అన్నీ 'చదివాకే' విద్యా రుణం | Special story to education loan | Sakshi
Sakshi News home page

అన్నీ 'చదివాకే' విద్యా రుణం

Published Mon, Aug 6 2018 12:04 AM | Last Updated on Mon, Aug 6 2018 11:49 AM

Special story to education loan - Sakshi

ఇప్పుడు విద్యా రుణం గతంతో పోలిస్తే చాలా తేలిగ్గా, చౌకగా పొందడం సాధ్యమే. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల రాకతో  విద్యా రుణాల విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య పోటీ ఏర్పడింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ  ప్రోత్సాహమూ ప్రధాన కారణమనే చెప్పాలి. అయితే, సులభంగా విద్యా రుణాలు పొందే పరిస్థితులున్నప్పటికీ, దరఖాస్తుదారులు మాత్రం ముందుగా అన్ని అంశాలూ విచారించుకున్నాకే రుణం తీసుకునే దిశగా అడుగులు వేయాలన్నది నిపుణుల సూచన.     – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం 

కోర్స్, సంస్థ కీలకం... 
పలు ప్రైవేటు విద్యా సంస్థల్లో బ్యాంకుల తరఫున విద్యా రుణాల మంజూరు కోసం డెస్క్‌లు ప్రారంభమవుతున్నాయి. అయితే, సులభంగా రుణం వస్తోంది కదా అని కోర్సునో, విద్యా సంస్థనో మార్చుకోవటం సరికాదన్నది నిపుణుల సూచన. విద్యా సంస్థ, కోర్సు కచ్చితంగా సరిపడేది అయి ఉండాలని, భవిష్యత్తులో ఏం చేయాలన్న అంశం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని బ్యాంక్‌ బజార్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి సూచించారు. కనుక ఏ కోర్స్‌ చేయాలన్నది నిర్ణయించుకున్నాకే రుణం ఎంత అవసరమన్నది తెలుసుకోవాలి. ట్యూషన్‌ ఫీజులకు తోడు హాస్టల్‌ చార్జీలు, మెస్‌ ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు అన్నింటినీ అంచనా వేశాకే రుణం ఎంతన్నది స్పష్టం అవుతుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చే మొత్తాన్ని ఈ వ్యయాల నుంచి మినహాయించాలి. మిగిలిన మేర విద్యా రుణానికి వెళ్లాల్సి ఉంటుంది.  

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. మీరు చదివిన చదువు.... ఆ తర్వాత విద్యా రుణాన్ని తిరిగి తీర్చివేసేందుకు అక్కరకు రావాలి. బ్యాంకులు కేవలం అభ్యర్థి విద్యా సంస్థ, కోర్సు ఆధారంగా తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేస్తాయని, రుణం తీసుకునే వారు మాత్రం తమ కోర్సుకున్న ఉద్యోగావకాశాలు చూసి... తిరిగి చెల్లించగలమా, లేదా అనేది నిర్ణయించుకోవాలని క్రెడిట్‌ మంత్రి సీఈవో రంజిత్‌ పుంజా చెప్పారు. ఇందుకోసం ఇప్పటి వరకు ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికున్న ప్లేస్‌మెంట్‌ అవకాశాలు, కంపెనీలు ఆఫర్‌ చేసిన వేతనం తాలూకు పూర్వ గణాంకాలు సాయపడతాయని తెలియజేశారు. గరిష్ట వేతన ఆఫర్‌ కాకుండా సగటు వేతన ఆఫర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే, కోర్సు అనంతరం పొందే వేతనం మొత్తంలో రుణం కోసం చేసే ఈఎంఐ చెల్లింపులు 30 శాతాన్ని మించకుండా చూసుకోవాలని కూడా పుంజా అభిప్రాయపడ్డారు. 

వడ్డీ రేట్లు ఎంత? 
ఇక విద్యా రుణం విషయంలో చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం వడ్డీ రేటు. ఎన్‌ఎస్‌డీఎల్‌ నిర్వహించే ఠీఠీఠీ.ఠిజీఛీy్చ  ్చజుటజిఝజీ.ఛిౌ.జీn అనే పోర్టల్‌ ఇందుకు సాయపడుతుంది. అన్ని బ్యాంకుల విద్యా రుణాల వడ్డీ రేట్ల వివరాలు ఇందులో లభిస్తాయి. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐఎం, ఐఐటీల్లో చదివే వారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను ఆఫర్‌ చేస్తున్నాయి. కారణం వీటిల్లో చదివిన వారికి మెరుగైన వేతన ప్యాకేజీలతో ఆఫర్లు ఉండడమే. ఇండియన్‌ బ్యాంకు అయితే ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌సీల్లో చదివే వారికి విద్యా రుణాలను 9.95 శాతం వార్షిక వడ్డీ రేటుకే ఆఫర్‌ చేస్తోంది. అలాగే, ఎన్‌ఐటీలో చదివే విద్యార్థులకు 10.45 శాతం వడ్డీ రేటును చార్జ్‌ చేస్తుండగా, ఇతర సంస్థల్లో చదివే వారికి మాత్రం 11.75 శాతం రేటును అమలు చేస్తోంది. అలాగే, ప్రభుత్వ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లను పొందే విద్యార్థుల విషయంలో బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి.  పర్సనల్‌ లోన్స్‌ కంటే విద్యా రుణాలు చౌకే అయినా, గృహ రుణాలతో పోలిస్తే కాస్తంత ఖరీదైనవే. ఎందుకంటే గృహ రుణం సెక్యూర్డ్‌ లోన్‌ అవుతుంది. కానీ, విద్యా రుణం అన్‌సెక్యూర్డ్‌ లోన్‌. దీనిపై బ్యాంకులకు డిఫాల్ట్‌ రిస్క్‌ ఉంటుంది. ఇక, విద్యా రుణం మొత్తం భారీగా ఉంటే బ్యాంకులు హామీలను అడుగుతున్నాయి. దాదాపుగా ఎక్కువ కేసుల్లో ఇది గార్డియనే. సంరక్షకుల క్రెడిట్‌ హిస్టరీ లేదా అదనపు హామీలు ఇవ్వడం వల్ల విద్యా రుణాలపై వ్యయాలు తగ్గించుకోవచ్చు. చాలా బ్యాంకులు 10 ఏళ్ల కాలానికి విద్యా రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే, రుణం రూ.7.5 లక్షలు ఆ పైన ఉంటే కాల వ్యవధిని మరో ఐదేళ్ల పాటు అంటే మొత్తం మీద 15 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు. కాల వ్యవధి ఎక్కువ ఉంటే రుణ వాయిదా మొత్తం తగ్గుతుంది. మొత్తం మీద చెల్లించే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీర్ఘకాలం ఉంటే ఈఎంఐ వేతనంలో 30 శాతం మించకుండా చూసుకోవచ్చని పుంజా తెలిపారు. అయితే, దీర్ఘకాలానికి తీసుకున్నా, ఉద్యోగంలో చేరాక వెసులుబాటు చేసుకుని ముందస్తుగా రుణాన్ని తీర్చివేయడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. విద్యా రుణంపై ఆదాయపన్ను ప్రయోజనం కూడా ఉంది. విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపుల మొత్తాన్ని సెక్షన్‌ 80ఈ కింద ఎనిమిదేళ్ల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.  

మారటోరియం కూడా ఉంది... 
విద్యా రుణాల్లో మారటోరియం అనే ప్రత్యేకమైన సదుపాయం కూడా ఉంది. కోర్సు పూర్తయిన 12 నెలల వరకు లేదా ఉద్యోగంలో చేరిన ఆరు నెలల వరకు (ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది) విద్యా రుణం చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. అయితే, గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ మారటోరియం కాలంలో రుణంపై వడ్డీ పడుతూనే ఉంటుంది. అందుకని వడ్డీ భారంగా మారే వరకు వేచి ఉండకుండా కోర్సు పూర్తయిన వెంటనే రుణ ఈఎంఐ చెల్లింపులు మొదలు పెట్టడం మంచిదనేది ఆదిల్‌శెట్టి సూచన. ఇక మరో అంశం విద్యారుణం ఓ వ్యక్తి జీవితంలో తీసుకునే మొదటి రుణం అవుతుంది. కనుక సరైన చెల్లింపుల ద్వారా మంచి క్రెడిట్‌ స్కోరుకు బాటలు వేసుకోవడానికి ఇదో అవకాశం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement