
పిల్లలూ... ఇక్కడ మీరు టేబుల్ మీద చూస్తున్నది ఏమిటో తెలుసా? ఏనుగు. కాని ఏనుగు కాదు. పూర్వకాలపు ఏనుగు. ఐస్‌ఏజ్ కాలం నాటిది. ఇప్పటి ఏనుగులా కాక ఒంటి నించి రోమాలతో ఉండేది. దానిని ‘మమొత్’ అంటారు.
డైనోసార్లలాగానే ఇది కూడా భారీ ఆకారంతో ఉండేది. దీనికి పెద్ద పెద్ద దంతాలు ఉండేవి. కాని డైనోసార్లలాగానే 4000 ఏళ్ల క్రితం మమొత్‌లు కూడా అంతరించి పోయాయి. దానికి కారణం ఏమిటో అంతుపట్టలేదు కాని ఏదైనా మహమ్మారి కావచ్చని శాస్త్రవేత్తల ఊహ. అయితే వీటి కళేబరాలు రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలో దొరుకుతూనే ఉన్నాయి.
ఇక్కడ మీరు చూస్తున్నది రష్యాలోని ‘ఎకుషియా’ అనే చోట మంచు పొరల కింద దొరికిన పిల్ల మమొత్ కళేబరం. ఇది పిల్ల ఏనుగే అయినా దీని బరువు 180 కిలోలు ఉంది. ఇది 50 వేల ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఆ కళేబరానికి ‘నెక్రోప్సీ’ చేస్తున్న ఫొటోలు ఇవి. మనిషి మృతదేహాన్ని కోసి పరీక్ష చేస్తే ‘అటాప్సీ’. జంతువులను కోసి పరీక్ష చేస్తే ‘నెక్రోప్సీ’. ఈ పరీక్షల వల్ల మమొత్‌లకు సంబంధించిన మరిన్ని జీవన రహస్యాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటారు.
(చదవండి: 'చిన్నారి జర్నలిస్టు'..! ఏకంగా యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ..)