పిల్లల్లో ఆరోగ్య సమస్యలపై జాతీయ టాస్క్‌ఫోర్స్
♦ ఆసియా-పసిఫిక్ పీడియాట్రిక్ సదస్సులో తీర్మానం
♦ స్థూలకాయం, ఆహార అలవాట్లపై పాఠశాలల్లో అవగాహన
♦ దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా నాలుగు నగరాల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: పిల్లల్లో ఆరోగ్య సమస్యలపై, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లపై పెద్ద ఎత్తున అవగాహన పెంచేందుకు జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. పిల్లల్లో మధుమేహం, స్థూలకాయం, కేన్సర్, గుండె జబ్బులు పరిపాటిగా మారిన నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, 19 ఏళ్ల లోపు యువతీ యువకులకు వీటిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ టాస్క్‌ఫోర్స్ కృషిచేస్తుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న పెడికాన్-2016 సదస్సులో రెండో రోజు శుక్రవారం ఈ మేరకు తీర్మానించారు.
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ నిర్మలతో పాటు స్వాతి భావే (పుణే), రేఖ హరీశ్ (జమ్ము కశ్మీర్), వాసుదేవ్ (ఢిల్లీ), రమేశ్ ధంపురి టాస్క్‌ఫోర్స్‌లో ఉన్నారు. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లోని పాఠశాలల విద్యార్థులతో వీరు భేటీ అయి ఈ సమస్యలపై వారికి అవగాహన కల్పిస్తారు. పాఠశాలల్లో జంక్‌ఫుడ్ తినకుండా పిల్లలను, రోజువారీ వ్యాయామం ప్రాధాన్యంపై ఉపాధ్యాయులను చైతన్యపరుస్తారు. ఆయా నగరాల్లో ఎంపిక చేసిన స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపడతారు.
యువతలో పొగాకు, మద్యానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడతారు. సీబీఎస్‌సీ స్కూళ్లల్లో జంక్‌ఫుడ్ తినొద్దంటూతీసుకున్న నిర్ణయం అంతటా అములయ్యేలా చూస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కలిసి వీటిపై అవగాహన చర్యలు చేపడతారు. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టును అమలు చేశాక, ఆ అనుభవంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రచించాలని సదస్సు పిలుపునిచ్చింది.
ప్రధానంగా 10-19 ఏళ్ల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం మద్యం, పొగాకుకు పిల్లలను దూరంగా ఉంచడం, వారికి వ్యాయామం తప్పనిసరి చేయడం. టీవీ వీక్షణ తగ్గించడంపై దృష్టి పెట్టాలని కూడా నిర్ణయించింది. దేశవిదేశాల నుంచి వచ్చిన పిల్లల వైద్య నిపుణులు పిల్లల ఆరోగ్యం పట్ల సదస్సులో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లల్లో ఇన్‌ఫెక్షన్లు తగ్గినా స్థూలకాయం, మధుమేహం, కేన్సర్, బీపీ తదితరాలు పరిపాటిగా మారాయని వ్యక్తంచేశారు. పిల్లలకు అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడాన్ని ఆపాలని సదస్సు కోరింది. ఇండియా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో వాక్ నిర్వహించారు.