
సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
వివక్షాపూరిత నిబంధనల కొట్టివేత
న్యూఢిల్లీ: దృష్టి లోపం ఉన్నంత మాత్రాన జ్యుడీషియల్ సర్వీస్‌లో ఉద్యోగావకాశాలను నిరాకరించడం కూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ఉద్యోగాలకు వాళ్లు అనర్హులని పేర్కొంటున్న మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీస్ (ఎంపీజేఎస్) నిబంధనలను కొట్టేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం సోమవారం ఈ మేరకు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దృష్టి లోపమున్న వారికి పలు రాష్ట్రాలు జ్యుడీషియల్ సర్వీస్ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా కల్పించకపోవడం తదితరాలపై దాఖలైన కేసులను ధర్మాసనం విచారించింది.
‘‘వైకల్యం ఆధారంగా వివక్ష చూపరాదన్నది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 కూడా అదే చెబుతోంది’’ అని పేర్కొంది. ‘‘దృష్టి లోపమున్న అభ్యర్థులకు జ్యుడీషియల్ పోస్టుల్లోనూ సముచిత ప్రాతినిధ్యం దక్కాలి. ఎంపిక ప్రక్రియలో ప్రతి దశలోనూ ఇందుకు అవసరమైన అన్ని చర్యలనూ ప్రభుత్వాలు చేపట్టాలి. వారికి కటాఫ్ మార్కులను విడిగా నిర్ణయించాలి. మెరిట్ లిస్టునూ విడిగానే సిద్ధం చేయాలి. దాని ఆధారంగానే ఎంపిక జరగాలి’’ అని ఆదేశించింది. దృష్టి లోపం కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు లేకపోతే కటాఫ్ మార్కులను తగ్గించేందుకు కూడా ధర్మాసనం ఈ సందర్భంగా అనుమతించింది. న్యాయ వ్యవస్థలో ఇప్పటికే చేపట్టిన, ఇకపై చేపట్టబోయే భర్తీ ప్రక్రియలన్నింటికీ ఈ తీర్పును ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేసింది.
రాజ్యాంగ స్ఫూర్తీ అదే
జ్యుడీషియల్ సర్వీసులకు పోటీ పడేందుకు దృష్టి లో పమున్న వాళ్లు పూర్తిగా అర్హులేనని జస్టిస్ మహదేవన్ స్పష్టం చేశారు. ధర్మాసనం తరఫున ఈ మేరకు 122 పేజీల తీర్పు ఆయనే రాశారు. ‘‘ఈ విషయంలో ఎంపీజేఎస్‌లో పొందుపరిచిన నిబంధనలు రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వపు హక్కు తదితరాలకు పూర్తిగా విరుద్ధం. నిజానికి ఇలాంటి విషయాల్లో సముచిత ప్రాతినిధ్య సూత్రాలను పాటించాలి. అంతే తప్ప కాఠిన్యం కూడదు. కఠినమైన కటాఫ్ నిబంధనలు తదితర పరోక్ష అడ్డంకుల ద్వారా దివ్యాంగులను ఉద్యోగావకాశాలకు దూరం చేయకూడదు. పలు అంతర్జాతీయ సూత్రాలు, ఒప్పందాలు కూడా అదే చెబుతున్నాయి’’ అన్నారు.
‘‘పౌరులందరినీ కలుపుకుని ముందుకు సాగాలన్న సూత్రమే మన రాజ్యాంగానికి పునాది. రాజ్యాంగపు మౌలిక స్వరూపంలో విడదీయలేని భాగం. సమానత్వం తదితర ప్రాథమిక హక్కులన్నింటికీ మూలాధారం. ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆర్టికల్స్ 14, 15, 16ల్లో దీన్ని విస్పష్టంగా పేర్కొన్నారు’’ అని న్యాయమూర్తి గుర్తు చేశారు. ‘‘సముచిత ప్రాతినిధ్యం పౌరుల ప్రాథమిక హక్కే తప్ప విచక్షణాత్మక చర్య కాదు. దివ్యాంగులకు సమానత్వం కూడా అందులో అంతర్భాగమే’’ అని సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకిస్తూ స్పష్టం చేశారు. ‘‘సమాజంలోని బలహీన వర్గాల ప్రయోజనాల పరిరక్షణను 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ప్రభుత్వాల తప్పనిసరి బాధ్యతగా మార్చుకున్నాం. ఈ నిర్వచనం పరిధిలోకి శారీరక, మానసిక వికలాంగులు కూడా వస్తారు’’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment