఛైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నందున కస్టమర్లు ఆర్థికంగా మరింత అవగాహనతో వ్యవహరిస్తున్నారని, వ్యవస్థలో డిమాండ్ ఉందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో వారు వినూత్న పెట్టుబడి సాధనాల కోసం వెతకడం ప్రారంభించారని కూడా తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.
ఆర్థిక అక్షరాస్యత మెరుగుపడటంతో కస్టమర్లు తమ పెట్టుబడులపై అధిక రాబడుల గురించి ఆలోచిస్తున్నారు. ఆ మేరకు పోర్ట్‌ఫోలియో రూపకల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
సహజంగానే ఎవరూ ప్రతి రూపాయినీ ప్రమాదకర లేదా ఊహాజనిత ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉంచాలని కోరుకోరు. బ్యాంకింగ్ ప్రొడక్టులు ఎల్లప్పుడూ పోర్ట్‌ఫోలియోలో భాగమే. కాబట్టి మేము వారికి నచ్చే ఉత్పత్తులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.
రికరింగ్ డిపాజిట్ వంటి కొన్ని సంప్రదాయ ప్రొడక్టుల్లో కొత్త విధానాలు తీసుకురావాలని యోచిస్తున్నాం. ఫిక్స్‌డ్ డిపాజిట్/ రికరింగ్ డిపాజిట్–ఎస్‌ఐపీను డిజిటల్‌గా యాక్సెస్ చేయగల కాంబో ప్రోడక్ట్‌గా రూపొందించాలనే ప్రతిపాదనలున్నాయి.
తాజా ప్రొడక్టులు జన్ జెడ్‌లో (12 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు) ప్రాచుర్యం పొందడానికి అనుగుణమైన ఆవిష్కరణలపై బ్యాంక్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది.
అంతేకాకుండా, డిపాజిట్ సమీకరణ కోసం బ్యాంక్ భారీ ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టింది.
ఇదీ చదవండి: బీమా పాలసీ వెనక్కిస్తే మెరుగైన ప్రయోజనాలు!
కొత్త ఖాతాలను తెరవడంపై బ్యాంక్ దృష్టి సారిస్తోంది. రోజుకు దాదాపు 50,000 నుంచి 60,000 సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలను తెరవడం లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో దాదాపు 50 శాతం డిజిటల్ ఛానెల్‌ల ద్వారానే తెరుస్తున్నాం.
వచ్చే 3–5 ఏళ్లలో రూ.లక్ష కోట్ల నికర లాభం మైలురాయిని దాటాలని దేశీయంగా బలమైన ఆర్థిక సంస్థగా అవతరించాలని ఎస్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని బ్యాంక్ నమోదుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment