ఎడ్యుకేషన్‌లోన్‌ కావాలా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి.. | Awareness article on getting an educational loan | Sakshi
Sakshi News home page

విద్యా రుణం.. అన్నీ ఆలోచించాకే..!

Published Mon, Jun 6 2022 4:39 AM | Last Updated on Mon, Jun 6 2022 7:49 AM

Awareness article on getting an educational loan - Sakshi

విదేశాల్లో చదువుకుని, కెరీర్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టాలన్నది చైతన్య (24) డ్రీమ్‌. బీటెక్‌ చేసిన తర్వాత రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేశాడు. ఫ్రాన్స్‌లోని మాంట్‌పెల్లియర్‌ బిజినెస్‌ స్కూల్లో ఎంఎస్‌సీ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాడు. డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కోర్సుకు పాక్షికంగా స్కాలర్‌ షిప్‌ రావడంతో అతడు ఎంతో సంతోషించాడు. కానీ, అప్పుడే అసలు సవాలు ఎదురైంది.

వచ్చిన స్కాలర్‌షిప్‌ కొద్ది మొత్తమే, మిగిలిన మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విద్యా రుణం సులభంగా లభిస్తుందని అనుకోవచ్చు. కానీ, ఆచరణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెల రోజుల పాటు ప్రశాంతత కోల్పోయి అతడు చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సీటు కావడంతో బ్యాంకు విద్యా రుణానికి ఓకే చెప్పింది. అందుకే, విద్యా రుణం పొందడం అనుకున్నంత సులభం కాదు.

రుణం ఇచ్చే సంస్థ అన్ని విషయాలను స్పృశిస్తుంది. ఎలా వ్యవహరిస్తే సులభంగా రుణం లభిస్తుంది? ఈ విషయంలో ఉన్న సవాళ్లు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించే కథనమే ఇది.  ఏటా వేలాది మంది భారత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. విదేశాంగ శాఖ వద్దనున్న తాజా సమాచారం మేరకు.. కరోనా తర్వాత కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. 2021లో 11 లక్షల మంది భారత విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్లారు. 2024లో భారత్‌ నుంచి సుమారు 18 లక్షల మంది విదేశాల్లో ఉన్నత విద్యను ఎంపిక చేసుకోవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్‌ అంచనా. వారు చేసే ఖర్చు వార్షికంగా 80 బిలియన్‌ డాలర్లు (రూ.6.16 లక్షల కోట్లు) ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది.

విద్యా రుణాన్ని నమ్ముకుని విదేశీ విద్యకు ప్లాన్‌ చేసుకునే వారు ముందుగానే ఇందుకు సంబంధించి వాస్తవ అంశాలను, పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా విచారించుకోవాలి. ‘‘ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగం విద్యా రుణాలను పరిమితంగానే మంజూరు చేస్తోంది. వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఆమోదం చెప్పడం లేదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల పూర్తి జాబితానే చాలా బ్యాంకుల వద్ద లేదంటే విద్యా రుణాల విషయంలో వాటికి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు’’అని లాంచ్‌మైకెరీర్‌ అనే కెరీర్‌ కౌన్సెలింగ్‌ ప్లాట్‌ఫామ్‌ గ్లోబల్‌ లీడర్‌ సుష్మాశర్మ తెలిపారు.

బ్యాంకును గుర్తించడం..
విద్యా సంస్థలు, దేశాలకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. తమ ముందుకు వచ్చే ప్రతి విదేశీ విద్యా రుణ దరఖాస్తును బ్యాంకులు ఆమోదించవు. పైగా ఒక బ్యాంకుకు సంబంధించి కూడా అన్ని శాఖలు ఈ వ్యాపారం చూడడం లేదు. చైతన్య ముందుగా ఎన్‌బీఎఫ్‌సీ నుంచి రుణం తీసుకుందామని అనుకున్నాడు. సులభంగా, వేగంగా వస్తుందని అనుకుని కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలను సంప్రదించాడు. కానీ, ఒక్కటంటే ఒక్కటీ చైతన్య సీటు సంపాదించిన యూనివర్సిటీ కోర్సులకు రుణాలను ఆఫర్‌ చేయడం లేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. చివరికి ఎస్‌బీఐని సంప్రదించగా అతడి ప్రయత్నం ఫలించింది. అదీ మెయిన్‌ బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చింది.

కావాల్సినంత రుణం..
విదేశీ విద్యా కోర్సు అంటే ఫీజులకే బోలెడు ఖర్చు అవుతుంది. ఇదే పెద్ద సవాలు. విదేశీ విద్యా సంస్థల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే ముందే ట్యూషన్‌ పీజులతోపాటు అక్కడ నివసించేందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుష్మాశర్మ సూచించారు. ఇక కావాల్సినంత రుణం లభించక, తాము సొం తంగా సమకూర్చుకోలేని సందర్భాల్లో విద్యార్థులు రాజీమార్గాలను అనుసరించడాన్ని గమనించొచ్చు. కావాల్సి నంత రుణం/నిధులు సమకూరని సందర్భంలో అవసరమైతే కోర్సును లేదంటే విద్యా సంస్థను మార్చే వారు కూడా ఉన్నట్టు ఫ్లై మాస్టర్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్స్‌ ఎండీ రాజేష్‌ వర్మ తెలిపారు.

ఉద్యోగ అవకాశాలు..
రుణం ఇచ్చే ముందు ఏ బ్యాంకు అయినా, మరో సంస్థ అయినా ఏం చూస్తుంది..? రుణం తీసుకున్న వ్యక్తికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా..? అనే కదా.. అలాగే, విద్యా రుణం విషయంలో బ్యాంకులు అభ్యర్థి చేస్తున్న కోర్సు, ఉద్యోగ మార్కెట్లో ఆ కోర్సుకు ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తాయి. ఇందులో భాగంగా విద్యార్థి చదవబోయే విద్యాసంస్థకు ఉన్న పేరు, గుర్తింపు, అందులో చదివిన వారికి ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి.

‘‘విద్యార్థి కేంబ్రిడ్జ్‌ లేదా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ వంటి విద్యా సంస్థలకు వెళ్లొచ్చు. కానీ, ఈ తరహా ప్రతిష్టాత్మక, పేరొందిన ఇనిస్టిట్యూషన్స్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి బదులు విద్యార్థులు ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో చివరికి పెద్దగా తెలియని యూనివర్సిటీలో అడ్మిషన్‌తో వారు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అటువంటప్పుడు విద్యా రుణం కష్టంగా మారుతుంది’’ అని విద్యా రుణాల మార్కెట్‌ప్లేస్‌ అయిన విమేక్‌స్కాలర్స్‌ సహ వ్యవస్థాపకుడు అర్జున్‌ ఆర్‌ కృష్ణ తెలిపారు.

పేపర్‌ వర్క్‌
కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ముఖ్యమైన కార్యక్రమం. డాక్యుమెంట్‌ ప్రక్రియ ఎంత క్లిష్టమో ఇప్పటికే రుణం తీసుకుని విదేశీ విద్యా కోర్సు చేస్తున్న వారిని అడిగితేనే తెలుస్తుంది. విభా షణ్ముఖ్‌ (33) యూఎస్‌లోని రైస్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చదువుతున్నారు. డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ ఎంత క్లిష్టతరమో తన అనుభవాన్ని వెల్లడించారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో ఎంఎస్‌సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివేందుకు 2013లో ఆయన ఓ ప్రభుత్వ రంగ బ్యాం కులో రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘‘బ్యాంకు అడిగిన అన్ని పత్రాలను తీసుకెళ్లి ఇచ్చాను. అయినా కానీ, కోర్సుకు అయ్యే ఖర్చు, ఇతర వ్యయాలకు సంబంధించి యూనివర్సిటీ నుంచి ధ్రువీకరణ పత్రం కావాలని బ్యాంకు అడిగింది. కానీ యూనివర్సిటీల నుంచి ఈ తరహా పత్రాలు పొందడం అదిపెద్ద సవాలు’’అని షణ్ముఖ్‌ తెలిపారు.

తాకట్టు..
దేశీ యూనివర్సిటీల్లో కోర్సుల కోసం రుణాలు తీసుకునేట్టు అయితే బ్యాంకులు తనఖా కోరవు. కానీ, విదేశీ వర్సిటీల్లో విద్య కోసం తీసుకునే రుణాలకు సంబంధించి తనఖా పెట్టాలని బ్యాంకులు అడుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు తనఖా కోరుతున్నాయి. తనఖా కింద స్తిరాస్థి, ప్రావిడెంట్‌ ఫండ్‌ లేదా సెక్యూరిటీ డిపాజిట్‌ ఇస్తే సరిపోతుంది. చాలా ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రైవేటు బ్యాంకులు తనఖా అడగడం లేదు. మాస్టర్స్‌ కోర్సులకు తనఖా లేకుండానే ఇవి రుణాలు ఇస్తున్నాయి. వివరాలు సమగ్రంగా తెలుసుకుని ముందడుగు వేయాలి.

అధిక వ్యయాలు
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణానికి డాక్యుమెంట్లు సమర్పణ, ఆమోదం ప్రక్రియ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అదే ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రైవేటు బ్యాంకుల నుంచి విద్యా రుణం సులభంగానే లభిస్తుంది. కాకపోతే ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే వీటిల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ చార్జీలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణాలపై రేట్లు 6.9 శాతం నుంచి 12.5 శాతం మధ్య ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో 10.5 శాతం నుంచి 13 శాతం మధ్య ఉన్నాయి.

ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రైవేటు బ్యాంకులు (ఎక్కువ శాతం) ఇచ్చే విద్యా రుణాలకు మారటోరియం ఉండడం లేదు. దీంతో రుణం మంజూరు చేసిన మరుసటి నెల నుంచే చెల్లింపులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. మారటోరియం అంటే.. కోర్సు కాల వ్యవధికి ముగిసిన తర్వాత ఆరు నెలల వరకు రుణానికి చెల్లింపులు చేయక్కర్లేదు. కోర్సు అనంతరం ఉద్యోగం పొందేందుకు వీలుగా ఆరు నెలల వ్యవధి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి కుటుంబానికి ఎంతో ఉపశమనం ఉంటుంది. అందుకుని రుణానికి వెంటనే చెల్లింపులు చేయలేని వారు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మారటోరియంతో కూడిన విద్యా రుణానికే ప్రయత్నించాలి.

రుణానికి ముందే ప్రణాళిక ఉండాలి..
సాధారణంగా విద్యార్థులు తమ బడ్జెట్‌ కోణం నుంచి విదేశాల్లో ప్రవేశాలకు ప్రయత్నిస్తుంటారు. అంటే తక్కువ వ్యయాలు అయ్యే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుంటారు. దీనివల్ల అంతగా ప్రాచుర్యం లేని దేశం లేదా విద్యా సంస్థలో చేరాల్సి వస్తుంది. అందుబాటు ధరలు ఏ దేశంలో ఉన్నాయో విచారించుకుని అక్కడ విద్యాసంస్థను ఎంపిక చేసుకుంటున్నారు. ‘‘ఉదాహరణకు ఒక విద్యార్థి రూ.20లక్షలు ఖర్చు చేయగలనని అనుకుంటే ఆమె లేదా అతడు జర్మనీలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు.

అంతకంటే ఎక్కువ బడ్జెట్‌ పెట్టుకోగలిగితే యూఎస్‌ లేదా యూకేలో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. విద్యా రుణం పొందే విషయంలో పేరున్న యూనివర్సిటీయే కాకుండా, దేశానికీ ప్రాధాన్యం ఉంటుంది’’అని కృష్ణ వివరించారు. విద్యా సంస్థలు పేరున్నవి, ప్రతిష్టాత్మకమైనవి అయితే బ్యాంకులు తనఖా కోరడం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు అయితే యూనివర్సిటీలు, కోర్సులతో జాబితాను నిర్వహిస్తున్నాయి.

ఏఏ వర్సిటీలు, ఏ కోర్సులకు తక్కువ వడ్డీ రేటు రుణాలు, తక్కువ తనఖాతో మంజూరు చేయాలో ఈ జాబితానే వాటికి ప్రామాణికంగా ఉంటోంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతోపాటు ప్రొడిగీ ఫైనాన్స్, ఎంపవర్‌ ఫైనాన్సింగ్‌ తదితర అంతర్జాతీయ సంస్థలు సైతం విద్యా రుణాలు ఇస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు విద్యారుణాల పరంగా సాయాన్ని అందిస్తున్నాయి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నవారు, సరైన పత్రాలను అందించలేని వారికి విద్యా రుణం పరంగా ప్రైవేటు బ్యాంకులు సౌకర్యం’’అని కృష్ణ తెలిపారు.

స్కాలర్‌షిప్‌
‘‘విదేశీ విద్య కోసం వెళ్లే వారిలో కోర్సుకు అయ్యే వ్యయం మేర పూర్తి స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం 2–3 శాతం మందికే ఉంటుంది. కానీ, పాక్షిక స్కాలర్‌షిప్‌ను అందించే విద్యా మండళ్లు, ఇనిస్టిట్యూషన్స్‌ కూడా ఉన్నాయి’’అని కృష్ణ తెలిపారు. దరఖాస్తు సమయంలోనే స్కాలర్‌షిప్‌ కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఎన్నో పథకాలు అవకాశాలున్నట్టు చెప్పారు. సున్నా వడ్డీ రుణాలు, విరాళాలు కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. టాటా ఫౌండేషన్, అగాఖాన్‌ ఫౌండేషన్‌ తదితర సంస్థలు సాయం అందిస్తున్నాయి. స్కాలర్‌షిప్‌ పొందడంలో సాయపడే జ్ఞాన్‌ధన్, విమేక్‌ సొల్యూషన్స్‌ తదితర సంస్థలు కూడా ఉన్నాయి.

క్రెడిట్‌ స్కోరు
విద్యా రుణం విషయంలోనూ మంచి క్రెడిట్‌ స్కోరు సాయపడుతుంది. దరఖాస్తు ఆమోదానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకునే వారు మంచి క్రెడిట్‌ స్కోరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాలేజీకి వచ్చిన పిల్లలు ‘బై నౌ పే లేటర్‌’ సదుపాయాలను విచ్చలవిడిగా ఉపయోగించుకుని చెల్లించకుండా వదిలేస్తున్నారు. ఈ తరహా చర్యలు రుణాలకు అడ్డంకిగా మారతాయి. విదేశ విద్య ప్రణాళిక ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్‌ హిస్టరీలో మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  తల్లిదండ్రులూ ఈ విషయంలో పిల్లల వ్యయాల పట్ల శ్రద్ధ చూపాలి.

డాక్యుమెంట్లు
విద్యా రుణానికి కేవైసీ డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలి. కేవైసీ అంటే గుర్తింపు, వయసు, చిరునామాను ధ్రువీకరించేవి. వీటితోపాటు గ్రాడ్యుయేషన్‌ మార్కుల మెమో షీటు, సెకండరీ స్కూల్, హైస్కూల్‌ ఇలా విద్యకు సంబంధించి అన్ని మెమో పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. తల్లిదండ్రులు లేదంటే సంరక్షకుల ఆదాయ రుజువు సర్టిఫికెట్‌ అవసరం. తనఖా కోసం ఉంచతగిన ఇల్లు, పొలం, ప్లాట్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదంటే పీపీఎఫ్‌ ఖాతా పాస్‌ బుక్, యూనివర్సిటీలో ప్రవేశాన్ని ధ్రువీకరిస్తూ మంజూరు చేసే లేఖ, కోర్సు ఫీజుల చెల్లింపుల షెడ్యూల్, స్కాలర్‌షిప్‌ లెటర్, రుణ గ్రహీత బ్యాంకు స్టేట్‌మెంట్‌ (చివరి ఆరు నెలలు), తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్, ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు, తల్లిదండ్రుల ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు సిద్ధం చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు రుణ దరఖాస్తుదారుడి వాటా కింద చెల్లించే మొత్తానికి మూలాన్ని అడుగుతాయి. అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

ఉద్యోగ అవకాశాలు చూడాలి
రుణం సాయంతో విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారు చూడాల్సిన ముఖ్యమైన వాటిల్లో.. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు ఒకటి. దీనివల్ల తీసుకునే రుణాన్ని తిరిగి తీర్చివేసే సామర్థ్యాలపై స్పష్టత తెచ్చుకోవచ్చు. విద్యా రుణాల్లో పెరుగుతున్న ఎగవేతలు ఈ విషయంలో ముందు జాగ్రత్త అవసరమని తెలియజేస్తన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన విద్యా రుణాల్లో 9.55 శాతం నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏలు) 2020లో వర్గీకరించినట్టు 2021 పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం స్వయంగా తెలిపింది. కోర్సు అనంతరం అక్కడే కొంతకాలంపాటు ఉండి ఉపాధి అవకాశాన్ని సొంతం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘గతంలో అయితే కొన్ని దేశాలు కోర్సు అనంతరం కేవలం కొన్ని నెలల పాటే ఉపాధి అవకాశాల అన్వేషణకు వీలుగా ఉండనిచ్చేవి. కానీ, ఇప్పుడు బ్రిటన్‌ సహా చాలా దేశాలు గ్రాడ్యుయేట్‌ రూట్‌ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాయి. వీటి కింద ఉన్నతవిద్య అనంతరం అక్కడే కొన్నేళ్లపాటు ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు’’అని ఓ కన్సల్టెన్సీ అధినేత తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement